ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి అంతకంతకూ ఆందోళనకరంగా మారుతోంది. మైమెన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని హత్యచేసి.. మృతదేహాన్ని దహనం చేసిన ఘటన మరువక ముందే.. తాజాగా రాజ్‌బారి జిల్లాలో మరో హిందూ యువకుడు మూకదాడికి బలయ్యాడు. బుధవారం రాత్రి పాంగ్షా ఉపజిల్లా హోసైన్‌డంగా పాత మార్కెట్ వద్ద 29 ఏళ్ల అమృత్ మండల్ (సామ్రాట్) అనే యువకుడిని కొందరు కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. అమృత్ మండల్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతడిపై దాడి చేసి, హత్య చేశారు. మృతుడు ‘సామ్రాట్ బహినీ’ అనే స్థానిక బృందానికి నాయకుడని పాంగ్షా పోలీస్ స్టేషన్ అధికారి షేక్ మొయినుల్ ఇస్లాం తెలిపారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, అల్లర్లు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో మూకహత్య కావడం గమనార్హం. డిసెంబర్ 18న మైమెన్‌సింగ్‌లోని భలుకాలో దీపు చంద్ర దాస్ అనే ఫ్యాక్టరీ కార్మికుడిని ఇస్లాం మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే నెపంతో కొట్టి చంపారు. మరోవైపు, దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత ఢాకాలో హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. కొందరు యువ నేతలు భారత వ్యతిరేక ప్రకటనలు చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.


