పుణ్య కార్తీకమాసం సందడి షురూ .. కార్తీక పౌర్ణమి ఎపుడు? | Karthika Masam 2025, Significance Of Kartika Month Shiva Worship, Holy Baths, And Devotional Rituals | Sakshi
Sakshi News home page

Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?

Oct 27 2025 12:19 PM | Updated on Oct 27 2025 2:30 PM

Karthika Masam 2025 check  Importance and Significance

అత్యంత పవిత్రమైన కార్తీక మాసం వచ్చిందంటే  దేశవ్యాప్తంగా ఆలయాలు శివ భక్తులతో శివనామస్మరణతో మారుమ్రోగుతాయి. అత్యంత మహిమాన్వితమైన మైన కార్తీకమాసంలో పుణ్యనదీ స్నానాలు, దీపారాధనలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో శివకేశలను అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. అందునా ఆదిదేవుడైన ఆ పరమేశ్వరుడికి కార్తీక సోమవారం అత్యంత ప్రీతికరమని భక్తులు భావిస్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతీ సోమవారం ఉదయాన్నే చన్నీటి స్నానం ఆచరించి, శివాలయాల్లో దీపారాధన చేయడం వల్ల  మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. కార్తీక పురాణం పారాయణం ద్వారా  సర్వ పాపాలు తొలగిపోతాయని భావిస్తారు.  ఈ నేపథ్యంలో  కార్తీక మాస విశిష్టత గురించి తెలుసుకుందాం.

 సోమవారాలు, పౌర్ణమి మాత్రమేనా? 
పండితుల  మాట ప్రకారం  చెప్పాలంటే.. కార్తీక మాసంలోని ప్రతీ రోజూ శుభప్రదమైనదే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.   కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి, ద్వాదశి ఉపవాస దీక్ష, పూజలు ఇంకా పవిత్ర మైనవిగా చెబుతారు .ఉదయాన్నేనదులు, కాలువలు, చెరువులు లేదా బావివద్ద, లేదా ఇంట్లోనే  చన్నీటి స్నానం చేసి తులసి కోట​ వద్ద, నువ్వులు, లేదా నేతిదీపాలు వెలిగిస్తారు. కొందరు ఉసిరి దీపాలు వెలిగిస్తారు.  భోళాశంకరుడిని భక్తితో పూజిస్తారు.  ఉపవాస దీక్ష చేపడతారు. కార్తీక పురాణం విధిగా  చదువుతారు. మాంసాహారానికి దూరంగా ఉంటై నిష్టగా శివుడ్ని  కొలుస్తారు. శివాలయాలను, ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తోచినంత దానం చేస్తారు.కార్తీక సోమవారం రోజున ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలిస్తాయట. ఇలా చేయడం ద్వారా ఏడేడు జన్మల సర్వపాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని, సంపద వృద్ధి అవుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని పెద్దలు  చెబుతారు. ఇంకా ఎంతో ప్రీతి పాత్రమైన బిల్వార్చన చేయడంతోపాటు శ్రీమహావిష్ణువుని ఆరాధించడం శుభప్రదం.

ఈ మాసమంతా ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ పరమేశ్వరుడి నామస్మరణ మారుమోగుతుంది. రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళ పూజలు, లక్షపత్రి పూజల అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, ఇలా ప్రత్యేకపూజలు, వ్రతాలతో ప్రముఖ ఆలయాలన్నీ కిటకిటలాడతాయి. వనభోజనాలు మరో విశిష్ట కార్యంగా చెప్పుకోవచ్చు.

కార్తీకమాసంలో నాలుగు  సోమవారాలు, తేదీలు 
తొలి కార్తీక సోమవారం - అక్టోబర్‌ 27
రెండవ కార్తీక సోమవారం - నవంబర్‌ 3
మూడో కార్తీక సోమవారం - నవంబర్‌ 10
నాలుగో కార్తీక సోమవారం - నవంబర్‌ 17

కార్తీక పౌర్ణమి 
ఈ సంవత్సరంలో, కార్తీక పూర్ణిమ నవంబర్ , 5వ తేదీ బుధవారం వచ్చింది.కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. మాసం అంతా దీపారాధన చేయలేని వారు  ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఏడాదికి సరిపడా నేతిలో ముంచిన 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుడినికొలిచి భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. అరటి దొప్పల్లో కార్తీక దీపాలను వెలగించి పున్నమి వెలుగుల్లో నదిలో వదిలే సన్నివేశాన్ని చూసి తరించాల్సిందే.  ఇలా కార్తీక మాస సందడి నవంబర్‌ 20 వరకు ఉంటుంది. 

నోట్‌ :  వారి వారి విశ్వాసాల ఆధారంగా ఎవరికి వారు భక్తితో ఆచరించే పుణ్యకార్యాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. అలాగే అనారోగ్యంతో ఉన్నపుడు కూడా అన్నీ ఇలాగే తు.చ తప్పకుండా ఆచరించాలనే విధి ఏమీ లేదు.  భక్తి ముఖ్యం.  నిండైన భక్తితో చేసే ఏ కార్యమైనా ఆ దేవుడి ప్రేమకు నోచుకుంటుంది. భక్తితో వెలిగించే చిన్న దీపం కూడా మెక్షానికి మార్గం  చూపిస్తుంది. కార్తీక పురాణం మనకు బోధించేది ఇదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement