
శ్రావణ మాసం (Sravana Masam) అంటేనే పండగల సందడి. ఈ మాసమంతా ప్రతి ఇంట్లోనూ పండగ వాతావరణం నెలకొంటుంది. వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతాలను ఆచరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
పులిహోర: అన్ని పండగలకు, పుణ్యకార్యాలకు పులిహోర తప్పనిసరిగా ఉండాల్సిందే. ముందుగా పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు: బియ్యం, చింతపండు,పసుపు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు ,మెంతులు, పల్లీలులేదా జీడిపప్పు, పచ్చిమిర్చి ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ చిటికెడు, బెల్లం
ముందుగా చింతపండుని శుభ్రం చేసుకొని, నానబెట్టి మెత్తని గుజ్జు తీయాలి. ఈ గుజ్జులో పసుపు, కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసి ఉడకనివ్వాలి. బాగా దగ్గరికి వచ్చి, నూనెపైకి తేలేదాకా దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఎండు మిర్చి, ఇతర పోపు దినుసులు వేసుకొని వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. కమ్మగా వేగిన తరువాత ముందే ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి మరికొంచెం సేపు ఉడకనివ్వాలి.
బియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా, పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఉడికాక ఒక బేసిన్‌లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో పచ్చి కరివేపాకు, కొద్దిగా పసుపు, పచ్చి ఆవాల ముద్ద వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇపుడు చింత పండు గుజ్జుతో పాటు ఉడికిన పోపును అన్నంలో కలపాలి. అంతే పులిహోర రెడీ
పూర్ణం బూరెలు
వరలక్ష్మీ వ్రతము రోజు అమ్మ వారి నివేదనకు తప్పనిసరిగా ఉండాల్సినవి పూర్ణం బూరెలు.
కావాల్సిన పదార్థాలు: ఒక గాస్లు మినపపప్పు, రెండుగ్లాసుల బియ్యం, ఒక గ్లాసు శనగపప్పు, బెల్లం,యాలకులు
తయారీ : మినపప్పు, బియ్యం కలిపి కనీసం నాలుగు గంటలు నాననివ్వాలి. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ జారుగా, మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు కలుపుకోవాలి. దీంతో బూరెలకు కావాల్సిన తోపు పిండి రెడీ అవుతుంది. దీన్ని ఎక్కువ సేపు పులియకుండా జాగ్రత్త పడ్డాలి.
పూర్ణం తయారీ : పచ్చి శనగపప్పు సరిపడా నీళ్ళు పోసి కుక్కర్‌లో నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడక బెట్టుకోవాలి. చల్లారాక నీళ్లు తీసేసి, పప్పు గుత్తితో మెత్త చేసుకోవాలి.కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు. తరువాత దీన్ని గ్లాసు తరిగిన బెల్లపు పొడితో కలిపి మందపాటి గిన్నెలో వేసి స్టౌ మీద పెట్టి ఉడకనివ్వాలి. అడుగు అంటకుండా బాగా తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గర పడి పూర్ణం ఉడికి కొంచెం ముద్దలా అయ్యేదాకా ఉడకనివ్వాలి. తరువాత యాలకుల పొడి వేసుకోవాలి. కొంచెం చల్లారాక మనకు నచ్చిన సైజులో పూర్ణాల్లా(ఉండల్లా) తయారు చేసుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేసి కాగనివ్వాలి. తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్న పూర్ణాలను తోపు పిండిలో ముంచి కాగుతూన్న నూనెలో జాగ్రత్తగా వేయాలి. మెల్లిగా తిప్పుతూ కాస్త ముదురు రంగు వచ్చేదాకా వాటిని ఎర్రగా వేయించు కోవాలి. అంతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు రెడీ.
ఇదీ చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!
చక్కెర పొంగలి: అమ్మవారికి ఇష్టమైన మరో నైవేద్యం చక్కెర పొంగలి.
కావాల్సిన పదార్థాలు బియ్యం అరకప్పు, పెసరపప్పు 1 టేబుల్ స్పూన్, బెల్లం, నెయ్యి ,యాలకులు 2
జీడిపప్పులు, బాదం నేతిలో వేయించుకుని పెట్టుకోవాలి. చిటికెడు పచ్చ కర్పూరం జాజికాయ పొడి
తయారీ : పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి పెసరపప్పు దోరగా వేయించాలి.
బాగా కడిగిన బియ్యం, పెసరపప్పుతోపాటు సరిపడా నీళ్లు, కొద్దిగా ఉప్పువేసి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. మూత వచ్చాక ఇందులో తరిగిన బెల్లం వేసి ఉడికించాలి. అడుగు మాడకుండా బాగా కలపాలి. ఉడుకుతుండగా కొద్దిగి నెయ్యి వేసుకొని, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. దించే ముందు మరిగించిన చిక్కటి పాలు పోయాలి. చిక్కగా దగ్గరికి వచ్చిన తరువాత మరికొంచెం నెయ్యి వేసుకొని వేయించిన జీడిపప్పులు, బాదం వేసి కలుపుకుంటే కమ్మని చక్కెర పొంగలి రెడీ.
చదవండి: తండ్రి కల..తొలి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్....ఐఏఎస్ లక్ష్యం