
ఇస్లాం వెలుగు
సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి జీవితాన్ని కోరుకుంటారు. శాంతి, సుఖ సంతోషాలు తమ సొంతం కావాలని అభిలషిస్తారు. కష్టనష్టాలను, అశాంతిని ఎవ్వరూ ఆశించరు. కానీ ఏదీ ఆశించినట్లు, అనుకున్నట్లు జరగదు. జీవితంలో అనుకూల, ప్రతికూల పరస్థితులు వస్తూనే ఉంటాయి. ఎగుడు దిగుళ్ళు మానవ జీవితంలో అనివార్యం. అనుకూల పరిస్థితుల్లో ΄ పొంగిపోవడం, ప్రతికూల పరిస్థితుల్లో కుంగిపోవడం మానవుడి చంచల స్వభావానికి నిదర్ళనం.
అసలు మంచి జీవితమంటే ఏమిటి? సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలంటే ఏమిటి? అందమైన భవంతి, కళ్ళు చెదిరే ఆస్తులు, హోదా, అధికారం, వాహనాలు, భార్యాపిల్లలు, కుటుంబం – ఇవన్నీ సమకూరితే మంచిజీవితం లభించినట్లేనా? సుఖసంతోషాలు సొంతమైనట్లేనా? కాదు..ఇవన్నీ ఆనందంలో ఒక భాగమే తప్ప, పరిపూర్ణ సంతోషానికి సోపానాలు కాలేవు. ఇది అనుభవం చెప్పే యథార్ధం. ఎందుకంటే, అందమైన ఇల్లు, కోరుకున్న భార్య, రత్నాల్లాంటి బిడ్డలు, విలాసవంతమైన వాహనాలు, కావలసినంత బ్యాంకుబ్యాలెన్సు, బలం, అధికారం, – ఇంకా రకరకాల విలాసవంతమైన సాధనా సంపత్తి నిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ, సంతోషంకోసం, సంతృప్తికరమైన జీవితం కోసం వెదుకులాట మానవ సమాజంలో ప్రతినిత్యం మనం చూస్తున్నాం. అన్నీ ఉండికూడా అనుభవించలేని అనేకమంది సంపన్నులూ మనకు పరిచయమే. అంటే ఇవన్నీపాక్షిక ఆనందాన్ని మాత్రమే అందించగలవుకాని, పరిపూర్ణసంతోషానికి సోపానం కాలేవని మనకు అర్థమవుతోంది. అయినా మనిషి అనాదిగా శాంతి, సంతోషాలకోసం తంటాలు పడుతూనే ఉన్నాడు. తనకు తోచిన ప్రయోగాలతోపాటు, తనలాంటి వారు చెప్పే సూత్రాలన్నిటినీ పాటిస్తున్నాడు. ఎవరెవరి చుట్టూనో తిరుగుతూ, చెప్పిందల్లా చేస్తూ, తులమో ఫలమో సమర్పించుకుంటూ ఉన్నాడు. కాని ఎక్కడా శాంతి, సంతోషం లభించడంలేదు.
ధనం ధారపోసి కొనుక్కుందామంటే, అది మార్కెట్లో లభ్యమయ్యే వస్తువు కూడా కాదాయె. మరేమిటీ మార్గం? మంచిజీవితం, శాంతి, సంతోషం, సంతృప్తి ఇవన్నీ ఎండమావేనా? ఇదే విషయాన్ని ఒక శిష్యుడు ముహమ్మద్ ప్రవక్త (స) వారిని అడిగాడు. అప్పుడాయన గారు,’ అల్లాహ్ ను (దైవాన్ని) బాగా స్మరించు. అనాథలను ఆదరించు. పేదసాదలకు శక్తిమేర సహాయం చెయ్యి.’ అని ఉపదేశించారు. అంటే, ఇలా చెయ్యడం ద్వారా నువ్వు కోరుకుంటున్న శాంతి, సంతోషాలతో నిండిన మంచి జీవితం ప్రాప్తమవుతుంది అని అర్థం. కాని నాలుగు రాళ్ళసంపాదన సమకూరగానే దుర దృష్ట వశాత్తూ మనుషుల్లో అహం పెరిగి పోతోంది. దైవాన్ని స్మరించడం తరువాత సంగతి, అసలు దైవాన్నే మరిచి పోయి, పేదసాదలను దగ్గరికి రానివ్వని పరిస్థితి నెలకొంటోంది. మరిక శాంతి లభించాలంటే ఎలా లభిస్తుంది.? కాబట్టిసర్వకాల సర్వావస్థల్లో దైవాన్ని స్మరిస్తూ, సాధ్యమైనంతమేర మంచి పనులు చేస్తూ, చెడులకు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. సత్కార్వాల్లో లభించే సంతోషం సంతృప్తి మరెందులోనూ లభించదు. ధర్మబద్ధమైన సంపాదన, ధర్మసమ్మతమైన ఖర్చు, సత్కార్యాల్లో సమయాన్ని వెచ్చించడం – ఇదిగనక మనం ఆచరించగలిగితే నిత్య సంతోషం, ఇహపర సాఫల్యం సొంతమనడంలో సందేహమే లేదు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్