
ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. కానీ 2016లోనే జరిగిన ఒక వెడ్డింగ్ వివాహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైందిగా రికార్డ్ దక్కించుకుంది. అదేంటో తెలుసా? పదండి తెలుసుకుందాం.
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దాని విలాసవంతమైన వివాహ వేడుకలకు ప్రసిద్ధి చెందింది. కానీ రష్యన్ బిలియనీర్ మిఖాయిల్ గుట్సేరీవ్ తన కొడుకు పెళ్లి కోసం పెట్టిన ఖర్చు ఏకంగా ఒక బిలియన్ డాలర్లు (ప్రస్తుత ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 876.94 కోట్లు). 2016లో అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డు క్రియేట్ చేసింది.
మరిన్ని విశేషాలు
మిఖాయిల్ గుట్సేరీవ్ కుమారుడు, 29 ఏళ్ల సయీద్ గుట్సేరీవ్, ఇరవై ఏళ్ల ఖాదీజా ఉజాఖోవ్స్‌ను వివాహం చేసుకున్నాడు. మాస్కోలోని ఒక విలాసవంతమైన రెస్టారెంట్‌లో ఈ జంట వివాహం చేసుకున్నారు. అతిరథమహారథులు హాజరయ్యే ఈ వివాహానికి భద్రత రీత్యా ఈ వేదికను ఎంచుకున్నారు.
వధువు 11.5 కిలోల ఎలీ సాబ్ గౌను ధరించింది. పెళ్లి నాటి తన దుస్తులు, తరాల బడి గుర్తుండిపోయేలా, ప్రత్యేకంగా ఉండాలని భావించిందట. అందుకే ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ ఎలీ సాబ్ చేత ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది. ఈ దుస్తులను పారిస్ నుండి దిగుమతి చేసుకున్నారు.ఈ వెడ్డింగ్ గౌను బరువు దాదాపు 11.5 కిలోలు. పెద్ద ఫ్లేర్ ,అంతే పొడవైన వీల్‌తో దీన్ని రూపొందించారు. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, ఆ గౌను విలువ రూ. 2.28 కోట్లు.
అత్యంత విలువైన వజ్రాభరణాలతో రాయల్ లుక్‌లో మెరిసిపోయింది వధువు. వజ్రాలు పొదిగిన తలపాగా, భారీ వజ్రాల చెవిపోగులు, మ్యాచింగ్ నెక్లెస్ ధరించింది. రెండు చేతులకు బ్రాస్‌లెట్‌లతో యువరాణిలా కనిపించింది.
తొమ్మిది అంచెల వివాహ కేక్
సాయిద్ గుట్సేరీవ్- ఖాదీజా ఉజాఖోవ్ వివాహ కేక్ మరో ప్రత్యేకత. అద్భుతమైన తొమ్మిది అంచెల ఐస్డ్ వెడ్డింగ్ కేక్ మరీ ముఖ్యంగా, నూతన వధూవరుల కంటే రెండు రెట్లు ఎత్తులో దీన్ని ఏర్పాటు చేశారట. దీనిని వైట్ క్రీమ్‌లో తయారు చేశారు.దానిపై పింక్ ఫ్రాస్టింగ్‌తో చేశారు.

గిఫ్ట్‌లుగా గోల్డ్ బాక్స్‌లు: లగ్జరీ పెళ్లితోనే కాదు, అతిథులను కూడా ఆశ్చర్య పరిచాడు. ఈ వేడుకకు హాజరైన వారికి తీపి జ్ఞాపకంలా ఉండేలా గోల్డ్ బాక్స్ గిఫ్ట్‌గా అందించారు. ఇందులో జంట పేరు, వివాహ తేదీ చెక్కబడి ఉన్నాయి. వివాహ వేడుకలో జెన్నిఫర్ లోపెజ్, స్టింగ్, ఎన్రిక్ ఇగ్లేసియాస్ ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు.
ఎవరీ గుట్సెరీవ్
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం సఫ్మార్ గ్రూప్ వ్యవస్థాపకుడు, రష్యన్ బిలియనీర్ గుట్సెరీవ్ చమురు, బొగ్గు, రియల్ ఎస్టేట్ , రిటైల్ రంగాలలో వ్యాపారాలున్నాయి 2024 నాటికి ఆ కుటుంబ నికర విలువ రూ. 31,574.41 కోట్లు.
కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం కోసం ముఖేష్ అంబానీ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంచనా. ఇది అంబానీ కుటుంబం నికర విలువలో 0.5శాతం మాత్రమేనని అంచనా. అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ పెళ్లి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.