ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వారం తిరగకుండానే అతని బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టేసింది. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. సెంగార్ కుమార్తె ఇషితా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది
ఇంతకాలం తమను శక్తివంతులమని విమర్శిస్తున్నవాళ్లు.. ఇప్పుడేం అంటారు అని ఓ ప్రశ్న సంధించారామె. ‘‘అధికారంలో ఉన్నవాళ్లమని.. పవర్‌ఫుల్ వ్యక్తులమంటూ ఇంతకాలం మమ్మల్ని నిందిస్తూ వచ్చారు. కానీ ఆ అధికారమే ఉంటే.. ఈ ఎనిమిదేళ్లుగా మాకు మాట్లాడే అవకాశం ఎందుకు దొరకలేదు?. పైగా అవమానాలు.. బెదిరింపులు.. ఆన్‌లైన్‌లో దాడులు ఎందుకు ఎదుర్కొంటున్నాం’’ అంటూ డాక్టర్ ఇషితా సెంగార్ భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారు.
నేను నోరు విప్పకుండానే.. నాపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనే లేబుల్ పడిపోయింది. నాకు, నా కుటుంబానికి మానవత్వమే లేదని తిట్టారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కొందరు పోస్టులు చేశారు. నన్ను, నా సోదరిని అత్యాచారం చేయాలి.. చంపాలి అంటూ కామెంట్లు చేశారు. మా గౌరవాన్ని ఒక్కొక్కటిగా లాక్కొన్నారు. మమ్మల్ని అవమానించారు.. ఎగతాళి చేశారు. ఇది అన్యాయం అని నేను అనను. ఎందుకంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ భయాన్ని సృష్టించారు కాబట్టి. ఎనిమిదేళ్లుగా.. ఇది ప్రతీరోజూ జరుగుతోంది.
కోర్టులో మా వాదనలకు అవకాశం లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థతో పాటు జర్నలిజం.. ఆఖరికి మా గురించి తెలిసిన జనాలు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. అంతలా ఒత్తిళ్లు నెలకొంటున్నాయి. నాకు ఇంకెక్కడా చోటు కనిపించలేదు. అందుకే ఇక్కడ రాస్తున్నా. ఇంతకాలం భయంతో పరుగులు తీశాం. ఒక కార్యాలయం నుండి మరొకదానికి లేఖలు రాస్తూ, కాల్స్ చేస్తూ.. అలసిపోయి ఉన్నాం. అయినా ఆశను వదులుకోవడం లేదు.
నా ఈ ప్రయత్నం.. ఎవరినో బెదిరించడానికో, సానుభూతి పొందడానికో కాదు. నేనూ ఈ దేశపు బిడ్డనే. మేం మనుషులమే. మేమూ న్యాయ్యాన్ని కోరుకుంటున్నాం. ఆ న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్న ఓ కుమార్తె.. అంటూ పోస్ట్ చేశారామె.
To
The Hon’ble Authorities of the Republic of India,
I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.
For eight years, my family and I have waited. Quietly.…— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025
సెంగార్ మరో కూతురు ఐశ్వర్య కూడా గతంలో ఇదే తరహా ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నావ్ బాధితురాలి క్యారెక్టర్ మంచిది కాదని.. తమ తండ్రిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జరిగిన కుట్రలో ఆమె భాగమైందని.. అందుకే అత్యాచార ఆరోపణలు చేసిందని.. తమ తండ్రి అమాయకుడని.. మీడియాగోల తప్ప అసలు విచారణ జరగడం లేదని ఇద్దరు కూతుళ్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.
2017లో యూపీ ఉన్నావ్‌కు చెందిన 17 ఏళ్ల బాధితురాలిపై అప్పటి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశారని.. ఆపై తన అనుచరులతో గ్యాంగ్ రేప్ చేయించారని.. ఆమెను అమ్మేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసుల విచారణ సమయంలో తన మనుషులతో సెంగార్ తన తండ్రిని చంపించాడని.. తనపైనా హత్యాయత్నం జరిగిందని.. ఆ దాడి నుంచి తాను తప్పించుకుంటే బంధువులిద్దరు మృతి చెందారని బాధితురాలు ఆరోపించింది.
సీబీఐ దర్యాప్తు.. విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ చివర్లో.. సెంగార్‌ను ఈ కేసుల్లో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆ సమయంలో సెంగార్ కుటుంబం కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. అదే ఏడాది ఆయన్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది కూడా. అయితే ఈ ఏడాది డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే సెంగార్ మరో కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తుండడంతో వెంటనే రిలీజ్ కాలేదు. ఈలోపు..
బాధితురాలు, సీబీఐలు సుప్రీం కోర్టులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్లను సోమవారం(డిసెంబర్ 29) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నిలిపివేసింది.


