breaking news
Wedding market
-
India Wedding Industry: పెళ్లి.. యమా కాస్ట్లీ!
అంబానీల పెళ్లిసందడి దేశంతో పాటు ప్రపంచమంతటి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలు, అందుకు జరుగుతున్న ఖర్చు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఈ సంరంభానికి అంబానీలు దాదాపు రూ.5,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారన్న వార్తలతో అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అయితే పెళ్లి ఖర్చు విషయంలో భారతీయులెవరూ తక్కువ తినలేదు. మన దేశంలో పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు. బోలెడంత ఖర్చు కూడా. ప్రపంచంలో మరే ఇతర దేశంతో పోల్చినా భారత్‌లో పెళ్లి బాగా ఖరీదైన వ్యవహారం. పిల్లల మొత్తం చదువు ఖర్చుతో పోలిస్తే పెళ్లికి హీనపక్షం నాలుగు రెట్లు ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి. సగటు కుటుంబంలో పెళ్లి ఖర్చు వార్షికాదాయం కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందులో ఎక్కువ మొత్తం నగానట్రాకే అవుతుండటం మరో విశేషం. పెళ్లి దెబ్బకు చాలా కుటుంబాలు ఆర్థికంగా తలకిందులవుతున్న ఉదంతాలెన్నో. అయినా సరే, పెళ్లి ఖర్చు విషయంలో మాత్రం మనోళ్లు తగ్గేదే లేదంటున్నారు...! భారత రిటైల్ మార్కెట్ పరిమాణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.94.3 లక్ష కోట్లకు చేరింది. అంటే 1.1 ట్రిలియన్ డాలర్లన్నమాట! ఇందులో రూ.56.9 లక్షల కోట్లతో ఫుడ్ అండ్ గ్రోసరీస్ విభాగం తొలి స్థానంలో ఉంటే రెండో స్థానం పెళ్లిళ్లదే కావడం విశేషం. భారత వెడ్డింగ్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 10.9 లక్షల కోట్ల రూపాయలు! ఇందులో దాదాపు మూడో వంతు వాటా, అంటే రూ.3.1 లక్షల కోట్లు ఆభరణాల ఖర్చుదే కావడం విశేషం! తర్వాత విందు భోజనాలపై రూ.2.1 లక్షల కోట్లు వెచి్చస్తున్నారు. సంగీత్, హల్దీ వంటి పెళ్లి వేడుకలకు రూ.1.6 లక్షల కోట్లు ఖర్చవుతోంది. ఇక పెళ్లి ఫొటోగ్రఫీ వాటా 0.9 లక్షల కోట్లు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు దుస్తులకు, పెళ్లి డెకరేషన్‌కు చెరో రూ.0.8 లక్షల కోట్ల చొప్పున ఖర్చవుతోంది. మద్యం, కానుకలు, ఇతర పెళ్లి ఖర్చులు కలిపి రూ.1.9 లక్షల కోట్ల దాకా అవుతున్నాయి.చదువును మించి... భారత్‌లో చదువుకు, పెళ్లికి అయ్యే ఖర్చుల మధ్య ఆశ్చర్యకరమైన తేడా కనిపిస్తోంది. సాదాసీదా కుటుంబం ఒక్క సంతానం చదువుకు కేజీ నుంచి పీజీ దాకా పెట్టే మొత్తం ఖర్చు సగటున రూ.3.3 లక్షలు. కాగా అదే కుటుంబం ఒక్క పెళ్లిపై వెచ్చిస్తున్నదేమో ఏకంగా రూ.12.5 లక్షలు! ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారనుకున్నా వారి చదువు ఖర్చుకు రెట్టింపు మొత్తం ఒక్క పెళ్లిపై పెట్టాల్సి వస్తోంది. భారతీయుల తలసరి జీడీపీ (రూ.2.4 లక్షల)తో పోలిస్తే పెళ్లి ఖర్చు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి ఏ సంపన్న దేశంలో చూసినా పెళ్లి ఖర్చు పౌరుల తలసరి జీడీపీతో పోలిస్తే సగం కంటే తక్కువ (0.4 రెట్లు)గానే ఉంది. మరో విషయం. మన దగ్గర ఒక కుటుంబం పెళ్లి కోసం తమ సగటు వార్షికాదాయానికి కనీసం మూడు రెట్లు వెచి్చస్తోంది!మన దేశంలో పెళ్లి ఖర్చు కుటుంబం ఖర్చు పేద రూ.3 లక్షలు దిగువ మధ్య తరగతి రూ.6 లక్షలు మధ్య తరగతి రూ.10–25 లక్షలు ఓ మాదిరి సంపన్నులు రూ.50 లక్షలు సంపన్నులు రూ.కోటి, ఆ పైన – సాక్షి, నేషనల్ డెస్క్ -
'బాహుబలి'ని మించిన పెళ్లి!!
