బంగారం ధర కొండెక్కి కూర్చుంది.. వెండి వెల వెలుగులు జిమ్ముతోంది.. అయితే ఏంటట..? పెళ్లి మాత్రం ‘రాయల్’గా జరగాల్సిందే.. 2025 వెడ్డింగ్ సీజన్ కేవలం మూడు ముళ్ల ముచ్చట కాదు.. ఇప్పుడు అదొక భారీ ‘ఇన్‌స్ట్రాగామ్ ఈవెంట్’. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వంటి ప్రముఖుల పెళ్లిళ్లు ఆగిపోయి వార్తల్లో నిలిచినా.. అదర్ జైన్, అర్మాన్ మాలిక్ వంటి స్టార్ల పెళ్లి సందడి ట్రెండ్ సెట్ చేసింది.
కేవలం కోటీశ్వరులే కాదు, మధ్యతరగతి జంటలు కూడా ’లగ్జరీ’ బాట పట్టడంతో వెడ్డింగ్ మార్కెట్ కళకళలాడుతోంది. ఇప్పుడు పెళ్లి అంటే కేవలం అక్షింతలు వేయించుకోవడం కాదు.. ఇన్‌స్టాలో ట్రెండ్ కావడం.. డెస్టినేషన్ వెడ్డింగ్‌లో మెరిసిపోవడం.. ఖర్చు భారమైనా, అప్పులైనా.. పెళ్లి వేడుక మాత్రం ‘బ్లాక్ బస్టర్’ సినిమా రేంజ్‌లో ఉండాల్సిందేనని కుర్రకారు ఫిక్సయిపోయింది.
→ ఖర్చులో తగ్గేదే లే!
‘వెడ్‌మిగుడ్’ సంస్థ నివేదిక ప్రకారం.. 2025లో పెళ్లిళ్ల ఖర్చు సగటున 8 శాతం పెరిగింది. ఒక్కో పెళ్లి బడ్జెట్ సగటున రూ.39.5 లక్షలకు చేరింది. ఇక 2026లో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
→ డెస్టినేషన్ వెడ్డింగ్‌కే ఓటు
ఇప్పుడు ప్రతి నలుగురిలో ఒకరు సొంతూరు వదిలి గోవా, జైపూర్ లేదా రిషికేష్ లాంటి ప్రాంతాల్లో ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ సెలబ్రేట్ చేసుకున్నారు. రూ.కోటి మించిన బడ్జెట్ ఉన్న పెళ్లిళ్లలో 60 శాతం డెస్టినేషన్ వెడ్డింగ్స్‌వే. సగటున ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రూ.58 లక్షలు ఖర్చు చేస్తున్నారు. బాలి, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలు ఇప్పుడు ఇండియన్ జంటలకు ఫేవరెట్ వెడ్డింగ్ స్పాట్లుగా మారిపోయాయి.
→ రీల్స్ కోసమే అసలు గోల..
గతంలో లాగా పాత ఫొటోలు, గంటల కొద్దీ వీడియోలు ఇప్పుడు ఎవరికీ అక్కర్లేదు. పెళ్లి పూర్తవగానే నిమిషాల్లో ఇన్‌స్టాలో పోస్ట్ చేయడానికి వీలుగా ’క్విక్ అండ్ క్వాలిటీ’ కంటెంట్ కావాలి. అందుకే ఫొటోగ్రఫీ శైలి కూడా మారింది. క్యాండిడ్ షాట్స్, డాక్యుమెంటరీ స్టైల్ వీడియోల కోసం జంటలు ఎగబడుతున్నాయి. ఫొటోగ్రఫీ మార్కెట్‌లో అసైన్‌మెంట్లు కొంచెం తగ్గినా, డిమాండ్ మాత్రం పీక్స్‌లో ఉంది.
→ పాత బంగారానికే జై!
2025లో బంగారం ధర ఏకంగా 74 శాతం పెరిగి పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ల తండ్రులకు చుక్కలు చూపించింది. వెండి ధర అయితే ఏకంగా 137 శాతం ఎగబాకింది. దీంతో చాలామంది కొత్త నగలు కొనేకంటే, ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని కరిగించి కొత్త డిజైన్లు చేయించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రీసైక్లింగ్ ట్రెండ్ గతంతో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది.
→ హోటళ్లకు కాసుల వర్షం
హోటల్ రంగం కూడా ఈ వెడ్డింగ్ సీజన్‌లో భారీగా లాభపడుతోంది. మునుపటిలా ఒక రోజులో పెళ్లి ముగించకుండా, 2–3 రోజుల పాటు ఈవెంట్లను హోటల్స్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాగే ఈ ‘పెళ్లిళ్ల సీజన్’.. హోటళ్ల వ్యాపారంలో దాదాపు 12 శాతం వృద్ధిని నమోదు చేసింది.
→ 2026పై గురి..
ముందుముందు పెళ్లిళ్లలో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగనుంది. ప్రణాళికల నుంచి చెల్లింపుల వరకు అంతా డిజిటల్ మయం కాబోతోంది. మొత్తానికి ధరల భారమున్నా.. భారతీయ పెళ్లిళ్ల గ్లామర్ మాత్రం తగ్గట్లేదు.
– సాక్షి, నేషనల్ డెస్క్


