
ఇస్లాం వెలుగు
ధర్మబద్ధమైన జీవనమే సాఫల్యమార్గం
పుడమిపై శ్వాస పీలుస్తున్న ప్రతి ప్రాణీ ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒకరోజు ఈ జీవితాన్ని ముగించాల్సిందే. పుట్టిన ప్రతి ప్రాణికీ మరణం తప్పదు. ఇది నగ్నసత్యం. తిరస్కరించలేని నిజం. ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. ‘కుల్లునఫ్సిన్ జాయిఖతుల్ మౌత్ ’ అని పవిత్ర ఖురాన్ చెప్పింది. ‘జాతస్య మరణం ధ్రువం’ అని వేదం చెప్పింది. ఏ ధర్మం చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా అర్థం అదే. కాని మనం దీన్ని పట్టించుకోం. మన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మరణిస్తూనే ఉన్నారు. మనం వారి అంత్యక్రియల్లో పాల్గొని, స్వయానా మన భుజాలపై మోసి, వారిని సమాధిలో దించి, స్వహస్తాలతో వారిపై మట్టికూడా వేస్తున్నాం. వారు సంపాదించిన ఆస్తిపాస్తులు, ఆభరణాలు, హోదా, అధికారం ఏదీ వారు తమవెంట తీసుకువెళ్ళడం లేదు. రిక్తహస్తాలతో వచ్చారు. రిక్తహస్తాలతోనే వెళ్ళిపోతున్నారు.
కనీసం పార్థివ శరీరంపై ఉన్న బట్టలు, ఆభరణాలు కూడా ఇక్కడే వదిలేసి, ఆత్మీయులతో బంధాలను సైతం తెంచుకొని ఈలోకాన్ని వీడివెళ్ళి΄ోతున్నారు. తమవెంట భూములు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఏవీ తీసుకొని వెళ్ళడంలేదు. ప్రాణప్రదంగా ప్రేమించే భార్యాబిడ్డలు కూడా వెంట వెళ్ళడంలేదు. అంటే ఇవేవీ ఆ రోజు పనికి రావన్నమాట.
ముహమ్మద్ ప్రవక్త ఒక మాట చెప్పారు. ధర్మాధర్మాల విచక్షణ పాటించండి. మంచి పనులు విరివిగా చేయండి. రేపు మిమ్మల్ని కాపాడేవి ఇవే. ‘ఎందుకంటే, మీరు సంపాదించిన డబ్బూ దస్కం, ఆభరణాలు, ఆస్తిపాస్తులు సమస్తమూ మీ ఊపిరి ఆగిన మరుక్షణమే మీతో సంబంధాన్ని తెంచుకుంటాయి. మీరు తినీ తినకా, ధర్మం అధర్మం ఆలోచించకుండా, రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినదంతా మీది కాకుండా పోతుంది. భార్యాబిడ్డలు, బంధుగణం, మిత్రబృందం... వీరంతా మిమ్మల్ని సమాధి వరకు మాత్రమే సాగనంపుతారు. సమాధిలో దించి, మిమ్మల్ని మట్టిలో కలిపేసి వెళ్ళి΄ోతారు. మీ వెంట వచ్చేది, మిమ్మల్ని కాపాడేది కేవలం మీరు చేసుకున్న మంచి పనులు మాత్రమే.
కనుక ధర్మాధర్మాలను విడిచిపెట్టి, ఇతరులను మోసం చేసి, వంచించి, అక్రమ దారిలో సంపాదించి చివరికి బావుకునేదేమిటో ఎవరికివారు ఆలోచించుకోవాలి. మంచీ చెడుల విచక్షణతో, ధర్మబద్ధంగా ముందుకు సాగితే, ఆ క్రమంలో ఎంత లభిస్తే అంతతో సంతృప్తి చెందితే అదే అసలు విజయం. అసలు సాఫల్యం. కేవలం మన లాభం కోసం ఇతరులను వంచించడం మానవీయ విలువలకే వ్యతిరేకం. కాబట్టి, ఇహలోక జీవితం ప్రశాంతంగా, సంతోషంగా, గౌరవ ప్రదంగా సాగి΄ోవాలన్నా, రేపటి పరలోక జీవితం జయప్రదం కావాలన్నా మరణాన్ని మరువకూడదు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్