వెజ్‌ మంచిదా? నాన్‌ వెజ్‌ మంచిదా? | World Vegan Day 2025: Benefits of Vegetarian & Vegan Diet for Better Health | Sakshi
Sakshi News home page

World Vegan Day 2025 శాకాహారంతో ఆరోగ్య ప్రయోజనాలు

Nov 1 2025 1:13 PM | Updated on Nov 1 2025 1:33 PM

World Vegan Day 2025 : veg or non veg benefits of vegan food

శాకాహారం తీసుకునే వారిలో రకరకాల వారుంటారు. కొందరు మాంసాహారాన్ని ఏమాత్రం తీసుకోకపోయినా గుడ్డు వంటి వాటిని శాకాహారంగా ఎంచి అంతవరకు తీసుకుంటూ ఉంటారు. కొందరు జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగు వంటి వాటినీ తీసుకుంటారు గానీ జంతుమాంసానికి దూరంగా ఉంటారు. వీళ్లనే వెజిటేరియన్స్‌గా చెబుతారు. అయితే శాకాహార నియమాలను చాలా కఠినంగా  పాటించే వారిలో మరికొందరు మాంసాన్ని ఎలాగూ తినరు సరే... జంతువుల నుంచి వచ్చే ఉత్పాదనలైనపాలు, పెరుగు వంటి వాటికి సైతం దూరంగా ఉంటారు. ఇలాంటి వారినే ‘వీగన్స్‌’ అని, వారు ఆచరించే శాకాహార వీగనిజమ్‌ అంటారు. ఈరోజు (నవంబరు మొదటి తేదీ) ‘వరల్డ్‌ వీగన్స్‌ డే’  (World Vegan Day 2025 ) సందర్భంగా శాకాహారంతో కలిగే అనేక ప్రయోజనాలనూ అలాగే వీగనిజమ్‌తో ఉన్న కొన్ని ప్రతికూలతలనూ, శాకాహారంతోనే వాటిని అధిగమించే మార్గాలను తెలుసుకుందాం.

శాకాహారం దేహానికి మేలు చేస్తుందని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. మాంసాహారం తీసుకోవడం వల్ల మన శరీరంలోకి కొన్ని సూక్ష్మజీవులు చేరే అవకాశం లేక΄ోలేదు. వాటివల్ల కొన్ని వ్యాధులూ దరిచేరవచ్చు. కానీ శాకాహారంతో అలాంటి ప్రమాదాలకు అవకాశాలు చాలా తక్కువ.

ఆకుకూరలతో త్వరగా కడుపెందుకు నిండుతుందంటే: భోజనంలోకి మటన్, చికెన్‌ వంటి మాంసాహారం ఉన్నప్పుడు నాలుగు ముద్దలు ఎక్కువగా తినడం కూడా కద్దు. ఇలా ఎందుకు జరుగుతుందంటే... ఆకుకూరలలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. జీవక్రియలకు ఏ మేరకు ఆహారం కావాలో మెదడుకు తెలుసు. అందుకే ఎంత తినాలనుకుంటే అంతా తినలేం.

సరిపోయినంత తినేశాక... మెదడు కడుపునకు ఓ సంకేతం పంపిస్తుంది. దాంతో సంతృప్త భావన కలుగుతుంది. దీన్నే ‘సేషియేషన్‌’ అంటారు. అదే పీచు పదార్థాలు లేని మాంసం తింటున్నప్పుడు దేహానికి అవసరమైన ఫైబర్‌ సమకూరక΄ోవడంతో కడుపునిండా ఆహారం ఉన్నప్పటికీ ‘ఇంకాస్త కావాలి, మరికాస్త తినాలి’ అనిపిస్తుంది. మెదడు నుంచి అందాల్సిన సంతృప్త సంకేతం అందకపోవడంతో ఇలా జరుగుతుంది. ఇది స్థూలకాయానికీ, తద్వారా అనారోగ్యాలకూ... ఇలా ఓ వలయం కొనసాగుతుంది. 

మరికాస్త తినాలనిపించే మాంసాహారం కంటే తగినన్ని పీచుపదార్థాల శాకాహారంతో త్వరగా కడుపునిండటమే ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది. ఎందుకంటే అవసరానికంటే ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పటికీ... అందులో ఫైబర్‌ తగినంతగా లేకపోవడంతో జీర్ణవ్యవస్థలోని చిన్నపేగు, పెద్దపేగు క్యాన్సర్లకు అవకాశాలు ఎక్కువ. అదే నిత్యం కూరగాయలు, ఆకుకూరలతో ఆహారం తీసుకునేవారిలో పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పైగా మాంసాహారంతో త్వరగా సంతృప్త భావన కలగక అదేపనిగా తింటూ ఉండటం వల్ల  ఆ ఆహారం కొవ్వు రూపంలో శరీరంలో పేరుకోవడం, దాంతో అనేక ఆరోగ్య అనర్థాలు కలగడం మామూలే. ఈ ప్రమాదాన్ని నివారించడానికి మాంసాహార ప్రియులు తమ జిహ్వ సంతృప్తి కోసం మాంసాహారాన్ని తీసుకుంటూ దానికి సమానంగా వెజిటబుల్‌ సలాడ్స్‌ తీసుకుంటూ ఉండాలి. దాంతో స్థూలకాయం, క్యాన్సర్ల ముప్పు తప్పుతుందని నిపుణుల మాట.

