
న్యూఢిల్లీ: భారత్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్ల రూపాయలు ఎగవేసి, దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరస్తుడు మెహుల్ ఛోక్సీని దేశానికి రప్పించడంలో భారత్ విజయం సాధించింది. మెహుల్ ఛోక్సీని భారత్‌కు అప్పగించే విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని బెల్జియం కోర్టు స్పష్టం చేసింది.
భారత్‌కు మెహుల్ ఛోక్సీని అప్పగించేందుకు ఈ మధ్యనే బెల్జియం న్యాయస్థానం ఆమోదం తెలిపింది. అయితే ఈ క్రమంలో తన అప్పగింత ఆమోదం అనేది రాజకీయ ప్రేరేపితమని, ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని మెహుల్ ఛోక్సీ ఆరోపించారు. ఈ నేపధ్యంలో తాజాగా బెల్జియం యాంట్వెర్ప్ కోర్టు.. ఛోక్సీ ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఛోక్సీ బెల్జియం పౌరుడు కాదని గుర్తుచేస్తూ, అతని అప్పగింతను సమర్థించేలా, తీవ్రమైన అభియోగాలను మెహుల్ ఛోక్సీ ఎదుర్కొంటున్నాడని పేర్కొంది. ఛోక్సీపై భారత్ మోపిన అభియోగాలను బెల్జియంలోని చట్టాల ప్రకారం కూడా నేరాలుగానే పరిగణిస్తామని కోర్టు తెలిపింది. భారతదేశ ఆదేశాల దరిమిలా, తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేశారంటూ ఛోక్సీ కొంతకాలంగా చేస్తున్న వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
బెల్జియం కోర్టు తన తీర్పులో ఛోక్సీ అప్పగింత అనంతరం అతనిని ఉంచే జైలుకు సంబంధించి భారత్ అందించిన వివరాలను కూడా తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి దాదాపు రూ.13 వేల కోట్ల రుణాలను మెహుల్ ఛోక్సీ ఎగవేశాడు. ఇదే కేసులో ప్రమేయం ఉన్న అతని మేనల్లుడు నీరవ్ మోదీ భారత్ విడిచి పారిపోయాడు. ఛోక్సీ.. ఆంటిగ్వా-బార్బుడాకు వెళ్లగా, నీరవ్‌మోదీ లండన్‌లో తలదాచుకున్నాడు. అంట్వర్ప్‌లోని న్యాయస్థానం ఈ మధ్యనే ఛోక్సీ అప్పగింతకు ఆమోదం తెలిపింది. అయితే చోక్సీ రాబోయే 15 రోజుల్లో బెల్జియం సుప్రీంకోర్టులో ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 11న ఆంట్వెర్ప్‌లో చోక్సీని అరెస్టు చేశారు. అప్పటి నుండి అతను బెల్జియంలోని ఆంట్వెర్ప్ జైలులో ఉన్నాడు. నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు.
ఇది కూడా చదవండి: మహిళలకు రూ. 30 వేల జీతంతో శాశ్వత ఉద్యోగం: తేజస్వీ భారీ హమీ