క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు
ప్రజా దర్బార్ వినతుల్లో కూడా ఇవే ఎక్కువగా వస్తున్నాయి.. స్పౌజ్ ఆప్షన్ ఎక్కడా అమలు కావడం లేదు
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో అధికార టీడీపీ సభ్యుల స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దగా అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. కొత్తవి ఇవ్వక పోగా, ఉన్న పింఛన్లలో కూడా కోత విధిస్తున్న తీరును తప్పు పట్టిన ప్రతిపక్షంపై దారుణంగా విరుచుకు పడిన చంద్రబాబు కూటమి.. చివరకు దిగొచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో కొత్తవారికి ఒక్కరికి కూడా పింఛను మంజూరు చేయలేదని అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే శుక్రవారం శాసన సభలో వెల్లడించారు.
అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు మాట్లాడుతూ కొత్తగా పింఛన్లు ఇవ్వడంలేదని, దీనివల్ల క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుండబద్దలు కొట్టారు. త్వరగా కొత్త పింఛన్లు ఇవ్వాలని కోరారు. మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, సంప్రదాయ చర్మకారుల్లో పింఛన్ పొందుతూ మరణించిన వారి భార్యలకు వెంటనే పింఛన్ ఇవ్వాలని నవంబర్ 2024న స్పౌజ్ ఆప్షన్ ఇచ్చామని మంత్రి చెప్పగా.. ఎక్కడా ఇది అమలు కావడంలేదని సభ్యులు స్పష్టం చేశారు.
ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వడానికి వెళ్లినప్పుడు పింఛన్ రాని వారి నుంచి దాడి ఎక్కువగా ఉంటోందని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు చెప్పారు. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 2024 సెప్టెంబర్‌కు ముందు భర్తలను కోల్పోయిన మహిళలు పింఛన్ రావట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
ప్రజాదర్బార్ వినతుల్లో ఎక్కువగా ఇవే వస్తున్నాయన్నారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఆర్టీజీఎస్ ద్వారా సర్వే చేస్తే 3 లక్షల మంది గతంలో పింఛన్ తీసుకున్న వ్యక్తులు చనిపోతే వారి భార్యలకు పింఛన్ రావట్లేదని తేలిందని అన్నారు. వీరిలో 1.10 లక్షల మంది అర్హులుగా గుర్తించామని, త్వరలోనే వారికి పింఛన్లు మంజూరుకు చర్యలు చేపడతామన్నారు.

భూ సమస్యల అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పొద్దు
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ సంబంధిత అర్జీలు లక్షల్లో పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు అధికార పార్టీ సభ్యులు ధ్వజమెత్తారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పడం సరికాదని ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రజలు సమస్యలు పరిష్కారం కాక చెప్పులరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. భూ వివాదాలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
రెవెన్యూ సిబ్బంది కుమ్మకై భూములు కబ్జా చేసి వేరే వాళ్లకు మ్యూటేషన్లు చేస్తున్నారని, సర్వేల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. అర్జీల పరిష్కారానికి ఓ విధానమంటూ లేదని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో 14.42 లక్షల ఫిర్యాదులొస్తే వాటిలో 8.90 లక్షలు రెవెన్యూకు సంబంధించినవేనని మంత్రి అనగాని బదులిచ్చారు. రికార్డులు ట్యాంపరింగ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నందున సీఎం సమక్షంలో రాష్ట్రస్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. సరైన సదుపాయాలు లేక మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని, దీనికి చెక్ పెట్టేందుకు తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
ప్రశ్నోత్తరాలలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.. గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రతి 10–15 కిలోమీటర్లకు ఫిషింగ్ హార్బర్, జెట్టీ, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్, పోర్టులలో ఏదో ఒకటి ఉంటుందని, మన రాష్ట్రంలో సువిశాల సముద్ర తీరం ఉన్నప్పటికీ ఈ తరహా సౌకర్యాలు లేవన్నారు.
సామాన్యుడికి దొరికేదంతా కల్తీ ఆహారమే..
ఆహారంలో కల్తీ ఎక్కువగా ఉందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. దీనిపై మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆహార కల్తీని అడ్డుకునేందుకు తమ వద్ద తగినంత సిబ్బంది లేరని చెప్పారు. 723 మంది సిబ్బందికిగాను 144 మంది మాత్రమే ఉన్నారని, 577 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
పింఛన్లను 39 లక్షల నుంచి 66.34 లక్షలకు పెంచిన వైఎస్ జగన్
2019 ఎన్నికలకు నెలల ముందు కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నెలనెలా పింఛన్లు ఇచ్చింది 39 లక్షల మందికే. 2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెంచారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛను అందించారు. అర్హులు గ్రామ, వార్డు సచివాలయాల్లో లేదా వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు ప్రత్యేక పోర్టల్ నిరంతరం పనిచేసేది.
అర్హులకు ఎప్పటికప్పుడు పింఛన్లు మంజూరు చేశారు. దీంతో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షలకు పెరిగింది. 2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పింఛన్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ నెల (ఫిబ్రవరి) 1న జరిగిన పింఛన్ల పంపిణీలో 60,96,108 మందికే ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ 20 నెలల్లో కొత్తగా ఒక్కరికి కూడా పింఛను ఇవ్వకపోగా, 5 లక్షలకు పైగా పింఛన్లు తగ్గిపోవడం గమనార్హం.
కొత్త పింఛన్ల మంజూరు పూర్తిగా నిలిచిపోయింది. కనీసం అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆన్‌లైన్ పోర్టల్ నిలిచిపోయింది. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలోనూ కోత విధించి, రకరకాల వైద్య పరీక్షల పేరుతో వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చిన చంద్రబాబు.. దానినీ అమలు చేయకుండా ఆ వర్గాలను కూడా వంచించారు. పైపెచ్చు పింఛన్లు తగ్గింపు, కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడంపై ప్రశ్నించిన విపక్ష నేతలపై చంద్రబాబు, ఆయన కూటమి నేతలు విరుచుకు పడుతుండటం గమనార్హం.


