విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడతారా?.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎప్పుడిస్తారు?
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్‌సీపీ
కూటమి సర్కార్ పెట్టిన మొత్తం ఫీజు బకాయిలు రూ.6,300 కోట్లు
ఇప్పటివరకు చెల్లించింది రూ.700 కోట్లు మాత్రమే
ఈ విద్యా సంవత్సరంతో కలిపి వసతిదీవెన బకాయిలు రూ. 3,300 కోట్లు
వాటిని కూడా కలుపుకుంటే మొత్తం రూ. 8,900 కోట్లు పెండింగ్..
అసెంబ్లీ ఉందని హడావుడిగా రూ.1,200 కోట్లకు బీఆర్‌ఓ
అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో దేవుడికే ఎరుక
పరీక్షలు రాయనివ్వక.. రాసినా సర్టిఫికెట్లు రాక విద్యార్థులకు తీవ్ర ఇక్కట్లు
రూ. 4వేల కోట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని మంత్రుల అబద్ధాలు
2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వల్ల ఒక్క క్వార్టర్ ఫీజులు మాత్రమే పెండింగ్
మంత్రులు చెబుతున్న అబద్ధా్దలపై అధికారులను పిలిచి తేలుద్దామని బొత్స డిమాండ్
ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్
సాక్షి, అమరావతి: ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై చంద్రబాబు సర్కార్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడేసింది. బాబుగారి అబద్దాల స్కూలులో మాస్టర్ డిగ్రీలు చేసిన మంత్రులిద్దరు ఫీజు బకాయిలపై శాసనమండలిలో నోటికొచ్చిన లెక్కలు చెప్పి అభాసుపాలయ్యారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే రూ.4వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందని మంత్రులు నారా లోకేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి వ్యాఖ్యానించడంతో శాసనమండలిలో కలకలం రేగింది. ఆ ఆరోపణలను వైఎస్సార్‌సీపీ సభ్యులు సమర్థవంతంగా తిప్పికొట్టారు.
2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి ఒక్క క్వార్టర్ (జనవరి–మార్చి) ఫీజు బకాయిలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతిపక్షం అడ్డుపడకపోతే అవి కూడా చెల్లించేసేవారమని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మేనెలలో ఇవ్వాల్సింది ఎన్నికల ప్రక్రియ వల్ల ఆ క్వార్టర్ ఒక్కటి ఇవ్వలేక పోయామని బొత్స వివరించారు. అధికారులను పిలవండి, దీనిపై సమాధానం చెప్పండి అని ఆయన మంత్రులను నిలదీశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటుందా అని బొత్స ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏ క్వార్టర్ పీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఆ క్వార్టర్‌లోనే చెల్లించే విధానం ఉందని, ఈ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించని కారణంగా కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఎప్పటి లోగా ఆ బకాయిలు చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఈ అంశంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మంత్రులు వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు బకాయి పెట్టిందంటున్నారని తప్పుపట్టారు. ‘మేం అధికారంలో ఉండగా ఏ క్వార్టర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఆ క్వార్టర్‌లోనే చెల్లిస్తూ వచ్చాం. 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి కేవలం ఒక్క క్వార్టర్ బకాయిలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.
అవి కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఈసీకి లేఖ రాయడం వల్ల చెల్లించలేకపోయాం. ఆ తర్వాత ఏడు క్వార్టర్లతో కలిపి మొత్తం 8 క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. 20 నెలలుగా విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చదువు దినదినగండంగా మారిపోయింది. ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడం వల్ల విద్యార్థులను కళాశాలలు పరీక్షలు రాయనివ్వడంలేదు. ఒకవేళ ఎలాగోలా పరీక్షలు రాసినా సర్టిఫికెట్లు విడుదల చేయడం లేదు. అన్ని కాలేజీల్లో ఇదే తంతు నడుస్తోంది.
రూ.6,300 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చింది రూ.700 కోట్లే. ఇంకా రూ.5,600 కోట్ల బకాయిలున్నాయి. ఇపుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి రూ.1,200 కోట్లు ఇస్తున్నట్లు హడావిడిగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్‌ఓ) మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణమని బొత్స వ్యాఖ్యానించారు. ఇవి మూడు క్వార్టర్ల బకాయిలకు సరిపోతాయి అనుకున్నా ఇంకా ఐదు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయి. అవి ఎప్పట్లోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలి’ అని బొత్స డిమాండ్ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక రూ. 6,300 కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయని, రూ. 700 కోట్లు ఇవ్వగా ఇంకా 5,600 కోట్ల బకాయిలున్నాయని పేర్కొన్నారు. వీటికి తోడు రూ. 3,300 కోట్ల వసతి దీవెన బకాయిలు (ఈ విద్యా సంవత్సరంతో కలిపి) ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుంటే మొత్తం రూ. 8,900 కోట్లు బకాయిలు పెండింగ్ అని వివరించారు. కానీ ఈ ప్రభుత్వం రూ. 1,200 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ మాత్రమే ఇవ్వడం ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు.
