నిన్న గుండెలు జారిపోయే జర్నీ గురించి చూశాం కదా? ఇది అంతకుమించింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఆ గుండె చాలా గట్టిదై ఉండాలి. ఎందుకంటే దీనిపై వెళ్తుంటే మండు వేసవిలోనూ వణుకు పుట్టడం ఖాయం. ఫొటోలు చూస్తే ఆ సంగతి అర్థమైపోతోంది కదూ? ఈ రోడ్డులో జరిగిన ప్రమాదాల్లో చాలామంది మృత్యువాతపడ్డారు. అందుకే దీనిని డెత్ రోడ్డు అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ రహదారి బొలీవియా రాజధాని లా పాజ్ నుంచి నార్త్ యుంగాస్ వరకు 64 కిలోమీటర్ల మేర ఉంటుంది. 1930లలో చాకో యుద్ధ సమయంలో పరాగ్వే యుద్ధ ఖైదీలు దీనిని నిర్మించారు.
రోడ్డులో చాలా భాగం కొండ అంచునే సాగుతుంది. పచ్చని చెట్లు.. దగ్గరగా పలకరించే మేఘాలు.. అందమైన జలపాతాలతో జర్నీ ఎంత బాగుంటుందో.. ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదాలు అంతే ఆందోళనకరంగా అనిపిస్తాయి. ఈ రోడ్డు చాలా ఇరుకుగా.. కొన్నిచోట్ల 3 మీటర్ల వెడల్పు లోపే ఉంటుంది. ఓ పక్కన ఏకంగా 600 మీటర్ల లోతైన లోయలు శీతాకాలంలో కూడా అరికాళ్లలో చెమటలు పట్టిస్తాయి. లోయలోకి పడిపోకుండా ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దీంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడే ప్రమాదమూ పొంచి ఉంటుంది. 1990వ దశకం మధ్యకాలం వరకు ఈ రోడ్డులో ఏటా వంద మంది వరకు మరణించేవారు.
అనంతరం ఆ సంఖ్య 200 నుంచి 300కి పెరిగింది. 1983 జూలైలో ఓ బస్సు లోయలోకి పడిపోవడంతో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1998 తర్వాత దాదాపు 30 మంది సైక్లిస్టులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధన సవరించారు. బొలీవియాలో వాహనాలు రోడ్డుకు కుడివైపున నడుస్తాయి. కానీ ఈ రోడ్డులో వెళ్లేటప్పుడు డ్రైవర్లు లోయ అంచును స్పష్టంగా చూడటం కోసం ఎడమ వైపున ప్రయాణించాలని నిబంధన విధించారు. 2006లో సేఫ్టీ గ్రిల్స్, డ్రైనేజ్ సిస్టమ్‌తో కూడిన రెండు లైన్ల కొత్త రోడ్డు అందుబాటులోకి రావడంతో ఈ మృత్యురహదారి సాహస పర్యాటక ప్రాంతంగా మారింది. ముఖ్యంగా మౌంటెన్ బైకింగ్‌కు ప్రసిద్ధ గమ్యస్థానమైంది.


