చీర బిగుసుకుని బాలుడి మృతి
వెల్దుర్తి: ఊయలే ఆ బాలుడికి ఉరి తాడైంది. ఏడేళ్లకే అందని లోకాలకు చేర్చింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కలుగొట్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన అహ్మద్‌బాషా, హసీనాబీలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్న కుమారుడు అఫ్రోజ్(7) రెండో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా తట్టు వ్యాధితో బాధపడుతూ ఇంట్లో ఉంటున్నాడు.
గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన అఫ్రోజ్ ఇంటి ఆవరణలోని రేకుల షెడ్‌కు కట్టిన చీర ఊయలలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ చీర మెడకు బిగుసుకుంది. భోజనం ముగించుకుని బయటకు వచ్చిన తల్లిదండ్రులు కుమారుడి మెడకు ఊయల బిగుసుకుని కనిపించడంతో ఆందోళన చెందారు. చీరను తప్పించి చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. కళ్ల ముందు విగతజీవిగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.


