breaking news
kartika pournami
-
Live Blog: కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలు..
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో నదుల్లో స్నానాలు ఆచరించి.. శివాలయాలకు వెళ్లారు. దీంతో శైవక్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. -
పుణ్య కార్తీకమాసం సందడి షురూ .. కార్తీక పౌర్ణమి ఎపుడు?
అత్యంత పవిత్రమైన కార్తీక మాసం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆలయాలు శివ భక్తులతో శివనామస్మరణతో మారుమ్రోగుతాయి. అత్యంత మహిమాన్వితమైన మైన కార్తీకమాసంలో పుణ్యనదీ స్నానాలు, దీపారాధనలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో శివకేశలను అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. అందునా ఆదిదేవుడైన ఆ పరమేశ్వరుడికి కార్తీక సోమవారం అత్యంత ప్రీతికరమని భక్తులు భావిస్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతీ సోమవారం ఉదయాన్నే చన్నీటి స్నానం ఆచరించి, శివాలయాల్లో దీపారాధన చేయడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. కార్తీక పురాణం పారాయణం ద్వారా సర్వ పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. సోమవారాలు, పౌర్ణమి మాత్రమేనా? పండితుల మాట ప్రకారం చెప్పాలంటే.. కార్తీక మాసంలోని ప్రతీ రోజూ శుభప్రదమైనదే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి, ద్వాదశి ఉపవాస దీక్ష, పూజలు ఇంకా పవిత్ర మైనవిగా చెబుతారు .ఉదయాన్నేనదులు, కాలువలు, చెరువులు లేదా బావివద్ద, లేదా ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి తులసి కోట వద్ద, నువ్వులు, లేదా నేతిదీపాలు వెలిగిస్తారు. కొందరు ఉసిరి దీపాలు వెలిగిస్తారు. భోళాశంకరుడిని భక్తితో పూజిస్తారు. ఉపవాస దీక్ష చేపడతారు. కార్తీక పురాణం విధిగా చదువుతారు. మాంసాహారానికి దూరంగా ఉంటై నిష్టగా శివుడ్ని కొలుస్తారు. శివాలయాలను, ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తోచినంత దానం చేస్తారు.కార్తీక సోమవారం రోజున ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలిస్తాయట. ఇలా చేయడం ద్వారా ఏడేడు జన్మల సర్వపాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని, సంపద వృద్ధి అవుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఇంకా ఎంతో ప్రీతి పాత్రమైన బిల్వార్చన చేయడంతోపాటు శ్రీమహావిష్ణువుని ఆరాధించడం శుభప్రదం.ఈ మాసమంతా ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ పరమేశ్వరుడి నామస్మరణ మారుమోగుతుంది. రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళ పూజలు, లక్షపత్రి పూజల అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, ఇలా ప్రత్యేకపూజలు, వ్రతాలతో ప్రముఖ ఆలయాలన్నీ కిటకిటలాడతాయి. వనభోజనాలు మరో విశిష్ట కార్యంగా చెప్పుకోవచ్చు.కార్తీకమాసంలో నాలుగు సోమవారాలు, తేదీలు తొలి కార్తీక సోమవారం - అక్టోబర్ 27రెండవ కార్తీక సోమవారం - నవంబర్ 3మూడో కార్తీక సోమవారం - నవంబర్ 10నాలుగో కార్తీక సోమవారం - నవంబర్ 17కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరంలో, కార్తీక పూర్ణిమ నవంబర్ , 5వ తేదీ బుధవారం వచ్చింది.కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. మాసం అంతా దీపారాధన చేయలేని వారు ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఏడాదికి సరిపడా నేతిలో ముంచిన 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుడినికొలిచి భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. అరటి దొప్పల్లో కార్తీక దీపాలను వెలగించి పున్నమి వెలుగుల్లో నదిలో వదిలే సన్నివేశాన్ని చూసి తరించాల్సిందే. ఇలా కార్తీక మాస సందడి నవంబర్ 20 వరకు ఉంటుంది. నోట్ : వారి వారి విశ్వాసాల ఆధారంగా ఎవరికి వారు భక్తితో ఆచరించే పుణ్యకార్యాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. అలాగే అనారోగ్యంతో ఉన్నపుడు కూడా అన్నీ ఇలాగే తు.చ తప్పకుండా ఆచరించాలనే విధి ఏమీ లేదు. భక్తి ముఖ్యం. నిండైన భక్తితో చేసే ఏ కార్యమైనా ఆ దేవుడి ప్రేమకు నోచుకుంటుంది. భక్తితో వెలిగించే చిన్న దీపం కూడా మెక్షానికి మార్గం చూపిస్తుంది. కార్తీక పురాణం మనకు బోధించేది ఇదే. -
భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం భక్తులు కార్తీక పౌర్ణమిని భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. నదుల్లో, బీచ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. కృష్ణాజిల్లా, మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్‌లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి దాదాపు లక్షన్నర మంది భక్తులు మంగినపూడిబీచ్‌కు వచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణం నేత్రపర్వంగా నిర్వహించారు. పట్టిసంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి లక్షపత్రి పూజా కార్యక్రమం నిర్వహించారు. పశి్చమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద మహిళలు కాల్వలో స్నానాలు చేసి గట్టున కార్తిక దీపాలు వెలిగించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని స్నానఘట్టాలు కిటకిటలాడాయి. నది ఒడ్డున, ఆయా ఆలయాల్లో పౌర్ణమి పూజలు చేశారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో స్నానమాచరిస్తున్న భక్తులు కార్తిక దీపాలను నదిలో విడిచిపెట్టారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నరసరావుపేట కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయం, అమరావతిలోని అమరేశ్వర ఆలయం, పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు తెల్లవారుజామునే చేరుకుని పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా సూర్యలంకలోని సముద్ర తీరానికి భక్తులు చేరుకుని పుణ్యస్నానాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బాహుదా నదీ తీరాల్లో కార్తీక దీపాలు వదిలారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో శుక్రవారం కార్తిక పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి, పొలతల మల్లేశ్వరస్వామి, రాయచోటి, అల్లాడుపల్లెలోని శ్రీ వీరభద్రస్వామి, అత్తిరాల త్రేతేశ్వరస్వామి, నందలూరు సౌమ్యనాథస్వామి, బ్రహ్మంగారిమఠం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తదితర ఆలయాల్లో పూజలు చేశారు. కార్తిక దీపాలంకరణ, జ్వాలాతోరణం, ఆకాశ దీపోత్సవం కార్యక్రమాలను కనుల పండువగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జ్వాలా తోరణ మహోత్సవం విశాఖలోని కొత్త వెంకోజీపాలెం శ్రీ గౌరి జ్ఞానలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించారు. దీపాల వరుసను వెలిగించారు. నర్సీç³ట్నం మండలంలో బలిఘట్టం శ్రీబ్రహ్మలింగేశ్వరస్వామి వెలసిన త్రిశూల పర్వతంపై శుక్రవారం రాత్రి వెలిగించిన అఖండ జ్యోతిని భక్తులు దర్శించుకున్నారు. రాంబిల్లి మండలంలోని పంచదార్ల ఉమాధర్మలింగేశ్వరస్వామి వెలసిన ఫణిగిరి చుట్టూ సుమారు 10 వేల మంది గిరి ప్రదక్షిణ చేశారు.దేదీప్యమానం.. జ్వాలా తోరణంశ్రీశైలం టెంపుల్: కార్తీకమాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో జ్వాలాతోరణం నిర్వహించారు. ఆలయం ఎదురుగా గంగాధర మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుదీర్చి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్వాలాతోరణం చుట్టూ మూడుసార్లు స్వామి అమ్మవార్ల పల్లకీని తిప్పారు.పాతాళగంగ వద్ద కృష్ణానదికి విశేష పూజలు, కృష్ణవేణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నదీమతల్లికి ఏకాదశ (పదకొండు) హారతులను సమర్పించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి అర్చకులు, వేదపండితులు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం పుష్కరిణి ప్రాంగణమంతా లక్ష దీపాలను వెలిగించారు. -
పరమ పవిత్రం.. కార్తీక మాస విశేషాలివిగో
దీపావళి సంబరాలు ముగిశాయి. ఆ వెంటనే పవిత్ర కార్తీక మాసం హడావిడి మొదలైంది. శివ కేశవుల భక్తులంతా ఏంతో ఆసక్తిగా ఎదురు చూసే సమయమిది. ఈ పుణ్య మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1న సూర్యోదయ సమయంలో అమావాస్య ఘడియలు ఉన్నందున ఆ మరుసటి రోజు నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలనేది పండితుల మాట. శివనామస్మారణలతో ఆలయాలన్నీ మార్మోగుతాయి. వేకువ ఝామునే చన్నీటి స్నానాలు, దీపారాధన, శివరాధనలో భక్తులు పరవశిస్తారు.కార్తీకమాసం అంతా ధూప దీపాలు, శివనామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. శివాలయంలోనో మరేదైనా దీపం వెలగించడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగి పోతాయని భక్తులు నమ్ముతారు. కనీసం ఇంట్లో తులసికోటముందు దీపాలు వెలిగించినా పుణ్యం దక్కుతుందని భావిస్తారు. ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలు, మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు.ప్రత్యేకంగా మహిళలు నిష్టగా పూజలు చేస్తారు. దీపారాధనలు, ఉపవాస దీక్షలు, కార్తీకపురాణ పఠనం చేస్తూ శివకేశవులిద్దరనీ ఆరాధిస్తారు. ఈ పురాణంలో శివారాధన, దీపారాధన వైశిష్ట్యం, ఫలితాల గురించి విపులంగా ఉంటుంది. అలాగే శక్తి కొలదీ దానం చేయం, సాత్విక జీవనం లాంటి విషయాలతో పాటు, ఆరిపోతున్న దీపపు ఒత్తిని సరిచేసి, దీపాన్ని వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతుంది. నిష్టగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, ఉసిరి దీపాలు, దీపదానం చేస్తే నేరుగా స్వర్గానికి వెడతారని చెబుతుంది. అలాగే తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని కార్తీక పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వీటితో పాటు నాగుల చవితి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశితోపాటు, కార్తీకపూర్ణిమ ( నవంబర్ 15వతేదీ శుక్రవారం) రోజులు అతిపవిత్రమైనవి భక్తులు భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం. అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి సమీపంలోని నదులు,చెరువులలో వదిలే దృశ్యాలు కన్నుల పండువలా ఉంటాయి. అలాగే జ్వాలాతోరణం ఉత్సవం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.అయ్యప్ప దీక్షలు, పడిపూజలుకార్తీక మాసం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం. అయ్యప్పదీక్షలు కార్తీక మాసం నుంచి,మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాల ధారణ చేస్తారు. 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో దీక్షను కొనసాగిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు, నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తారు. స్వామి చింతనలో, సాత్విక జీవనాన్ని పాటిస్తారు. తెల్లవారుజామునే చన్నీటి స్నానం భజనలు, పూజలతో గడుపుతారు. దిండ్లు పాదరక్షలు కూడా వాడకుండా నేలపై పడుకుంటారు. బ్రాహ్మచర్యాన్ని పాటిస్తూ మండలం అనగా 41రోజులు పాటు ఈ నియమాలను భక్తి, శ్రద్ధలతో ఆచరిస్తారు. సంక్రాంతిలో రోజు మకర జ్యోతి దర్శనంతో దీక్షలను విరమిస్తారు. -
అయోధ్యలో కార్తీక సందడి
అయోధ్య: కార్తీక పూర్ణిమ సందర్భంగా అయోధ్యలోని సరయూ నదీ తీరం భక్తులతో కిటకిటలాడింది. దాదాపు అయిదు లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం అయోధ్యకు పోటెత్తారు. పవిత్ర స్నానాలను సోమవారం సాయంత్రం 5:34 నుంచి మంగళవారం ఉదయం 6:42 వరకు ఆచరించారు. ఇటీవలే రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అయోధ్యలో భారీగా బలగాలు మోహరించి ఉన్నాయి. అయినప్పటికీ భారీగా భక్తులు తరలివచ్చారు. సీతారాం అనే ఉచ్ఛారణల మధ్య భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
పండు వెన్నెల..గుండె నిండుగా!
- కార్తిక పౌర్ణమిన పోటెత్తిన ఆలయాలు - శ్రీశైలంలో కనులపండువగా జ్వాలాతోరణం - శాస్త్రోక్తంగా నదీహారతులు - పాతాళగంగలో పుణ్యస్నానాలు కార్తిక సోమవారం..పౌర్ణమి పర్వదినం..దీపకాంతులతో దివి వెలుగు లీనింది. ఆనంద తాండవం చేసింది. భక్తిపారవశ్యంతో మునిగి తేలింది. జ్యోతుల ప్రజ్వలన..దీపార్చనతో ఆధ్యాత్మిక భావన కాంతులు వెదజల్లింది. పండు వెన్నెల..గుండె నిండుగా నింపుకొని భక్తజనం పరవశించింది. భగవన్నామస్మరణతో మదిమదిలో భక్తిభావం ఓలలాడింది. శ్రీశైలం: కార్తిక పౌర్ణమి రోజున జిల్లాలో ప్రముఖ క్షేత్రాలన్నీ భక్తజనంతో పోటెత్తాయి. ఇష్ట దైవాలను పూజిస్తూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలారు. శ్రీశైలంలో జ్వాలాతోరణం కనులపండువగా సాగింది. ప్రధానాలయ రాజగోపుర వీధిలో ఉన్న గంగాధర మండపం వద్ద సోమవారం రాత్రి 7గంటల తరువాత జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణ దర్శనంతో సర్వపాపాలు తొలగి..అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. జ్వాలాతోరణ కాటుకను ధరించడం వల్ల సర్వభయాలు వీడి, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని భావిస్తుంటారు. త్రిపురాసుర రాక్షస సంహారానంతరం పరమేశ్వరునిపై పడ్డ దృష్టి దోషపరిహారం కోసం విజేయుడైన ఆ ఈశ్వరుని గౌరవార్థం పార్వతీదేవి కార్తిక పౌర్ణమిరోజున జ్వాలా తోరణోత్సవాన్ని జరిపిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. కృష్ణమ్మకు నదీహారతులు.. కార్తిక పౌర్ణమి సందర్భంగా పాతాళగంగ తీరంలో కృష్ణవేణీ తల్లికి వేదమంత్రోచ్ఛారణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ ఏకాదశ (11 రకాలైన) హారతులు ఇచ్చారు. సోమవారం సాయంత్రం సంధ్యవేళలో పాతాళగంగ స్నానఘట్టాల వద్ద లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, వేదపండితులు సంకల్పం పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు విఘ్నేశ్వరపూజ, తరువాత కృష్ణవేణీ మాతకు శాస్త్రాన్ని అనుసరించి ఏక, నేత్ర, బిల్వ, నాగ, పంచ, పుష్ప, నంది, సింహ, నక్షత్ర, విష్ణు, కుంభహారతులను ఇచ్చారు. ఆ తరువాత 11 మంది అర్చకులు నదీమాతల్లికి కర్పూర నీరాజనాలను సమర్పించారు. భక్తుల పుణ్యస్నానాలు.. కార్తిక పౌర్ణమి పర్వదిన సందర్భంగా వేలాది మంది భక్తులు పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని కృష్ణమ్మకు వాయనాలు సమర్పించుకున్నారు. వేకువ జామున 3గంటల నుంచే భక్తులు పుణ్యస్నానాలాచరించుకోవడానికి మెట్లమార్గం ద్వారా పాతాళగంగకు చేరుకున్నారు. బ్రహ్మీ ముహూర్తం నుంచి సాయంత్రం వరకు దాదాపు లక్షకు పైగా భక్తులు పుణ్యనదీ స్నానాలాచరించుకున్నట్లు అధికారుల అంచనా. అనంతరం శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల దర్శించుకోవడానికి క్యూలలో బారులు తీరారు. క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో ప్రధాన రథవీధిలోని గంగాధర మండపం వరకు భక్తులు రోడ్డుపైనే క్యూ కట్టారు. సుమారు1200లకు పైగా సామూహిక అభిషేకాలను అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. సాధారణ భక్తులందరికీ వేవకుజామున 3.30గంటల నుంచి మల్లన్న సర్వదర్శనాన్ని ఏర్పాటు చేశారు. అలరించిన శివతాండవం : పుణ్యహారతిలో భాగంగా సోమవారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తిరుపతి నాటిక కళా సంస్థ వారి శివతాండవం, గిరిజా కల్యాణం నృత్యరూపకం భక్తులను ఆకట్టుకుంది. పాతాళగంగ మెట్ల వద్ద తాత్కాలిక ఫంటు ఏర్పాటు చేసి ప్రత్యేక పుష్పాలకరణ చేశారు. దీనికి ముందుగా ప్రముఖ ప్రవాచకులు డాక్టర్ హయగ్రీవాచారి కార్తిక మాస విశిష్టత పై ప్రవచనాలను వినిపించారు. -
శ్రీశైలంలో అభిషేకాలపై నియంత్రణ
