పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల ప్రహసనంలో ఐదుగురు అభ్యర్థులు అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇది ఓట్ల లెక్కింపు సమయంలో ఉత్కంఠను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఆ అభ్యర్థులు వీరే..
1. రాధా చరణ్ సాహ్ (జేడీయూ)
సందేశ్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత స్వల్ప తేడాతో విజయం సాధించిన రికార్డును నమోదు చేసింది. జేడీయూ అభ్యర్థి రాధా చరణ్ సాహ్ తన ప్రత్యర్థి, ఆర్జేడీకి చెందిన దిపు సింగ్‌ను కేవలం 27 ఓట్ల తేడాతో ఓడించారు. సాహ్ 80,598 ఓట్లు (43.99%) సాధించగా, సింగ్ 80,571 ఓట్లు (43.97%) దక్కించుకున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థుల తుది రౌండ్ లెక్కింపు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఓటును అత్యంత జాగ్రత్తగా లెక్కించారు.
2. సతీష్ కుమార్ సింగ్ యాదవ్ (బీఎస్‌పీ)
రామ్‌గఢ్‌లో బీఎస్‌పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్‌ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి, సంచలనం సృష్టించారు. యాదవ్ 72,689 ఓట్లు (37.29%) సాధించగా, సింగ్ 72,659 ఓట్లు (37.29%) పొందారు. పోలింగ్ శాతంలో కూడా వీరి మధ్య స్వల్ప తేడానే ఉంది. ఇది బీఎస్‌పీకి బీహార్‌లో ఏకైక విజయంగా నిలిచింది. ఇది ఆ పార్టీకి ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది. ఈ ఫలితం ఆఖరి వరకు ఉత్కంఠను రేకెత్తించింది.
3. మహేష్ పాస్వాన్ (బీజేపీ)
అగియాన్ నుంచి ఎన్‌డీఏ కూటమి తరపున పోటీ చేసిన బీజేపీపీ అభ్యర్థి మహేష్ పాస్వాన్, సీపీఐ(ఎంఎల్)కు చెందిన శివ ప్రకాష్ రంజన్‌పై కేవలం 95 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. పాస్వాన్ 69,412 ఓట్లు (45.2%) పొందగా, రంజన్ 69,317 ఓట్లు (45.14%) సాధించారు. ఈ నియోజకవర్గంలో వామపక్ష పార్టీ అభ్యర్థి నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. ఈ స్థానంలో లెక్కింపు పారదర్శకంగా ఉన్నప్పటికీ, స్వల్ప తేడా కారణంగా తుది ప్రకటన కోసం కొంత సమయం పట్టింది.
4. ఫైసల్ రెహమాన్ (ఆర్జేడీ)
ఢాకా నియోజక వర్గం ఆర్జేడీ అభ్యర్థి ఫైసల్ రెహమాన్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన పవన్ కుమార్ జైస్వాల్‌ను 178 ఓట్ల తేడాతో ఓడించగలిగారు. రెహమాన్ 1,12,727 ఓట్లు (45.72%) సాధించగా, జైస్వాల్ 1,12,549 ఓట్లు (45.64%) పొందారు. స్వల్ప తేడా ఉన్నప్పటికీ, మహాకూటమి తరపున ఆర్జేడీకి ఈ విజయం ముఖ్యమైనదిగా మారింది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు దాదాపు సమాన సంఖ్యలో ఓట్లను పొందడం చర్చనీయాంశంగా మారింది,
5. మనోజ్ బిశ్వాస్ (కాంగ్రెస్)
ఫోర్బ్స్‌గంజ్ కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ బిశ్వాస్ బీజేపీకి చెందిన విద్యా సాగర్ కేషారీని 221 ఓట్ల స్వల్ప తేడాతో ఓడించారు. బిశ్వాస్ 120,114 ఓట్లు (47.77%) సాధించగా, కేషారీ 1,19,893 ఓట్లు (47.68%) పొందారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఉత్కంఠభరిత విజయాలలో ఒకటి.
ఇది కూడా చదవండి: Sweden: జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి


