
ఇస్లాం వెలుగు
పూర్వం కోళ్ళపురి అనే ఊరిలో చాలా కోళ్ళు ఉండేవి. వాటితోపాటు కొంతమంది బాతులు కూడా పెంచుకునేవారు. ఒకరోజు ఊరి వెలుపల చెరువులో ఒకబాతు స్నానానికి వెళ్ళింది. ఈదీఈదీ (స్నానం చేసి) బయటికొచ్చింది. ఒళ్ళంతా, ఈకలన్నీ తడిసి పోవడంతో రెక్కలు టపటపలాడించసాగింది. అప్పుడు అనుకోకుండా దాని రెక్కలు పక్కనే ఉన్న ముళ్ళ పొదలో ఇరుక్కు పొయ్యాయి. ఎంత విదిలించుకున్నా ఒళ్ళంతా గాయాలయ్యాయి గాని, అందులోంచి బయట పడలేక పోయింది. అంతలో చాలా కోళ్ళుమేసుకుంటూ మేసుకుంటూ అటువైపుగా వచ్చాయి. వాటిని చూడగానే బాతు ప్రాణం లేచి వచ్చింది. స్నేహితులారా.. నాక్కాస్త సహాయం చేయండి. నేనీ ముళ్ళ పొదలో చిక్కుకు పోయాను. నా ప్రాణాలు కాపాడండి. అని మొరపెట్టుకుంది. కాని ఆ కోళ్ళు దానికి సహాయం చెయ్యకపోగా, ‘‘మాకేం పని.. నువ్వేమైనా మాకులమా.. మా మతమా.. నీది బాతుకులం.. మాది కోడి కులం..’’ అంటూ తమదారి తాము వెళ్ళి పొయ్యాయి. కాని అందులో ఒక తెల్లని కోడి, ‘‘లేదు..లేదు.. మనమంతా కలిసి బాతును రక్షిద్దాం.. మనం కులం కాక పోయినా దానిది కూడా ప్రాణమేకదా..మనకెలా భయం, బాధ కలుగుతాయో దానికీ అలాగే కలుగుతాయికదా.. రండి రక్షిద్దాం’’ అని చెప్పింది.
కాని కోళ్ళుదాని మాట వినలేదు. ‘‘నీకంత ప్రేమ ఉంటే నువ్వెళ్ళి కాపాడుకో.. మేము రాము’’ అని తెగేసి చెప్పాయి. తమదారి తాము వెళ్ళి΄ోయాయి. పాపం తెల్ల కోడి చాలా బతిమాలింది. ఈరోజు మనం దానికి సహాయం చేస్తే, రేపు మనకేదైనా ఆపద వస్తేదేవుడు మనల్ని కా పాడతాడు. అని నచ్చజెప్పజూసింది. అయినా కోళ్ళు దాని మాట లక్ష్య పెట్టకుండా కొ..క్కొ..క్కొ..క్కో... అనుకుంటూ అక్కణ్ణించి వెళ్ళి΄ోయాయి. తెల్లకోడి ఇక చేసేదేమీలేక ఒక్కతే బాతును రక్షించడానికి కంకణం కట్టుకుంది. ముళ్ళకొమ్మలు ముక్కుతో, కాళ్ళతో లాగడం వల్ల అది కూడా తీవ్రంగా గాయపడింది. అయినా సరే దైవంపై భారంవేసి శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నించింది. చివరికి విజయం సాధించింది. బాతుప్రాణాలతో బయట పడింది. బాతు దైవానికి, తెల్ల కోడికి కృతజ్ఞతలు సమర్పించుకుంది. తెల్లకోడిని వాటేసుకొని మరీ మరీ ధన్యవాదాలు చెప్పింది. నీ మేలు ఎన్నటికీ మరువనని వాగ్దానం చేసింది.
కొన్నాళ్ళకు కోళ్ళపురి అనే ఆ ఊరికి వరదలొచ్చాయి. అంతా తట్టా బుట్టా సర్దుకొని తలా ఒక మెట్ట వైపుకు బయలు దేరారు. కోళ్ళన్నీ భయంతో గజగజ వణికిపోతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. తమ యజమానులైనా రక్షిస్తారేమోనని ఎదురు చూశాయి. కాని వారేప్రాణభయంతో తలా ఒక దిక్కుకు పరుగు లంకించుకుంటున్నారు. చూస్తూ చూస్తూనే వరద సమీపిస్తోంది. కాళ్ళ దగ్గరికొచ్చేసింది. అంతలో బాతు పరుగెత్తుకుంటూ వచ్చింది. వచ్చీరాగానే తెల్ల కోడిని సమీపించి, మిత్రమా భయపడకు నేనున్నాను. అంటూ వీపుపై ఎక్కించుకొంది. అది చూసి మిగతా కోళ్ళకు పశ్చాత్తాపం కలిగింది. ఆరోజు మనం కూడా సహాయానికి పోయి ఉంటే ఈనాడు మనకు కూడా సహాయం అందేదే అని చేసిన తప్పును గుర్తుచేసుకొని సిగ్గుతో తలవంచుకున్నాయి. బాతు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తెల్ల కోడిని సురక్షిత ప్రదేశానికి చేర్చి, తన తోటి బాతులన్నిటినీ పిలుచుకొచ్చింది. కోళ్ళన్నిటినీ అవి తమ వీపులపై ఎక్కించుకొని ఈదుకుంటూ అవతలకు చేర్చాయి.
కష్టాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యడం, ఇతరుల బాధను తొలగించడం చాలా గొప్ప పుణ్యకార్యం. ఆపదలో ఉన్నవారు మనవాళ్ళా కాదా అని చూడడం అజ్ఞానం. మనవాళ్ళయితే సహాయం చెయ్యడం, కాకపోతే వదిలేయడం ధర్మ వ్యతిరేకం. మానవత్వానికీ వ్యతిరేకం. ఆపదలో పడింది ఎవరైనా సరే ఆదుకోవడం ధర్మం, మానవత్వం. ఏదోఒక సమయంలో దాని ప్రతిఫలం లభించి తీరుతుంది. మనకు తెలియకుండానే ఊహించని వైపునుండి సహాయం అందుతుంది.
ఇతరుల కష్టాలను దూరం చేసేవారిని దైవం ప్రేమిస్తాడని, వారి కష్టాలను దూరం చేస్తాడని దైవ ప్రవక్త వారు చెప్పిన సూక్తికి ఈ కథ అద్దం పడుతోంది. కనుక కష్టాల్లో, బాధల్లో ఉన్నవారు ఎవరైనా సరే శక్తిమేర ఆదుకునే ప్రయత్నం చేయడమే విశ్వాసుల లక్షణం. తద్వారానే ఇహ, పరలోకాల సాఫల్యం ప్రాప్తమవుతుంది.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్