చదవండి: బ్లాక్‌ ఫంగస్‌ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?

ఆరోగ్యానికి ఆకుకూరలు చేసే మేలు... 
వెజిటబుల్స్‌గా పరిగణించే వాటిల్లో... కాయగూరలతోపాటు ఆకుకూరలూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాల వల్ల గుండెజబ్బుల నియంత్రణ, బరువు, బీపీ అదుపులో ఉండటం వంటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆకుకూరలు, పండ్లలో కాపర్, మెగ్నీషియమ్‌ వంటి ఖనిజాలు, లవణాలు, ఫ్లేవనాయిడ్స్‌ లభిస్తాయి. 

శాకాహారం నుంచి దొరికే కొవ్వుల్లో ఒమెగా 3, మ్యూఫా, ప్యూఫా వంటి ఆరోగ్యవంతమైన కొవ్వులుంటాయి. జంతువుల నుంచి లభ్యమయ్యే కొవ్వులలో చెడు కొలెస్ట్రాల్‌ మోతాదులు ఎక్కువగా ఉండటంతో... అవి అంత ఆరోగ్యకరం కాకపోగా, హృద్రోగాల వంటి జబ్బులకు దారితీస్తాయి. ఫలితంగా మాంసాహారం తినేవారితో  పోలిస్తే శాకాహారం తినేవాళ్లలో టైప్‌–2 డయాబెటిస్‌ (మధుమేహం) అవకాశాలు తక్కువ. అదే మాంసాహారం ఎక్కువ తినేవారిలో స్థూలకాయం వస్తుంది. ఈ స్థూలకాయం మళ్లీ మధుమేహం, రక్తపోటు వంటి అనేక సమస్యలకు ఒక రిస్క్‌ ఫ్యాక్టర్‌. ఆకుకూరలు తినేవాళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల చర్మానికి ఎప్పటికప్పుడు మంచి  పోషణ లభిస్తుంది కాబట్టి వాళ్లలో మేని మెరుపు బాగుంటుంది. ఏజింగ్‌ ఆలస్యం కావడం వల్ల చాలాకాలం పాటు యంగ్‌గా కనిపిస్తారు. 
 

ప్రోటీన్ల లభ్యత: శాకాహారంతో  పోలిస్తే మాంసాహారంలోనే ప్రోటీన్ల లభ్యత ఎక్కువ. మాంసాహార  ప్రోటీన్లతో  పోలిస్తే శాకాహార ప్రోటీన్లు 50 – 70 శాతమే జీర్ణమవుతాయి. అయితే శాకాహారంతోనే కావలసినన్ని ప్రోటీన్లు లభ్యం కావాలంటే పప్పులు, చిక్కుళ్లు, సోయా ఉత్పాదనలైన... సోయా బీన్స్, సోయా చీజ్, సోయా మిల్క్, టోఫూ వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. 

ఐరన్‌: రక్తహీనత (అనీమియా) నివారణకు ఐరన్‌ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. మాంసాహారం వల్ల దొరికే హీమ్‌ ఐరన్‌ తక్షణం రక్తంలో కలిసి పోతుంది. అయితే శాకాహారం నుంచి కూడా ఐరన్‌ లభ్యమవుతుంది గానీ... వాటినుంచి వచ్చే నాన్‌–హీమ్‌ ఐరన్‌... కొంత ప్రాసెస్‌ జరిగాకే రక్తంలోకి చేరుతుంది. అందువల్ల శాకాహారంతో దొరికే ఐరన్‌ కొంత ఆలస్యంగా రక్తంలోకి ఇంకుతుంది. 

ఇదీ చదవండి: Henna dye లివర్‌ సమస్యలకు హెన్నాతో చెక్‌?

అందువల్ల వీగన్స్‌ ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు  (పాలకూర, బ్రకోలీ), డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబిన్‌ నట్స్‌ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్‌–సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు, టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్‌ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది. 

విటమిన్‌ బి12 : ఇది కూడా మాంసాహారంలోనే పుష్కలంగా లభిస్తుంది. ఆ తర్వాత పాలలో అధికంగా ఉంటుంది. ఇక శాకాహారం నుంచే దీన్ని తీసుకోవాలంటే సోయామిల్‌ వంటి వాటిపై ఆధారపడాలి. కొన్ని సందర్భాల్లో శాకాహారుల్లో విటమిన్‌–బి12 తగ్గడం వల్ల మెదడు నుంచి అవయవాలకు ఆదేశాలందడంలో ఆటంకాలు, దాంతో స్పృహతప్పడం (సింకోప్‌) వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. 

