వెయ్యేళ్ళుగా వస్తున్న సాహిత్య ఒరవడిని మార్చి, మరో వెయ్యేళ్ళ ముందుచూపుతో రచనలు చేసి సంఘ సంస్కరణ కావించిన మహా కవి గురజాడ వేంకట అప్పారావు. బౌద్ధాన్ని గురజాడ విశ్వసించారు. బుద్ధిజం ఏనాడైతే మన భారతదేశం ఎల్లలు దాటి వెళ్ళిందో ఆనాటి నుండి మన దేశం వెనుకబడిందన్నారు. దేవుళ్ళూ దయ్యా లని పూజలు చేస్తాం.
సాటి మనిషికి సాయపడం. అదే కదా మూర్ఖత్వం. మనకు భౌతిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. వెనుకబడటానికి మూలం మూఢవిశ్వాసం. ప్రపంచ దేశాలు హేతు వాద దృక్పథంతో విజ్ఞాన శాస్త్ర ఫలాలు పొందుతుంటే మన దేశం నమ్మకాలు, ఆచారాలు అంటూ అనాలోచితంగా వెనుకబడిపోతోందని ఆయన ఉద్దేశం. రవి కాంచని చోటు కవిగాంచునన్నారు. ఆ కవి గురజాడ.
సమాజం ఆనాడు అవినీతి క్రిములమయం. మానవత్వం మంటగలిసిపోయింది. బైరాగులు, పెత్తందార్ల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. దానికి తోడు పురుషాహంకారం ప్రజ్వరిల్లింది. కన్యాశుల్కం అన్న పేరుతో పసిపిల్లలను పశువుల కన్నా హీనంగా విక్రయించడం, కాటికి కాళ్ళు చాచుకుని ఉన్న ముసలివారికి ఇచ్చి వివాహం చేయడం, వితంతువుల దౌర్భాగ్యం, దొంగ జాతకాలు, సాక్ష్యాలు, గిరీశం లాటి గిర్రలు, రామప్పంతుల లాంటి జాకాల్స్, లుబ్ధావధానులు లాంటి లోభులు, అగ్నిహోత్రావధానుల్లాంటి మూర్ఖులు సమాజానికి పట్టిన చీడపీడలు.
గురజాడ విద్యా ప్రాముఖ్యాన్ని తన రచనల ద్వారా నొక్కి చెప్పారు. విద్య నేర్వడం వలన మధురవాణి సానుల్లో సంసారిగా భాసించింది. ‘దిద్దుబాటు’ కథలో చదువుకున్న కమలిని తన భర్త గోపాలరావుని లేఖ ద్వారా మార్చుతుంది. ఆంగ్లేయులు వారి రాజ్యాన్ని సుస్థిరం చేసు కోవడం కోసం ఆంగ్ల భాషలో విద్యను ప్రవేశ పెట్టారు. స్త్రీల కోసం కోపగృహం, మైల గదులు ఉండేవి. ‘మైలగియిలా ఇంగ్లీషు వారికి లక్ష్యం లేదంటాడు’ గిరీశం.
సాంఘిక చైతన్యం, సంఘ సంస్కరణ అవసరం అని గురజాడ ఆశించారు. ‘వెనుక చూసిన కార్యమేమోయి, మంచి గతమున కొంచె మేనోయి, మందగించక ముందుకడుగేయి వెనక బడితే వెనకే నోయీ’ అన్నారు. మతం ఏదైనా బాధ లేదు, మనుషులు ఒక్కటిగా ఉండాలని ఉప దేశించారు. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలచును అంటారు గురజాడ.
అలాగే సజీవ భాష, నాల్క మీద నర్తించే భాషలో నా కలం బలంగా పలుకుతుంది అన్నారు. ‘దేశ మును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచు మన్నా’ అన్న కవి. ఇంకా ‘గుడిలో రాతి దేవుని కంటే మనతో ఉన్న మనిషిని ప్రేమించాలి’ అన్నారు. ఈ రెండు వాక్యాల సారమే గురజాడ వారి రచనల సందేశం.
– డా‘‘ జక్కు రామకృష్ణ ‘
రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, విజయనగరం