రూ. 1,859 కోట్లు జమ చేశాం, ఇప్పుడు రూ. 1,200 కోట్లు: మంత్రులు
అయితే, బొత్స తర్వాత మాట్లాడిన మంత్రులు లోకేశ్, డోలా బాలవీరాంజనేయస్వామిలు గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల బకాయిలు పెట్టిందంటూ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక 2024 జూన్ నుంచి రూ. 1,859.01 కోట్లు విడుదల చేసి విద్యార్థులు లేదా కాలేజీల ఖాతాలో జమ చేశామని.. 2024–25 సంవత్సరానికి సంబందించి ఈ నెల 10న రూ. 12 వేల కోట్లు విడుదలకు ఉత్తర్వులు ఇచ్చినట్టు మంత్రి డోలా చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే మంత్రి డోలా అన్నా క్యాంటీన్లపై మాట్లాడే ప్రయత్నం చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిలువరించారు.
ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మనుగడ సాగిస్తుందని విశ్వాసం లేదు: బొత్స
మంత్రులు లోకేశ్, డోలా చెబుతున్న లెక్కలు తప్పని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. నాడు–నేడు స్కూళ్లను బాగుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా’ అని నిలదీశారు. ‘‘ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వ విద్య మనుగడ సాగిస్తుందని ప్రజలు ఎవరికీ నమ్మకం లేదు. అన్నీ దారుణమైన తప్పుడు లెక్కలు చెబుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆగిన ఒక క్వార్టర్ తప్ప మా ప్రభుత్వంలో బకాయిలు లేవు. అధికారులను పిలవండి.. సమాధానం చెప్పండి’ అని పట్టుబట్టారు. సభ నుంచి వాకౌట్ చేయడం తమకు ఫ్యాషన్ కాదు కానీ, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు చెప్పడానికి అదే మార్గమని అన్నారు. ‘ఇలాగైనా న్యాయం చేస్తారని, మీకు జ్ఞానం కలుగుతుందని, భగవంతుడు మంచి జ్ఞానం ఇస్తాడని తప్ప వాకౌట్ చేయడం మా ఫ్యాషన్ కాదు. మీరు చేస్తున్నది విద్యా ద్రోహం.
ప్రైవేటు విద్యా విధానంతో పోటీ పడుతున్నామని చెబుతున్నారు, ఈ రెండేళ్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు వచ్చాయి.. ఎన్ని ప్రభుత్వ కాలేజీలు మూసివేశారో తెలియదా? కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎందుకు పెట్టడం లేదు. ఉన్న ప్రభుత్వ కాలేజీలను మూసివేసి ప్రైవేటు కాలేజీలను ప్రోత్సహిస్తున్నార’ంటూ ప్రభుత్వ తీరుకు నిరసనగా తమ పార్టీ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మిగిలిన నాడు–నేడు పనులు ఎప్పటికి పూర్తి చేస్తారు? వైఎస్సార్‌సీపీ
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నాశనం చేస్తోందని, 80 శాతం పైగా నాడు–నేడు పనులు పూర్తయిన నిర్మాణాలను నిలిపివేసి ప్రభుత్వ బడులకు అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్‌రెడ్డి మనబడి నాడు–నేడు పనులపై మాట్లాడారు.
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సదుపాయాలు ఉండేవి కావని, 2020లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా నాడు–నేడు పథకం కింద రాష్ట్రంలోని 45,975 ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం నాడు–నేడు ఫేజ్–1లో 15,713 స్కూళ్లలో 14,133 స్కూళ్లను రూ.2,748 కోట్లతోపూర్తి చేశారని, ఫేజ్–2లో 22,311 స్కూళ్లను తీసుకున్నారన్నారు. ఈ స్కూళ్లల్లో 80 నుంచి 90 శాతం పూర్తయ్యాయని, ఫేజ్–3లో 14,845 స్కూళ్లలో మైనర్ పనులు చేపట్టారన్నారు.
గత ప్రభుత్వంలో రూ.8,524 కోట్లు ఖర్చు పెట్టి అద్భుత సంస్కరణలతో విద్యార్థులకు అవసరమైన 11 సదుపాయాలు కల్పించారన్నారు. ప్రభుత్వం మారడంతో 80 నుంచి 90 శాతం పూర్తయిన పనులను కూడా పూర్తి చేయలేదని, ఇవి ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా స్కూళ్లకు విద్యుత్ సదుపాయం, కొన్ని స్కూళ్లకు పెయింటింగ్ వేయలేదని, కోట్లు ఖర్చుపెట్టి కట్టిన స్కూళ్లకు మిగిలిన పనులు పూర్తి చేయకపోతే ఎలా? అని నిలదీశారు. ఈ రెండేళ్లల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని, దీంతో విద్యార్థులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
సభ్యులు కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రతి పేద విద్యార్థిని గ్లోబల్ సిటిజన్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ నాడు–నేడుతో విద్యా సంస్కరణలు తీసుకొచ్చారని, ఇది దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. చేపట్టిన పనుల్లో దాదాపు 90% పూర్తయ్యాయని మిగిలిన 10 శాతంలో కిటికీలు, విద్యుత్ పనులకు డబ్బులు కూడా ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ రెండేళ్లల్లో 70 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారన్నారు. ఈ ప్రశ్నకు మంత్రి లోకేశ్ జవాబిస్తూ, తమ ప్రభుత్వం పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు లెర్నింగ్ అవుట్ కమ్‌పై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


