జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ కాకుండా ఎదిగే వయసులో పిల్లలకు పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు పోషకాహార నిపుణులు. తక్కువ ఖర్చులోనే పుష్కలంగా పోషకాలు లభించే లడ్డూల తయారీ గురించి..న్యూట్రిషనిస్ట్ చెప్పే హెల్దీ వాల్యూస్ గురించి... తెలుసుకుందాం.
అవిసె గింజల లడ్డు
కావలసినవి: అవిసె గింజలు – కప్పు (100 గ్రాములు); బాదం పప్పు – 30; రాగి పిండి – అరకప్పు; ఎండుకొబ్బరి ముక్కలు – అర కప్పు; ఖర్జూరం – 15; నెయ్యి – సరిపడా.
తయారీ: స్టౌ పైన కడాయి పెట్టి, అవిసెగింజలు దోరగా వేయించాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని, అదే పాన్‌లో బాదం పలుకులు వేయించుకోవాలి. బాదం పప్పుకు బదులుగా పల్లీలు కూడా ఉపయోగించవచ్చు. బాదం పప్పులు తీసి, తర్వాత అరకప్పు ఎండుకొబ్బరి ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించి, తీయాలి. ∙పాన్‌లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించాలి. దాంట్లో అరకప్పు రాగిపిండి వేసి, కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీజార్‌లోకి వేయించుకున్న బాదం, ఎండు కొబ్బరి ముక్కలు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఇందులో వేయించిన రాగిపిండి పోసి గ్రైండ్ చేసుకొని, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మిక్సర్ జార్‌లో అవిసెగింజలు వేసి, పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాగి పిండిలో కలపాలి. ∙అలాగే మిక్సీజార్‌లో గింజలు తీసేసిన ఖర్జూరాలు వేసి, గ్రైండ్ చేయాలి ∙ఖర్జూరం మిక్సర్‌ని పిండిలో వేసి, చేతితో మిశ్రమం అంతా కలిసేలా బాగా మిక్స్ చేయాలి ∙చేతికి నెయ్యి రాసుకొని, కొద్ది కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని, చిన్న చిన్న లడ్డూలు కట్టుకోవాలి ఈ అవిసె గింజల లడ్డూలు పిల్లలకు రుచిని, బలాన్ని ఇస్తాయి.
నువ్వులు – బెల్లం లడ్డు
కావలసినవి: తెల్ల నువ్వులు – కప్పు; బెల్లం – కప్పు; వేరుశెనగలు – కప్పు; యాలకుల పొడి - అర టీ స్పూన్; నెయ్యి – తగినంత.
తయారీ: ∙నువ్వులను సన్నని మంటపై దోరగా వేయించి పక్కన పెట్టాలి. ∙బెల్లం తరుగును గిన్నెలో వేసి, కరిగించి, మెత్తటి మిశ్రమం అయ్యే వరకు ఉడికించాలి. దాంట్లో వేయించిన నువ్వులు, ఇతర పదార్థాలు కలపాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా చేయాలి.
కొబ్బరి లడ్డు
కావలసినవి: పచ్చికొబ్బరి తురుము – కప్పు; బెల్లం తరుగు – అరకప్పు; యాలకులు – 4 ( పొడి చేయాలి); నెయ్యి – తగినంత.
తయారీ: ముందుగా పచ్చి కొబ్బరి తురుమును పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, వేయించు కోవాలి. తర్వాత బెల్లం తరుగు, యాలకుల పొడి కలిపి, వేడి చేయాలి ∙ఈ మిశ్రమం ముద్దలా తయారైన తర్వాత, చిన్న ఉండలుగా చుట్టాలి. కొబ్బరి లడ్డుకావలసినవి: మినప పప్పు – కప్పు; నెయ్యి – తగినంత; తరిగిన బెల్లం – కప్పు; జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష; యాలకుల ΄పొడి – తగినంత.
మినప లడ్డు
తయారీ: మినప పప్పు దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టాలి. ∙ఒక గిన్నెలో బెల్లాన్ని కరిగించి, దాంట్లో మినపపిండి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, నెయ్యి వేసి, కలిపి ఉండలు చుట్టాలి.
తక్షణ శక్తి: పదేళ్లలోపు పిల్లల్లో ఎముకల వృద్ధి, మెదడు పనితీరు వేగంగా ఉంటుంది. దీనికి తగిన విధంగా పోషకాలు గల ఆహారాన్ని అందిస్తే వారి శక్తి స్థాయులు బాగుంటాయి. చదువు, ఆటలతో త్వరగా అలసిపోతుంటారు. ఇలాంటప్పుడు తక్షణ శక్తినిచ్చే పోషకాహారం వారిని వెంటనే రీచార్జ్ చేస్తుంది. పంచదార, మైదాతో తయారైన జంక్‌ఫుడ్‌కు బదులు రాగి పిండి, ఇతర చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నట్స్, డ్రై ఫ్రూట్స్, అవిసెగింజలు, నువ్వులు, కొబ్బరితో పిల్లలకు చిరుతిండ్లు తయారు చేసి ఇవ్వచ్చు. దీనివల్ల వారికి తగినంత ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు లభిస్తాయి. బాల్యదశ శక్తిమంతంగా ఎదగడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. – సుజాతా స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్


