
PC: X
టీమిండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అవుటైన తీరుపై మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) స్పందించింది. ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదని.. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) సంధించిన డెలివరీ నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేసింది. ఈ అంశంపై అనవసరపు రాద్దాంతాలు అక్కర్లేదని కొట్టిపారేసింది.
తొలి గెలుపు
టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలవగా.. రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ఈ వేదికపై తొలిసారి గెలుపు రుచిచూసింది.
పది వికెట్లు తీసిన ఆకాశ్
ఇక భారత్ విజయంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (269, 161)తో పాటు పేసర్ ఆకాశ్ దీప్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరిదైన ఐదో రోజు ఏడు వికెట్లు కూల్చాల్చిన తరుణంలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో పది వికెట్లు తీసి సత్తా చాటాడు.
అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ పేసర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24), జో రూట్ (6)లను బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్.. హ్యారీ బ్రూక్ (23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
రూట్ బలయ్యాడా?
అదే విధంగా జేమీ స్మిత్ (88), బ్రైడన్ కార్స్ (38) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, జో రూట్ అవుటైన తీరు పట్ల విమర్శలు వచ్చాయి. ఆకాశ్ దీప్ రూట్‌ను బౌల్డ్ చేసింది నిజమే అయినా.. అది నో బాల్ అని.. అతడి కాలు రిటర్న్ క్రీజును దాటిందని పలువురు విమర్శించారు. అంపైర్ తప్పిదం కారణంగా అనవసరంగా రూట్ బలయ్యాడంటూ కామెంట్లు చేశారు.
𝐑𝐨𝐨𝐭 𝐟𝐚𝐥𝐥𝐬 𝐭𝐨 𝐃𝐞𝐞𝐩 🥶#AkashDeep uproots #JoeRoot with a searing in-swinger, his second wicket puts England firmly on the back foot 🤩#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/avu1sqRrcG
— Star Sports (@StarSportsIndia) July 5, 2025
ఎంసీసీ వివరణ
అయితే, అంపైర్ మాత్రం తన నిర్ణయాన్ని అమలు చేసి రూట్‌ను అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంపై ఎంసీసీ తాజాగా స్పందించింది. రూట్ విషయలో అంపైర్‌ది సరైన నిర్ణయమని సమర్థించింది. ‘‘గత వారం టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా ఆకాశ్ దీప్ జో రూట్‌ను అవుట్ చేసిన విధానంపై కొందరు సందేహాలు లేవనెత్తారు.
అభిమానులతో పాటు కామెంటేటర్లు కూడా అది బ్యాక్ ఫుట్ నో బాల్ అని విశ్వసించారు. నిజానికి దీప్ అసాధారణ రీతిలో క్రీజుపై ల్యాండ్ అయ్యాడు. అతడి బ్యాక్ ఫుట్ రిటర్న్‌క్రీజు ఆవల నేలను తాకినట్లు కనిపించింది. అయినా సరే.. అంపైర్ దానిని నో బాల్‌గా ప్రకటించలేదని అన్నారు.
అయితే, ఈ విషయంలో ఎంసీసీ స్పష్టతనివ్వాలని భావిస్తోంది. నిబంధనల ప్రకారం.. బౌలర్ బ్యాక్ ఫుట్ తొలుత ఎక్కడ ల్యాండ్ అయిందన్న విషయాన్నే ఎంసీసీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక్కడ దీప్ పాదం వెనుక భాగం తొలుత నేలను తాకింది. అది రిటర్న్ క్రీజు లోపలే ఉంది.
అయితే, అతడి పాదంలో కొంత భాగం రిటర్న్ క్రీజు అవతల నేలను తాకి ఉండవచ్చు. కానీ నిబంధన ప్రకారం.. అతడి పాదం తొలుత రిటర్న్ క్రీజులోపలే ల్యాండ్ అయింది. కాబట్టి ఇది చట్టబద్దమైన డెలివరీయే’’ అని ఎంసీసీ తన ప్రకటనలో పేర్కొంది.
చదవండి: భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