ఏఐ.. 2025..ఉమెన్‌  రైజింగ్‌  | Yashoda AI is a game-changer for women in India | Sakshi
Sakshi News home page

ఏఐ.. 2025..ఉమెన్‌  రైజింగ్‌ 

Dec 26 2025 12:39 AM | Updated on Dec 26 2025 12:39 AM

Yashoda AI is a game-changer for women in India

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో భారతీయ మహిళలకు సంబంధించి 2025 కీలక సంవత్సరంగా నిలిచింది. జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్‌ కార్యక్రమం వల్ల క్షేత్రస్థాయిలో ఏఐ కోర్సులు చదివే మహిళల సంఖ్య బాగా పెరిగింది. టెక్నాలజీలో మహిళలకు సంబంధించిన ట్రెండ్‌లలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) కోర్సులు కీలకంగా మారాయి.

మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కోర్సులలో మహిళల పెరుగుదల నాలుగు రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభమైన జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్‌లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్, రైజింగ్‌ 2025 సమ్మిట్‌లాంటి సదస్సుల ప్రభావం వల్ల ఏఐ కోర్సులు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మహిళల నేతృత్వంలోని ఏఐ స్టార్టప్‌ల సంఖ్య పెరగడం శుభసూచకం.

డీప్‌–టెక్‌ డొమైన్‌లలో...
2024తో పోల్చితే 2025లో ఏఐ/ఎంఎల్‌ మాస్టర్‌ ప్రోగ్రామ్స్‌లో మహిళల సంఖ్య 20 శాతం పెరిగింది. ‘ఏఐ, ఎంఎల్‌లలో మాస్టర్స్‌ చదువుతున్న ప్రతి ఐదుగురు విద్యార్థులలో ఒకరు మహిళ. సంవత్సరం క్రితం వరకు ఇరవైమందిలో ఒకరు ఉండేవారు’ అని తెలియజేసింది యూజీసీకి సంబంధించిన ‘కాలేజి విద్య’ ప్లాట్‌ఫామ్‌ రిపోర్ట్‌.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్, సైబర్‌ సెక్యురిటీ, రోబోటిక్స్, డాటా సైన్స్‌లాంటి డీప్‌–టెక్‌ డొమైన్‌లలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని రిపోర్ట్‌ తెలియజేసింది. ఈ సంవత్సరం ఏఐ ప్రోగ్రామ్‌లకు సంబంధించి మహిళల ఆసక్తి గణనీయంగా పెరిగిందని, ఎంసిఏ సైబర్‌ సెక్యూరిటీ ఎన్‌రోల్‌మెంట్స్‌లో మహిళలు 25 శాతం, జనరేటివ్‌ ఏఐలో డాక్టోరల్‌ క్యాండిడేట్స్‌ 15 శాతం మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది.

మార్పు మంచిదే కదా!
‘మనలో వచ్చిన మార్పుకు ఈ అభివృద్ధి రేటు అద్దం పడుతుంది. ఫ్లెక్సిబుల్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ రోల్‌ మోడల్స్‌ విజయగాథలు తెలుసుకునే అవకాశం ఈ పెరుగుదలకు కారణం. భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు సంబంధించి మహిళలు కీలకపాత్ర పోషించబోతున్నారని ఈ మార్పును చెబుతుంది’ అంటున్నారు ‘కాలేజి విద్య’ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రోహిత్‌ గుప్తా.

పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే కాదు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా మహిళలు ఏఐ కోర్సులపై అమిత ఆసక్తి చూపిస్తున్నారు. సైబర్‌ భద్రతా నైపుణ్యాలపై మహిళలు దృష్టి సారించేలా యశోద ఏఐ అభియాన్‌ కార్యక్రమాలు చేపట్టింది.

స్టాన్‌ఫోర్డ్‌ ఏఐ ఇండెక్స్‌ 2025
స్టాన్‌ఫోర్డ్‌ ఏఐ ఇండెక్స్‌ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఏఐ నైపుణ్యం కలిగిన వారిలో భారతీయ మహిళలు ఉన్నారు.‘ఎనాలటిక్స్‌’ ఇండియా మ్యాగజైన్‌ సమ్మిట్‌ ఏఐలో మహిళల భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొత్తంమీద, ఏఐకి సంబంధించి 2025 సంవత్సరం మహిళలకు కీలకమైన సంవత్సరం నిలుస్తుంది.

