ఆదర్శాలతో అవతరించి...ఎన్నో విజయాలు సాధించి | 80th anniversary of the United Nations special story | Sakshi
Sakshi News home page

ఆదర్శాలతో అవతరించి...ఎన్నో విజయాలు సాధించి!

Oct 24 2025 4:44 PM | Updated on Oct 24 2025 4:58 PM

80th anniversary of the United Nations special story

నేడు ఐక్యరాజ్యసమితి 80వ అవతరణ దినోత్సవం

రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ప్రపంచం తీవ్ర అశాంతిని అనుభవించింది. దీంతో శాశ్వతమైన శాంతి కోసం ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని, 1945 అక్టోబర్‌ 24న 51 దేశాలు కలిసి ‘ఐక్యరాజ్యసమితి చార్టర్‌’ (United Nations Charter) ను అమల్లోకి తెచ్చాయి. ఆ తరువాత అనేక దేశాలు ఐక్యరాజ్య సమితిలో చేరాయి. అంతర్జాతీయ శాంతిని కాపాడడం, దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను పెంపొందిస్తూ, అంతర్జాతీయ సహకారాన్ని సాధించడం, మానవ హక్కులను పరిరక్షించడం, సుస్థిరాభివృద్ధిని సాధించడం, యుద్ధాలను నివారించడం ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ) ప్రధాన లక్ష్యాలుగా చెప్పవచ్చు. 

సాధించిన విజయాలు
యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి శాంతిస్థాపన కోసం బలగాలను పంపి, వివాదాలను పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఉదాహరణకు, కొరియా, కాంగో, లెబనాన్, సూడాన్, సిరియా వంటి దేశాల్లో ఐక్యరాజ్యసమితి బలగాలు శాంతిస్థాపనకు ఎంతగానో కృషి చేశాయి. 1948లో ‘మానవ హక్కుల సార్వత్రిక  ప్రకటన‘ ను ఆమోదించడం ఈ సంస్థ గొప్ప విజయంగా చెప్పవచ్చు.  అదేవిధంగా, ‘ప్యారిస్‌ ఒప్పందం’, ‘క్యోటో ఒప్పందం’ వంటి వాతావరణ మార్పుల నియంత్రణ కోసం చేపట్టిన కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో విజయవంతమయ్యాయి. కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్, జీవవైవిధ్యం పరిరక్షణ వంటి అనేక అంశాల్లో అంతర్జాతీయ చర్చలకు ఐక్యరాజ్యసమితి ఒక వేదికగా మారింది. యూఎన్‌డీపీ, యునెస్కో, యునిసెఫ్‌ వంటి ఉపసంస్థల ద్వారా, పేదరిక నిర్మూలన, విద్యా విస్తరణ, ఆరోగ్య సంరక్షణలో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా పోలియో, మలేరియా, టీబీ వంటి వ్యాధుల నిర్మూలనలో యూఎన్‌ఓ విజయవంతమైంది.  

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందించడం ద్వారా ప్రపంచంలో సమానాభివృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం యూఎన్‌ఓ కృషి చేస్తోంది. ‘సస్టెయినబుల్‌ డెవలప్మెంట్‌ గోల్స్‌’ (ఎస్‌డీజీల) ద్వారా 2030 నాటికి ప్రపంచ అభివృద్ధికి లక్ష్యాలను నిర్ధారించింది. శరణార్థుల సమస్యలపై మరింత దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత, సమాన హక్కులు, విద్య, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం ప్రత్యేక లక్ష్యంగా గుర్తించి ఆ దిశలో కృషి చేసింది. దేశాల మధ్య అణు ఆయుధాల పరిమితులు, అణుసమర పరికరాల నియంత్రణలో ఐక్యరాజ్యసమితి కీలక పాలకురాలిగా నిలిచింది. ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా కోట్లాది ప్రజలకు ఆహారం అందిస్తోంది. 

అనేక విజయాలు సాధించిన మాట నిజమే కానీ ఇప్పుడు ఐరాసను ఎందుకు స్థాపించారో ఆ లక్ష్యాల సాధనలో విఫలమవుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో విభజనల ఫలితంగా ఈ పరిస్థితి చోటుచేసుకుంది. ముఖ్యంగా అమెరికా పెత్తనం ఎక్కువవ్వడం, నిధుల్లో ఆ దేశం కోత విధించడం వంటి కారణాలు ఐరాసను డమ్మీగా మార్చేస్తున్నాయి. ప్రపంచ శాంతిని కాపాడడంలో చిన్న, పెద్ద దేశాలు అనే తేడా లేకుండా వ్యవహరించాలి. లేకపోతే, మనం ఎదుర్కొంటున్న యుద్ధాలు మరింత తీవ్రతరమవుతాయి. ఫలితంగా ప్రపంచం అశాంతిమయం అవుతుంది.
 

– డా. బి. లావణ్య, 
రాజనీతిశాస్త్ర విభాగం, కాకతీయ యూనివర్సిటీ
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement