
వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా భారీ షాకిచ్చింది. ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఐదో ద్వైపాక్షిక సిరీస్ విజయం.
దీనికి ముందు 2016 (5-0), 2018 (2-1), 2019 (3-0), 2023 (3-2)లో కూడా సౌతాఫ్రికా ఆసీస్‌ను మట్టి కరిపించింది. ఆస్ట్రేలియాకు వరుసగా ఇది మూడో వన్డే సిరీస్ పరాజయం. సౌతాఫ్రికాకు ముందు ఆస్ట్రేలియా శ్రీలంక, పాకిస్తాన్ లాంటి చిన్న జట్ల చేతుల్లో కూడా సిరీస్ కోల్పోయింది.
మెక్‌కే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 22) జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాపై 84 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్ స్టబ్స్ (74) అర్ద సెంచరీలతో రాణించారు.
టోనీ డి జోర్జి (38), వియాన్ ముల్దర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్ (8), మార్క్రమ్ (0), బ్రెవిస్ (1), ముత్తుసామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, లబూషేన్ తలో 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. లుంగి ఎంగిడి (8.4-1-42-5) ధాటికి 37.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. ఎంగిడికి బర్గర్ (6-0-23-2), ముత్తుసామి (8-0-30-2), ముల్దర్ (5-0-31-1) కూడా జత కలవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
మధ్యలో జోష్ ఇంగ్లిస్ (87) ఆసీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి ఒక్కరి నుంచి కూడా సహకారం లభించలేదు. ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో అడ్డుతగలడంతో ఆసీస్ పతనం కాస్త లేట్ అయ్యింది. ఆ జట్టు తరఫున ఇంగ్లిస్‌తో పాటు కెమరూన్ గ్రీన్ (35) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.
హెడ్ (6), మార్ష్ (18), లబూషేన్ (1), క్యారీ (13), హార్డీ (10), బార్ట్‌లెట్ (8), ఎల్లిస్ (3), జంపా (3) దారుణంగా నిరాశపరిచారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో కూడా ఆసీస్ ఇలాగే ఘోర పరాజయాన్ని చవి చూసింది. మిగిలిన నామమాత్రపు వన్డేలో అయిన ఆసీస్ రాణిస్తుందేమో చూడాలి. ఈ మ్యాచ్ ఆగస్ట్ 24న ఇదే వేదికగా జరునుంది. కాగా, ఈ వన్డే సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.