ఎండకు ఎక్స్‌పోజ్‌ కాకుండా ఇన్‌డోర్స్‌లోనే ఉంటూ, శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారి లో విటమిన్‌–డి, విటమిన్‌–బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే వెజిటేరియన్‌ ఆహారంపైనే ఆధారపడే వీగన్స్‌... విటమిన్‌–డి, విటమిన్‌–బి 12, ఐరన్‌ వంటి కీలకమైన పోషకాల కోసం ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. 

విటమిన్‌ డి: మన శరీరంలోకి క్యాల్షియమ్‌  ఇంకిపోవాలంటే విటమిన్‌–డి అవసరం. మాంసాహారం నుంచి కాకుండా వెజిటేరియన్‌ ఉత్పాదనల ద్వారానే అది లభ్యం కావాలంటే సోయా వంటి ఉత్పాదనలపై ఆధారపడాలి. 

క్యాల్షియం కోసం: స్ట్రిక్ట్‌ వీగనిజమ్‌ పేరిట పాలూ, పాల పదార్థాలకు దూరంగా ఉండేవారిలో క్యాల్షియమ్‌ లోపం కనిపించే అవకాశాలున్నాయి.   అందుకే వీగన్స్‌ అందరూ తమ దేహాలకు, ఎముకలకు తగినంత క్యాల్షియం అందడం కోసం పాకూర, బ్రాకలీ,  పొద్దుతిరుగుడు గింజలు, సోయా ఉత్పాదనల వంటివి తీసుకోవాలి. 

శాకాహారం తీసుకునేవారిలో ఎముకలో బోన్‌ మాస్‌ తగ్గడం, దాంతో కండరాలు, ఎముకల (మస్కులో స్కెలిటల్‌) సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున కౌమార వయసులో ఉన్న (ఎడాలసెంట్‌) బాలలు, గర్భిణుల వంటి వారు అన్ని  పోషకాలు అందేలా, సమతులాహారం సమకూరేలా మరింత జాగ్రత్తగా పోషకాహారాన్ని తీసుకోవాలి.

శాకాహారంతో ప్రయోజనాలివే...
ఇటీవల వెల్లడవుతున్న పరిశోధనలు శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు ఇలా వివరిస్తున్నాయి. 
అనేక రకాల క్యాన్సర్లు ప్రధానంగా పెద్దపేగు (కొలోన్‌ క్యాన్సర్‌) ముప్పు తగ్గుదల;  ఫ్యాటీలివర్‌ రిస్క్‌ తగ్గే అవకాశం. 
∙మాంసాహారం వల్ల దేహంలో కొవ్వులు ఎక్కువగా పేరుకు΄ోవడంతో కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరిగి గుండెజబ్బులు, పక్షవాతం, కంటి జబ్బులు, హైబీపీ వంటి వాటికి ఆస్కారమిస్తాయంటూ అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇక మాంసాహారం అరగడానికి పట్టే సమయం ఎక్కువ కాబట్టి అది తిన్నప్పుడు చాలాసేపు మనిషి మందకొడిగా మారతాడని, చురుగ్గా ఉండటం జరగదనేది కొందరు నిపుణుల మాట. 

శాకాహారం వల్ల దేహంలో పేరుకుపోయే విష పదార్థాలు స్వాభావికంగానే తొలగిపోతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. దాంతో శాకాహార పదార్థాలను నేచురల్‌ డీ–టాక్సిఫైయింగ్‌ ఏజెంట్స్‌గా చెబుతారు. 

రంగురంగుల శాకాహారాలతో ఆరోగ్యం : మాంసాహారం సాధారణంగా ఒకే రకమైన రంగుతో కంటికి అంత ఇంపుగా కనిపించకపోవచ్చు. కానీ శాకాహారంలోని రకరకాల వెజిటెబుల్స్‌ అనేక రకాల రంగులీనుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఉదాహరణకు క్యారట్, బీట్‌రూట్‌లతో ΄ాటు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో లభ్యమయ్యే కాప్సికం (బెల్‌పెప్పర్‌) వంటివి. 

తేలికగా జీర్ణం: శాకాహారంలో పీచు ఎక్కువ కాబట్టి జీర్ణం కావడం కూడా చాలా తేలిక. ఆహారంలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్దకం, హయటస్‌ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్, పిప్పి పళ్లు (డెంటల్‌ కేరిస్‌), పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ జరుగుతుంది. శాకాహారం దేహానికి మేలు చేస్తుందని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. మాంసాహారం తీసుకోవడం వల్ల మన శరీరంలోకి కొన్ని సూక్ష్మజీవులు చేరే అవకాశం లేకపోలేదు. వాటివల్ల కొన్ని వ్యాధులూ దరిచేరవచ్చు. కానీ శాకాహారంతో అలాంటి ప్రమాదాలకు అవకాశాలు చాలా తక్కువ.

డాక్టర్‌ కె. శివరాజు
సీనియర్‌ ఫిజీషియన్‌ 

– నిర్వహణ, యాసీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement