ఫిబ్రవరిలో మోగనున్న పెళ్లి బాజా
ఈ వేసవిలో పెళ్లి సందడి ఎక్కువే
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అత్యధిక ముహూర్తాలు
జూలై నుంచి నవంబర్ వరకు చాతుర్మాస విరామం
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఫిబ్రవరి (మాఘ మాసం) నుంచి పెళ్లి బాజాలు మోగించేందుకు ముహూర్తాలు ఖరారయ్యాయి. దాదాపు రెండు నెలలకుపైగా విరామం అనంతరం ముహూర్తాలు కుదరడంతో వధూవరుల తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయ్యారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 5 నుంచి పెళ్లి సందడి ప్రారంభం కానుంది. వేసవి కాలంలో అత్యధిక ముహూర్తాలు ఉండటంతో పెళ్లి సందడి మోత మోగనుంది.
ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అత్యధికంగా ముహూర్తాలు ఉన్నాయి. జూలై 11 తర్వాత నవంబర్ 20 వరకు చాతుర్మాస విరామం కావడం (ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు) ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి బాజాలకు నాలుగు నెలల విరామం ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం చాతుర్మాసంలో శుభకార్యాలు నిర్వహించరు. ఈ ఏడాది చివరలో నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మధ్య తిరిగి పెళ్లి బాజాలు మోగనున్నాయి.
2026లో వివాహ ముహూర్తాలు ఇలా..
ఫిబ్రవరి: 5, 6, 8, 10, 12, 14, 19, 20, 21, 24, 25, 26 తేదీలు
మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29
మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14
జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29
జూలై: 1, 6, 7, 11 తేదీలు
నవంబర్: 21, 24, 25, 26, 27, 30
డిసెంబర్: 1, 2, 3, 4, 6, 11, 12, 13
చాతుర్మాసం కారణంగా ఆగస్ట్, సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో వివాహ ముహూర్తాలు లేవు
పెళ్లంటే.. పెద్ద ఆడంబరమే
పెళ్లి అంటే అదే పెద్ద ఆడంబరం. వివాహ నిశ్చయ తాంబూలాల నుంచి ప్రీ వెడ్డింగ్, పెళ్లి, పెళ్లి తర్వాత తంతు అంటూ అనేక రకాలుగా వివాహ సంబరం అంబరాన్ని తాకేలా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 46 లక్షల నుంచి 48 లక్షల వరకు వివాహాలు జరిగే అవకాశం ఉందని సీఏఐటీ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్) అంచనా వేసింది. ఈ వివాహాల ద్వారా సుమారు రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని భావిస్తున్నారు.
అదే ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు సుమారు నాలుగు లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వివాహ వేడుకల సంఖ్య, వాటి సంబంధించిన సందడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో అతిపెద్ద ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు.
పెళ్లిళ్లు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఎందరికో జీవనోపాధి కల్పిస్తూ.. అతి పెద్ద ఆరి్థక వ్యవస్థను నడిపిస్తాయి. ముహూర్తాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి చోట్ల ఫంక్షన్ హాళ్లు ఇప్పటికే అడ్వాన్స్‌గా బుక్ అయినట్టు సమాచారం. ఉభయ గోదావరి, ఏజెన్సీ, విశాఖ తీరాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ఆలవాలంగా మారాయి.
దుస్తులు, బంగారం(జ్యువెలరీ), క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పటినుంచే ముహూర్తం ముందరున్నది అంటూ పెళ్లి వారు ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు.


