
చార్టర్డ్ ఎకౌంటెంట్ వికాస్ కుమార్ తన బాల్యజ్ఞాపకాల్లోకి వెళ్లినప్పుడల్లా కొంగల రెక్కల చప్పుడుతో ఊరి చెరువు ప్రత్యక్షమయ్యేది. ఆ చెరువులో తాను ఎన్నో సార్లు ఈత కొట్టాడు. అలాంటి అద్భుతమైన అనుభవం ఈతరం పిల్లలకు దూరం కావడం అతడికి బాధగా ఉండేది. ఆ బాధలో నుంచి పుట్టిందే... ఎకో ఫ్రెండ్లీ కొలను! కోయంబత్తూరులో ఉంటున్న వికాస్ సమీపంలోని చెరువుల్లో తన పిల్లాడికి ఈత నేర్పించాలనుకున్నాడు.
అయితే మురికి, రసాయనాలతో కూడిన చెరువులు అతడిని భయపెట్టాయి. అలా అని ఆయన ఊరకే ఉండిపోలేదు. పాల్లాచ్చిలోని తన స్వంత వ్యవసాయక్షేత్రంలో సెల్ఫ్–క్లీనింగ్ పాండ్‌ను నిర్మించాడు. దీనికి ముందు యూరప్‌లో ప్రసిద్ధి పొందిన ఎకో–ఫ్రెండ్లీ బయో స్విమ్ పాండ్స్ గురించి అధ్యయనం చేశాడు.
తన వ్యవసాయక్షేత్రంలో సెల్ఫ్–క్లీనింగ్ పాండ్‌ను నిర్మించడానికి మాత్రమే పరిమితం కాలేదు వికాస్. మన దేశ వాతావరణం, జీవనశైలికి అనుగుణంగా బయో స్విమ్మింగ్ కొలనులను నిర్మించడానికి ‘బయోస్పియర్’ అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ సహజసిద్ధమైన జలపాతాలు, కొలనులకు రూపకల్పన చేస్తోంది.
‘మాకు మీలాంటి కొలను ఒకటి కావాలి’ అని తమ పిల్లలతో తల్లిదండ్రులు వచ్చినప్పుడు వికాస్‌కు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ సంతోషం తన కంపెనీకి వచ్చే లాభాల గురించి కాదు. పర్యావరణ హిత, రసాయన రహిత కొలనుల గురించి వారు ఆలోచన చేస్తున్నందుకు!
(చదవండి: స్టుపిడ్ కాదు సూపర్ కపుల్! ఆ జంట లైఫ్‌స్టైల్‌కి ఫిదా అవ్వాల్సిందే..)