16 మంది విద్యార్థినులకు అస్వస్థత | 16 Students Fall Ill At The Adathitgala Tribal Welfare Girls Ashram Higher Secondary School, More Details Inside | Sakshi
Sakshi News home page

16 మంది విద్యార్థినులకు అస్వస్థత

Feb 14 2026 4:41 AM | Updated on Feb 14 2026 1:53 PM

16 students fall ill at the Adathitgala Tribal Welfare Girls Ashram Higher Secondary School

పోలవరం జిల్లా అడ్డతీగల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఘటన

14 మందికి మందులిచ్చి పంపిన వైద్యులు

ఇద్దరు విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స

పరామర్శించిన అధికారులు

పాఠశాలలో మూడు రోజులు వైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశం

అడ్డతీగల: గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతూనే ఉన్నారు. 

తాజాగా పోలవరం జిల్లా అడ్డతీగలలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఒకేసారి 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడం కలకలం రేగింది. పాఠశాల సిబ్బంది విద్యార్థినులను శుక్రవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)కు తరలించారు.

ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స
అనారోగ్యం బారిన పడిన విద్యార్థులను పరీక్షించిన వైద్యులు 14 మందికి మందులు ఇచ్చి  పాఠశాలకు పంపించారు. ఏడో తరగతి విద్యార్థినులు కాసులేటి శివపార్వతి, లకే నిత్యవేణికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం చికెన్, శుక్రవారం ఉదయం కిచిడీ, పచ్చిపులుసు తిన్నట్టు విద్యార్థినులు అధికారులకు తెలిపారు. వాంతులు కావడంతో ఇబ్బంది పడ్డారు. అయితే కొంత మంది సాధారణ జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని..  ఇద్దరికి వాంతులు కావడంతో నీరసపడ్డారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. 

పరామర్శ
సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థినులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) సరిత పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. గురువారం మధ్యాహ్నం చికెన్‌ , శుక్రవారం ఉదయం కిచిడీ, పచ్చిపులుసు తిన్నామని ఆ విద్యార్థినులు చెప్పారు. అనంతరం డీఎంహెచ్‌వో వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 

పాఠశాలలో మూçడు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రుక్మాంగదయ్య కూడా శుక్రవారం సందర్శించారు. బాధిత విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే విద్యార్థినులను ఆస్పత్రికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement