క్యాల్షియం, ఐరన్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు అన్ని వయసుల వారికీ మేలు చేస్తాయి. సంప్రదాయ వంటలుగానే కాదు పిల్లలు ఇష్టపడేలా ఆకుకూరలతోనూ వంటిల్లును టేస్టీగా సిద్ధం చేయండి.
పాలక్ హమ్మస్
కావల్సినవి: పాలకూర – కప్పు; కాబూలి చనా (తెల్లశనగలు) – 1/2 కప్పు (4–5 గంటలు సేపు తగినన్ని నీళ్లలో నానబెట్టాలి); నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ సూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 4; జీలకర్ర – టేబుల్ స్పూన్; ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం – టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత.
తయారీ: ∙నానబెట్టిన తెల్ల శనగలను ఉడికించాలి ∙శనగలు చల్లారాక మిక్సర్‌లో శనగలతోపాటు పై అన్ని పదార్థాలను వేసి, మెత్తగా గ్రైండ్ చేయాలి. ∙ఉప్పు సరిచూసుకుని, ఒక గిన్నెలోకి తీసుకొని, బ్రెడ్, చిప్స్, ఇతర వెజిటబుల్ సలాడ్‌తో సర్వ్ చేయాలి. సాండ్‌విచ్ స్ప్రెడ్‌గానూపాలక్ హమ్మస్‌ను ఉపయోగించవచ్చు.
చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్‌ఆర్‌ఐ జంట, వీడియో వైరల్
గోంగూర అవకాడో రైస్
కావల్సినవి: అన్నం – 2 కప్పులు; గోంగూర (సన్నగా తరిగినది) – 2 కప్పులు; అవకాడో ముక్కలు – కప్పు; ఉప్పు – తగినంత; జీలకర్ర – అర టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; మెంతులు –పావు టీ స్పూన్; కరివేపాకు రెమ్మలు – 2; ఎండుమిర్చి – 4; పచ్చిమిర్చి – 2; శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప పప్పు – టీ స్పూన్; ఉప్పు – తగినంత; పసుపు –పావు టీ స్పూన్; పల్లీలు –పావు కప్పు.
తయారీ: ∙బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, కరివేపాకు వేసి కలపాలి ∙నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు వేసి, బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి ∙గోంగూర ఆకులను వేసి, పేస్ట్ అయ్యేవరకు కలపాలి. దీంట్లో ఉప్పు, పసుపు వేసి కలపాలి. ∙అన్నంలో గోంగూర మిశ్రమం, అవకాడో ముక్కలను బాగా కలిపి, వడ్డించాలి.
తోటకూర పెస్టోపాస్తా
కావల్సినవి: పాస్తా – ఉడికించి పక్కనుంచాలి; తోటకూర (సన్నగా తరిగిన ఆకులు) – కప్పు; ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, బాదం, జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి – 4 రెబ్బలు; మిరియాల పొడి – రుచికి సరిపడా; ఉల్లిపాయ తరుగు- టేబుల్ స్పూన్; వెన్న లేదా బటర్ – టేబుల్ స్పూన్; చీజ్ – తగినంత; ఉప్పు – తగినంత.
తయారీ: ∙మిక్సర్ జార్‌లో తోటకూర, జీడిపప్పు, బాదంపప్పు, వెల్లుల్లి, తురిమిన చీజ్, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. ∙ఆలివ్ ఆయిల్‌ను కొద్ది కొద్దిగా వేస్తూ, మెత్తని పేస్ట్ అయ్యే వరకు బ్లెండ్ చేయాలి ∙ఉడికించిన పాస్తాలో తోటకూర పెస్టో సాస్ వేసి బాగా కలపాలి ∙తరిగిన ఉల్లిపాయలు, వెన్న లేదా నూనెలో వేయించిపాస్తాలో కపాలి ∙పైన మిరియాలపొడి చల్లి వేడివేడిగా వడ్డించాలి.
ఇదీ చదవండి: ఇంటర్న్స్ కావాలి, నెలకు రూ. లక్ష స్టైఫండ్ : ట్విస్ట్ ఏంటంటే