· సుప్రభాత, మహామంగళహారతిసేవా టికెట్లు రద్దు శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజే కార్తీకమాసంలో ప్రముఖ పర్వదినంగా పేర్కొనే పౌర్ణమి కలిసి రావడంతో ఆదివారం భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలంలో సామూహిక అభిషేకం టికెట్లపై నియంత్రణ విధించినట్లు ఈఓ భరత్ గుప్త పేర్కొన్నారు. అలాగే గర్భాలయంలో జరిగే రూ. 5వేల ప్రత్యేక అభిషేకం టికెట్లను సోమవారం రద్దు చేసినట్లు ప్రకటించారు. వేకువజామున జరిగే స్వామి అమ్మవార్ల సుప్రభాత మహామంగళహారతిసేవా టికెట్లను కూడా నిలుపుదల చేశామన్నారు. సోమవారం వేకువజామున 3.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. అదేరోజు రాత్రి పవిత్ర పాతాళగంగ నదీ ఒడ్డున కృష్ణమ్మకు వాయనాలు సమర్పించి, ఏకాదశ(11) హారతులను ఉభయ దేవాలయాల అర్చకులు కృష్ణవేణిమాతకు సమర్పిస్తారని చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి నదీ తీరం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, రాత్రి 7గంటలకు గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణ దర్శనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
కార్తీక పౌర్ణమికి విస్తృత ఏర్పాట్లు
కృష్ణా నది వద్ద పుణ్య నదీ హారతులు - గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం - ఆలయపూజావేళల్లో మార్పులు - శనివారం రాత్రి నుంచే ప్రారంభమైన రద్దీ శ్రీశైలం: కార్తీక పౌర్ణమి, శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కలిసి వస్తుండటంతో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు శ్రీశైలాలయం ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఈఈ, డీఈ, ఆలయ ఏఈఓ, పర్యవేక్షకులతో కలిసి ఆలయ ప్రాంగణం, ఉచిత, ప్రత్యేక దర్శన క్యూలను పరిశీలించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ పాతాళగంగ స్నానఘట్టాల వద్ద సాయం సంధ్యవేళ కృష్ణవేణి నదీమతల్లికి ఏకాదశ హారతులిస్తామన్నారు. సోమవారం సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు సంకల్పం, విఘ్నేశ్వరపూజ, కృష్ణవేణి నదీమతల్లికి విశేషపూజలు, పుణ్యనదీహారతులు, కార్తీక దీపోత్సవం అనంతరం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. నదితీరంలో భక్తులు పుణ్యనదీహారతులను వీక్షించేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేశామని.. సేఫ్టీబోటుతో పాటు గజ ఈతగాళ్లను నియమించామన్నారు. అదేవిధంగా రాత్రి 7గంటల నుంచి గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణోత్సవం నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నదీ హారతులలో భాగంగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణ.. మంగళవాయిద్యాల నడుమ సోమవారం సాయంత్రం ఏకాదశ (11 రకాలైన) హారతులను నదీమ తల్లికి శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. సౌకర్యాల ప్రత్యక్ష పర్యవేక్షణ ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు ఈఓ వెల్లడించారు. ఉచిత దర్శనం, ఆర్జితసేవా క్యూలు, ప్రత్యేక దర్శనం క్యూలను వీళ్లంతా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. దర్శనం కోసం క్యూలలో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, మంచినీరు, మజ్జిగ అందిస్తామన్నారు. శనివారం రాత్రి నుంచే భక్తుల రద్దీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ పూజా వేళల్లో మార్పు చేశారు. ప్రధానంగా సోమవారం వేకువజామున 2.30గంటలకు ఆలయ ద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజలు, మహామంగళహారతి నిర్వహిస్తారు. 3.30గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి, ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
గూడెంలో కిక్కిరిసిన గోదావరి తీరం
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెంలో గోదావరి తీరం భక్తజనంతో పోటెత్తింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. బుధవారం మధ్యాహ్నం సమయానికి 70 వేలకు మందిపైగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. సత్యనారాయణ వ్రతాలు చేసుకునేందుకు జనం పోటీ పడ్డారు. ఇంకా వేల సంఖ్యలో భక్తులు క్యూలో వేచి ఉన్నారు. -
కార్తీక పౌర్ణమికి భక్తుల కిటకిట
-
కార్తీక పౌర్ణమిన భక్తులతో పోటెత్తిన ఆలయాలు