• కోట్లకు కోట్ల బడ్జెట్‌తో వివాహాలు... • విదేశీ బీచ్‌లకు జెట్లలో అతిథులు • కార్డులతో పాటు ఖరీదైన బహుమతులు • 10 నిమిషాల మూడీకి రూ.12 లక్షలు • ఏటా రూ.2.4 లక్షల కోట్లకు వెడ్డింగ్ మార్కెట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పెళ్లంటే ...!! పెళ్లికార్డులు, షాపింగ్, బాజా భజంత్రీలు, మండపం, బంధుమిత్రుల హడావుడి... ఇవన్నీ కలుస్తాయి. ఇంకో రకంగా చెప్పాలంటే..!! పెళ్లంటే దాదాపు 2.4 లక్షల కోట్ల మార్కెట్. ‘బాహుబలి’ బడ్జెట్‌నూ మించిపోతున్న ఈ పెళ్లి వేడుకలకిపుడు కార్పొరేట్ లుక్ వచ్చేసింది. కార్యక్రమ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకునే వెడ్డింగ్ ప్లానర్లు మొదలు కెమెరాలను చేతపట్టుకుని వేడుకను క్లిక్‌మనిపించే ఫోటోగ్రాఫర్ల వరకు అంతా కార్పొరేట్ మయమైంది. ఫలితం... స్టార్ హోటళ్లే కాక విదేశాల్లోనూ బాజాభజంత్రీలు మోగుతున్నాయి. విలువైన బహుమతులతో కూడిన ఖరీదైన వెడ్డింగ్ కార్డ్స్, ప్రముఖ డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తులు, వేడుకకు హాజరయ్యేందుకు ప్రత్యేక జెట్ విమానాలు, సెలబ్రిటీల ఆటా పాటా, విదేశీ వంటకాలు, వెడ్డింగ్ మూవీస్.. ఇలా బడ్జెట్‌ను బట్టి సౌకర్యాలందించడానికి వేల కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటి విశేషాలే ఈ కథనం.. రూ.2,40,000 కోట్ల వెడ్డింగ్ మార్కెట్ దేశంలో ఏటా దాదాపు కోటి పెళ్లిళ్లు జరుగుతున్నాయని అంచనా. ఈ వివాహాలకు అవుతున్న ఖర్చు ఎంతకాదన్నా రూ.2.4 లక్షల కోట్ల పైమాటేనట. అందుకే ఇపుడు లక్షల మంది ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ వేడుకలు అతిథులకు మర్చిపోలేని అనుభవాన్ని కలిగిస్తున్నట్లు ‘వెడ్డింగ్ వోస్’ మ్యాగజైన్ ఎండీ దక్షిణామూర్తి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. వెడ్డింగ్ ఇండస్ట్రీ భారత్‌లో ఏటా 25-30 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నారు. అలల సాక్షిగా బీచ్‌లూ వేదికలే.. రిచ్ లుక్ కోరుకునే యువ జంటల తొలి ప్రాధాన్యం స్టార్ హోటళ్లే. బంధువులకు, స్నేహితులకు మర్చిపోలేని జ్ఞాపకాలను ఇవ్వాలనుకునే వారికి బీచ్‌లు కొత్త వేదికలవుతున్నాయి. గోవా వంటి నగరాలే కాక బాలి, థాయ్‌లాండ్, సింగపూర్, మెక్సికో, హవాయ్, కోస్టారికా, కరీబియన్ దీవులు సైతం పాపులర్ డెస్టినేషన్స్ జాబితాలో చేరిపోయాయి. ప్రత్యేక విమానాల్లో అతిథులను తీసుకెళ్లి అలల సాక్షిగా ఒక్కటవ్వాలని యువ జంటలు కలలుగంటున్నాయి. క్యాబ్‌ల మాదిరిగా విమాన సర్వీసుల అగ్రిగేటర్ అయిన ‘జెట్‌సెట్‌గో’ దీనికోసం ప్రత్యేక ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ఇక సెలబ్రిటీలతో ఆటాపాటా కూడా ఈ వేడుకల్లో భాగమవుతున్నాయి. ఇలాంటి పార్టీలకు సెలబ్రిటీలను అందించడానికి టాలీవుడ్ వేదికగా ‘జిల్మోర్.