భారత్–పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ సున్నితంగానే ఉంటాయి. దేశ విభజన నాటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025 ఏప్రిల్‌లో పహల్గాం దాడి తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగి, రెండు దేశాలు యుద్ధానికి చేరువయ్యాయన్న భావన కూడా నెలకొంది.
ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబంలో జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనికి కారణం వధువు భారతీయ ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించడం.
ఎవరిదీ వివాహం?
నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దర్, లాహోర్‌లో షాంజే అలీ రోహైల్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించినప్పటికీ, వధువు దుస్తులు రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్రబిందువయ్యాయి. జునైద్ సఫ్దర్‌కు ఇది రెండో వివాహం. ఆయన 2021లో అయేషా సైఫ్ ఖాన్‌ను వివాహం చేసుకోగా, ఇద్దరూ 2023 అక్టోబర్‌లో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఆకర్షణగా నిలిచిన పెళ్లి దుస్తులు
మెహెందీ వేడుకలో షాంజే అలీ, భారతీయ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ రూపొందించిన బంగారు జరీ వర్క్‌తో కూడిన ఆకుపచ్చ లెహంగా, డబుల్ దుపట్టాతో మెరిశారు. ప్రధాన వివాహ వేడుకలో ఆమె తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన ఎరుపు చీరను ధరించారు. తలపై ఎరుపు ముసుగు, జుట్టులో సొగసైన బన్ ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ ఫొటోలను పాకిస్తాన్ సిటిజన్ మీడియా పోర్టల్ ‘డైలాగ్ పాకిస్తాన్’ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర స్పందన మొదలైంది. పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది నెటిజన్లు, ఇంతటి రాజకీయ కుటుంబానికి చెందిన కోడలు పాకిస్తాన్ డిజైనర్లను పక్కన పెట్టి భారతీయ డిజైన్లను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. కొందరు పాకిస్తాన్ నేతలు భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు.
అయితే మరికొందరు వధువును సమర్థిస్తూ, ఇది వివాహం పూర్తిగా వ్యక్తిగత అంశమని, తనకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించారు. అలాగే పాకిస్తాన్ డిజైనర్లు కూడా అంతే స్థాయిలో ప్రతిభావంతులేనని కొందరు అభిప్రాయపడ్డారు.


