
‘‘మనందరిలో ఓ దుర్గా మాత ఉంది. ఆ శక్తిని మనం గ్రహించగలిగితే మనం ఏదైనా సాధించగలం. స్త్రీలు అనుకుంటే ఎలాంటి సవాల్‌ని అయినా అద్భుతంగా ఎదుర్కొంటారని నా నమ్మకం’’ అంటున్నారు పూజా హెగ్డే. సౌత్–నార్త్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్న ఆమె ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు...
ఈ నవరాత్రి రోజుల్లో మా కుటుంబం మొత్తం శాకాహారులుగా మారిపోతాం. ఈ పండగ అప్పుడు కుదిరితే గుడికి వెళతాను. లేకపోయినా నాకు తరచూ గుడికి వెళ్లడం అలవాటు. మన ఎనర్జీ లెవల్స్ బాగుండటానికి మనం గుడికి వెళ్లడం మంచిది అని నా అభిప్రాయం. గుడిలో కాలు పెట్టగానే తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనం క్షేమంగా ఉండటానికి ఆ ఎనర్జీ పనికొస్తుంది. అందుకే గుడికి వెళ్లడాన్ని నేను బాగా నమ్ముతాను.
→ నవరాత్రి టైమ్‌లో ఉపవాసం ఉండను కానీ నాకు ఫాస్టింగ్ అంటే నమ్మకం. ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఉపవాసం ఉండేవారు. తొమ్మిది రోజులు కేవలం నీరు మాత్రమే తీసుకునేవారు. అంత కఠినమైన ఉపవాసం ఆచరించేవారు. కానీ నేనెప్పుడూ అలా చేయలేదు. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ‘అంగారిక సంకష్ట చతుర్ది’ నాడు, మహా శివరాత్రికి తప్పకుండా ఫాస్టింగ్ చేస్తాను.
→ చాలా సంవత్సరాలుగా నేను దాండియా ఆడలేదు. ఓ పదేళ్ల క్రితం నా స్నేహితులతో కలిసి దాండియా ఆడటానికి వెళ్లాను. గర్బా డ్యాన్స్ పోటీ జరుగుతోందని అక్కడికి వెళ్లాక తెలిసింది. ఈ కాంపిటీషన్ కోసం కొన్నిగ్రూప్స్ సభ్యులు ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసి మరీ పాల్గొంటారని తెలిసి, ఆశ్చర్యపోయాను. వాళ్ల డ్యాన్స్ నిజంగా అద్భుతం. నేను కూడా ఒక గ్రూపులోకి వెళ్లి, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. కానీ అది అంత తేలికైన విషయం కాదని అర్థమైంది.
→ ప్రతి మహిళలోనూ ఓ శక్తి ఉంది. మనలో ఆ శక్తి స్వరూపిణి దుర్గా మాత ఉందని గ్రహించాలి. నవరాత్రి అంటే మనలో ఉన్న ఆ దేవిలోని పలు షేడ్స్‌ని సెలబ్రేట్ చేయడమే. మన లోపల ఉన్న దైవిక స్త్రీత్వాన్ని గుర్తించడమే. అయితే నేనిప్పటివరకూ గమనించినంతవరకూ స్త్రీలకు ఏదైనా సవాల్ ఎదురైతే అద్భుతంగా అధిగమించే నేర్పు వారికి ఉందని తెలుసుకున్నాను. కానీ మనకు మనంగా పరిష్కరించుకోగలుగుతాం అనే విషయం మనకు అర్థం కావాలి. లోపల దాగి ఉన్న ఆ శక్తిని గుర్తించి ముందుకెళితే మన వల్ల కానిది ఏదీ లేదు.
→ నవరాత్రి సమయంలో నాకు బాగా నచ్చినది ‘హవన్’ (హోమం). హవన్‌లో బియ్యం, నువ్వులు, ధాన్యాలు, నెయ్యి వంటివి సమర్పించి, ఆ దుర్గా మాత ఆశీర్వాదాన్ని కోరతాం. హవన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు వెచ్చగా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. చాలా పవిత్రంగా అనిపిస్తుంది. మామూలుగా నవరాత్రి అప్పుడు బంధువులు ఇంటికి వస్తుంటారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ‘హవన్’కి మాత్రం అందరూ హాజరవుతారు. అలాగే పసుపు ఆకు తింటాం. ఆ ఆకు నుంచి వచ్చే సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. నా చిన్నప్పటి తీపి గుర్తుల్లో ఇదొకటి.
→ మా ఇంట్లో తొమ్మిది రోజులు పండగను చాలా శ్రద్ధగా చేస్తాం. ఇందాక నవరాత్రి సమయంలో ఆచరించేవాటిలో నాకు ‘హవన్’ ఇష్టం అని చె΄్పాను కదా. అష్టమి రోజున అది చేస్తాం. మేం లక్ష్మీ పూజ కూడా బాగా చేస్తాం. అలాగే ‘మాంజో లిరెట్టా గట్టి’ అని వంటకం చేస్తాం. కొబ్బరి తురుము, బెల్లం కలిపి ముద్దలా కలిపి, పసుపు ఆకులో పెట్టి ఉడికిస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఓ పట్టు పడుతుంటాను.
→ దసరా అనగానే మనకు చెడుపై మంచి గెలుపు అనేది గుర్తొస్తుంది. నా వరకూ నా చుట్టూ ఉన్న చెడు గురించి, చెడు చేసేవాళ్ల గురించి అస్సలు పట్టించుకోను. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయడంపైనే దృష్టి పెడతాను. వందకు వంద శాతం పని చేయడం... మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లడం... ఈ రెంటినీ ఫాలో అవుతాను. అప్పుడు ఎన్నో రెట్లు రూపంలో మంచి మన వద్దకు వస్తుందని నమ్ముతాను. ఇక చెడు చేసిన వారి గురించి ఆలోచించకుండా... మానవులకు అతీతమైన ‘ఉన్నత శక్తి’కి వదిలేస్తాను.
నవరాత్రి సమయంలో మా ఇంట్లో బాగా భజనలు చేస్తాం. నా చిన్నప్పట్నుంచి ఇప్పటివరకూ ఒకే పద్ధతిలోనే పండగ జరుపుకుంటూ వస్తున్నాం. ప్రపంచంలో ఏదైనా మారొచ్చు. కానీ మన ఆచారాలను మనం ఎప్పుడూ ఒకేలా పాటించాలి. ఇప్పుడు వర్క్ షెడ్యూల్స్ వల్ల నేను చాలా పండగలను మిస్సవుతున్నాను. అయితే ఏ మాత్రం వీలు కుదిరినా పండగలప్పుడు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తాను.
– డి.జి. భవాని