యావత్తు ప్రపంచం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగతో సందడిగా ఉంటే..ఈ దేశాల్లో ఆ సందడి కానరాదు. ఒకవైపు ప్రపంచం మొత్తం ఒకరికొకరు గిఫ్ట్‌లు, స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేషన్ వేడుకల్లో మునిగితేలుతుంటే..ఆయా దేశాలు నిశబ్దంతో నిండి ఉంటాయి. కానీ ఆ దేశాలు కూడా క్రిస్మస్‌ని ఘనంగానే జరుపుకుంటుంది కానీ ఈ డిసెంబర్ 25 మాత్రం కాదట. మరి ఇంతకీ ఏరోజున క్రీస్తూ పుట్టిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారంటే..
ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు, క్రిస్మస్ డిసెంబర్ 25. రష్యా వంటి కొన్ని దేశాల్లో మాత్రం దాదాపు రెండు వారాల తర్వాత, జనవరి 7న వస్తుంది. ఆ రోజు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. చెప్పాలంటే అక్కడ ఆరోజు ఓ విరామం లేదా విశ్రాంతి రోజులా మారిపోతుంది చుట్టూ వాతావరణం. పూర్వం మొత్తం దేశాలన్ని జూలియన్ క్యాలెండర్ అనుసరించేవి. అయితే 1582లో యూరప్‌లో ఎక్కువ భాగం కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను స్వీకరించింది.
లీప్ ఇయర్‌ని జోడించడంతో రెండు క్యాలెండర్‌లలో రోజులు, తేదీల అమరికలు తేడాలు వచ్చాయి. అయితే కొన్ని దేశాలు మతపరమైన ఆచారాల నిమిత్తం పాత క్యాలెండర్‌నే అనుసరించాలనే నిబంధనను ఏర్పరుచుకున్నాయి. దాంతో ఈరెండు క్యాలెండర్‌ల మధ్య మతపరమైన వేడుకలు జరుపుకునే వ్యత్యాసం ఏకంగా 13 రోజులకుపైనే ఉంటుంది. కాబట్టి కొత్త క్యాలెండర్‌ని స్వీకరించిన దేశాలు డిసెంబర్25న క్రిస్మస్ జరుపుకుంటే..పాత క్యాలెండర్‌ని అనుసరించేవారు జనవరి 7న జరుపుకుంటారు.
అలా రష్యా డిసెంబర్ 25న ఎలాంటి వేడుకలు నిర్వహించదు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ తోపాటు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటుంది. ఆయా దేశాలన్నీ అధికారికంగా రోజువారీ వ్యవహారాలకు గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఉపయోగిస్తుండగా, మత పరమైన వేడుకలకు జూలియన్ క్యాలెండర్‌ని అనుసరించడం విశేషం. అంతేగాదండోయ్ రష్యా వంటి దేశాల ప్రజలు ఆరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రంలో ఆకాశంలో నక్షత్రాన్ని చూసి మాంసాహారంతో విందు ఆస్వాదిస్తారట.
ఏసుక్రీస్తు పుట్టుకను ఈస్టర్న్ ఆర్థడాక్స్ (Eastern Orthodox) దేశాలు డిసెంబర్ 25వ తేదీన జరుపుకోవు. ఇక్కడ ఈస్టర్న్ ఆర్థడాక్స్ అంటే క్రైస్తవ మతంలోని ఒక ప్రధాన శాఖ, ఇది బైజాంటైన్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది.
ఆ దేశాల జాబితా ఇదే:
రష్యా (Russia)
ఉక్రెయిన్ (Ukraine) - కొన్ని చర్చిలు
సెర్బియా (Serbia)
జార్జియా (Georgia)
బెలారస్ (Belarus)
మోల్డోవా (Moldova)
మాంటెనెగ్రో (Montenegro)
ఉత్తర మాసిడోనియా (North Macedonia)
ఎథియోపియా (Ethiopia)
ఎరిట్రియా (Eritrea)
(చదవండి: క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?)


