రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవలే తన భార్య పరిణీతి చోప్రాతో కలిసి ‘కర్లీ టేల్స్’ వారి ‘తేరే గల్లీ మే’ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ హోస్ట్ కామియా జానీకి రాఘవ్ చద్దా.. పరిణీతి చేసిన స్పెషల్ ‘మష్రూమ్ టోస్ట్’ వంటకాన్ని రుచి చూపించారు. మొదట ఆ వంటకం ఎలా చేస్తారో ఊహించడానికి ప్రయత్నించిన ఆప్ నాయకుడు, చివరకు కచ్చితమైన రెసిపీ కోసం పరిణీతికి ఫోన్ చేసి కనుక్కున్నారు.
మష్రూమ్ టోస్ట్ రెసిపీ వివరాలు
ఫోన్ కాల్‌లో పరిణీతి, ఈ మష్రూమ్ టోస్ట్ రెసిపీ ‘చాలా సులభం‘ అని చెబుతూనే ఎలా చేయాలో వివరించారు.
తయారీ విధానం: ముందుగా ఒక పాన్‌లో వెన్న వేసి, ఆ తర్వాత ఒకటి లేదా ఒకటిన్నర చెంచాల మైదా కలపాలి. తర్వాత పాలు పోసి, అది చిక్కబడి క్రీమ్‌లాంటి తెల్లటి సాస్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. మరొక పాన్‌లో వెన్న వేసి, అందులో మష్రూమ్స్, ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, ఇతర పదార్థాలు వేసి బాగా వేయించాలి.
ఆ వేయించిన మష్రూమ్స్‌ను ముందుగా తయారుచేసిన వైట్ సాస్‌లో కలపాలి. చివరిగా, వంటకానికి మరింత రుచి, రిచ్‌నెస్ రావడానికి, తురుముకున్న పర్మేసన్ లేదా చెడ్దార్ చీజ్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని వేడిచేసి, టోస్ట్ చేసిన బ్రెడ్ స్లైస్‌లపై లేయర్ గా వేసి సర్వ్ చేయాలి. దీనిని చికెన్, చేపలు లేదా పన్నీర్‌తో కూడా తినొచ్చని పరిణీతి తెలిపారు.
(చదవండి: పుతిన్ భారత పర్యటన: రష్యా అధ్యక్షుడు ఇష్టపడే వంటకాలివే..!)


