
జులై 10 నుంచి లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగబోయే మూడో టెస్ట్ కోసం 16 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మిగతా జట్టు యధాతథంగా కొనసాగింది. రెండో టెస్ట్‌కు ముందు మరో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
అయితే తొలి మ్యాచ్‌లో గెలవడంతో ఇంగ్లండ్ అదే జట్టును రెండో టెస్ట్‌లోనూ కొనసాగించింది. దీంతో ఆర్చర్‌కు ఛాన్స్ దక్కలేదు. మూడో టెస్ట్ తుది జట్టులో ఆర్చర్ లేదా అట్కిన్సన్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో పెద్దగా ప్రభావం చూపని క్రిస్ వోక్స్ స్థానంలో ఆర్చర్ లేదా అట్కిన్సన్‌ను ఆడించవచ్చు. మిగతా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది.
భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు..
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్
కాగా, తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 336 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి చారిత్రక విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం (58 ఏళ్ల తర్వాత).
608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్‌దీప్ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్‌దీప్ మొత్తంగా 10 వికెట్ల ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి భారత గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. అంతకుముందు లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగో టెస్ట్ జులై 23 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో.. ఐదో టెస్ట్ జులై 31నుంచి ఓవల్‌లో ప్రారంభం కానుంది.