కామ్’ వంటి అగ్రిగేటర్లూ మొదలయ్యాయి. కళ్లారా చూసే అవకాశం.. భారతీయ పెళ్లి వేడుకల్ని చూడాలని తహతహలాడే విదేశీయుల కోసం ‘జాయిన్మైవెడ్డింగ్.కామ్’ పుట్టుకొచ్చింది. నిర్దేశిత చార్జీ చెల్లించి పేరు నమోదు చేసుకుంటే... మర్చిపోలేని పెళ్లి చూసేయొచ్చు. వచ్చిన మొత్తంలో కొంత వధూవరులకు చెల్లిస్తోంది ఈ కంపెనీ. ఇక జోటికస్ ప్రొడక్షన్స్ అయితే పెళ్లి తంతును ఏకంగా ఓ సినిమాగా తీసి పెడుతోంది. 10 నిమిషాల లోపు నిడివితో ఒక్కో థీమ్‌తో సినిమాలు చిత్రీకరిస్తోంది. దీనికి థీమ్నుబట్టి రూ.3.5 లక్షల నుంచి రూ.12 లక్షల దాకా చార్జీ చేస్తోంది. ఇప్పటి వరకు 100 దాకా సినిమాలు చేసినట్టు జోటికస్ ఎండీ శ్రీ కౌండిన్య చెప్పారు. పెళ్లి సంబంధాలను కుదిర్చేందుకు షగున్ టీవీ హిందీలో 24 గంటల పాటూ కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. భాగ్యనగరిదీ ప్రత్యేక స్థానం.. ⇔ పెళ్లికి భారీగా ఖర్చు చేసే నగరాల్లో ఢిల్లీ, చండీగఢ్, ముంబై తర్వాతి స్థానం హైదరాబాద్‌ది. ⇔ ఆడంబరం విషయంలో పంజాబీ కుటుంబాలు ముందుంటున్నాయి. ⇔ హైదరాబాద్‌లో రూ.5 కోట్లు ఆపైన వెచ్చించే పెళ్లిళ్లు ఏటా 2,500 దాకా జరుగుతున్నాయి. ⇔ సల్మాన్ తన సోదరి పెళ్లిని హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వైభవంగా జరిపించారు. ⇔ భాగ్యనగరిలో 200 మంది వెడ్డింగ్ డెకార్స్, 30 మంది ప్లానర్లు ఉన్నట్లు సమాచారం. ఆభరణాలకే అధికం.. వివాహ సమయంలో బంగారం, వజ్రాలతో చేసిన నగల అమ్మకాలు రూ.70,000 కోట్లు జరుగుతున్నాయట. దుస్తులు రూ.12,000 కోట్లు, మండపాల అలంకరణ రూ.50,000 కోట్లు, పెళ్లి పత్రికలు రూ.12,000 కోట్లు, మెహందీకి రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తున్నారట. బాజా భజంత్రీలకు రూ.5,000 కోట్లు, పూలకు రూ.10,000 కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఖరీదైన వెడ్డింగ్ కార్డుల తో పాటు విలువైన బహుమతినీ ముఖ్యులకిచ్చే ధోరణి పెరి గిందని ఫ్రెండ్స్ ఇన్విటేషన్స్ దక్షిణాది సేల్స్ హెడ్ నవీన్ రెడ్డి చెప్పారు. వ్యాపార బంధాల బలోపేతానికి ఈ వేడుక ఒక వేదికగా నిలుస్తోందన్నారు. గతేడాది కేరళకు చెందిన ఆర్పీ గ్రూప్ అధినేత రవి పిళ్లై తన కుమార్తె వివాహానికి రూ.50 కోట్లు ఖర్చు చేసి వార్తల్లోకెక్కారు. ఫిల్మ్ ఆర్ట్ డెరైక్టర్ సాబు సిరిల్ 75 రోజులు శ్రమించి 40,000 చదరపు అడుగుల్లో పెళ్లి వేదిక రూపొందించారు. 42 దేశాలకు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు అతిథులుగా విచ్చేశారు.