యశోద ఏఐ అంటే?
డిజిటల్‌ రంగంలో లింగ అంతరాన్ని తగ్గించడానికి ఈ సంవత్సరం మే 22న యశోద ఏఐ అభియాన్‌ ముందుకు వచ్చింది.
యువర్‌ ఏఐ సాక్షి ఫర్‌ షేపింగ్‌ హారిజన్స్‌ విత్‌ డిజిటల్‌ అవేర్‌నెస్‌కు సంక్షిప్తరూపం... యశోద ఏఐ.
ఎన్‌సీడబ్ల్యూ, ఫ్యూచర్‌ షిఫ్ట్‌ ల్యాబ్స్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమం బరేలీలోని మహత్మా జ్యోతిబా పూలే రోహిల్‌ఖండ్‌ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. ‘భారతదేశం అంతటా ఒక కోటిమంది మహిళలకు డిజిటల్‌ నైపుణ్యం’ అనే దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది యశోద ఏఐ అభియాన్‌. మొదటి దశలో రెండు లక్షల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇవ్వడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొబైల్‌ యాప్, శిక్షణ  కార్యక్రమాల ద్వారా మహిళలకు ఏఐ సాధనాలు, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ అక్షరాస్యతలో ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తోంది. ఏఐ సాంకేతికతను సులభతరం చేయడానికి స్థానిక భాషలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

మహిళలకు ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ ఎందుకు కీలకం?
హ్యాకింగ్, ఆన్‌లైన్‌ వేధింపులలాంటి సైబర్‌ నేరాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి, ఏఐ రంగంలో అద్భుతమైన ఉద్యోగాలు సాధించడానికి, సాధికారతకు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లను సురక్షితంగా నావిగేట్‌ చేయడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లింగ వివక్ష లేకుండా ఉండడానికి మహిళలకు ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ ముఖ్యం అని యూఎన్‌ నివేదిక తెలియచేసింది. కాలేజీ స్టూడెంట్‌. సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ (ఎస్‌హెచ్‌జీ), ఆశావర్కర్, టీచర్, పంచాయతీ వార్డు మెంబర్‌ ఇలా ఎవరైనా కావచ్చు... యశోద ఏఐ అభియాన్‌లో చేరవచ్చు.
‘ఇది కేవలం శిక్షణా కార్యక్రమం మాత్రమే కాదు. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి మహిళా సాధికారతను ఉన్నతస్థాయిలో తీసుకువెళ్లే ఉద్యమం’ అనే ప్రశంసలు అందుకుంటోంది యశోద ఏఐ అభియాన్‌.
 

ఏఐ బై హర్‌...గ్లోబల్‌ ఇంపాక్ట్‌ చాలెంజ్‌
గ్లోబ్‌ ఇంపాక్ట్‌ ఛాలెంజెస్‌...‘ఏఐ బై హర్‌’ ‘ఏఐ ఫర్‌ ఆల్‌’ ‘యువ్‌ ఏఐ’ల కోసం భారత ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కి సంబంధించి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మహిళా సాంకేతిక నిపుణులను ఆహ్వానిస్తుంది. మహిళల నేతృత్వంలో ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడానికి, వ్యవసాయం. సైబర్‌సెక్యూరిటీ, విద్య, డిజిటల్‌ వెల్‌బీయింగ్, ఆరోగ్యసంరక్షణ, ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ రంగాలలో,  ఏఐకి  సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నీతి అయోగ్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో గ్లోబల్‌ ఇంపాక్ట్‌ చాలెంజ్‌ ‘ఏఐ బై హర్‌’కు శ్రీకారం చుట్టారు. ‘ఏఐ–ఫర్‌–గుడ్‌ అప్లికేషన్స్‌’ లక్ష్యంతో ఫిబ్రవరి 2026లో న్యూ దిల్లీలో ఇండియా–ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు జరగనుంది.

ఎన్ని స్టార్టప్‌లో!
ఈ సంవత్సరం మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ట్రాక్షన్‌ డేటా ప్రకారం...అక్టోబర్‌ 2025 నాటికి దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలో 7,000 కంటే ఎక్కువ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. ఫండింగ్‌కు సంబంధించి వీటికి మంచి స్పందన వచ్చింది. మహిళల నేతృత్వంలోని ఏఐ వెంచర్‌లలో కొన్ని... డా.గీతా మంజునాథ్‌–నిరామయి హెల్త్‌ ఎనాలిటిక్స్, అశ్వినీ అశోకన్‌–మ్యాడ్‌ స్ట్రీట్‌ డెన్, చంద్రాలిక హజారిక–బిగ్‌ థింక్స్, ప్రాంజలీ అవస్థీ–డెల్వ్‌.ఏఐ, కృష్ణప్రియ ఆకెళ్ల–స్టార్‌బజ్‌.ఏఐ, నిధి–నెమా ఏఐ, రిత్వికా చౌదురి–అన్‌స్క్రిప్ట్‌.ఏఐ, లైనా ఇమ్మాన్యుయేల్, రింజిమ్‌ అగర్వాల్‌–బ్రెయిన్‌సైట్‌.ఏఐ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement