బంగ్లాదేశ్‌లో ప్రాణాలు కోల్పోయిన మరో హిందువు
ఢాకా: మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూరేలా మరో హిందువు హత్యోదంతం తాజాగా వెలుగుచూసింది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు మెమిన్‌సింగ్ జిల్లాలోని మెహ్రాబారీ ప్రాంతంలోని సుల్తానా స్వెట్టర్స్ లిమిటెడ్ వస్త్ర పరిశ్రమ వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్ హత్యకు గురయ్యారు. తోటి సెక్యూరిటీ గార్డ్ అయిన 29 ఏళ్ల నోమన్ మియా తన సర్విస్ షాట్‌గన్‌తో కాలచ్చింపాడు. అయితే ఉద్దేశపూర్వకంగా అతడిని హత్యచేయలేదని మియా చెప్పారు.
‘‘పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ సరదాగా గన్‌ను బిశ్వాస్ వైపు గురిపెట్టా. వేలు పొరపాటున ట్రిగ్గర్‌కు తగిలి గన్ పేలింది. దీంతో బుల్లెట్ గాయంతో అతడు కూలబడితే వెంటనే భలూకా ఉపజిల్లా ఆస్పత్రిలో చేర్పించాం’’అని మియా వివరించారు. అయితే విషయం తెల్సి పోలీసులు వెంటనే మియాను అరెస్ట్‌చేశారు. ఉద్దేశపూర్వకంగానే హత్యచేశాడని విపక్ష పార్టీలు, హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయి దేశాన్ని వీడాక బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు ఎక్కువయ్యాయి. దైవదూషణ ఆరోపణలపై డిసెంబర్ 18న ఫ్యాక్టరీ కార్మికుడైన హిందువు దీపూ చంద్రదాస్‌ను స్థానికులు కొట్టిచంపారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అమృత్ మొండల్ అనే మరో హిందువునూ చంపేశారు.


