అక్రమ్(Mahmood Akram)కు భాషలపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఏర్పడింది. ఆయన తండ్రి మోజీప్రియాన్ పదహారు భాషలు మాట్లాడుతాడు. మోజీప్రియాన్ తన ఉద్యోగం కారణంగా ఇజ్రాయెల్, స్పెయిన్‌లాంటి దేశాలకు వెళ్లాడు. అయితే ఆ దేశాలకు సంబంధించిన భాష తెలియక పోవడంతో ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలోనే వీలైనన్ని కొత్త భాషలు నేర్చుకోవాలని డిసైడైపోయాడు. ఇక అక్రమ్ విషయానికి వస్తే...
చిన్న వయసు నుంచే కొత్త భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు అక్రమ్. నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అక్రమ్‌కు తల్లిదండ్రులు ఇంగ్లీష్, తమిళ వర్ణమాల నేర్పించారు. కేవలం ఆరురోజుల్లోనే ఇంగ్లీష్, మూడు వారాల్లో తమిళ వర్ణమాల నేర్చుకున్నాడు. ఎనిమిది సంవత్సరాల వయసులో కొత్త భాషలు నేర్చుకోవాలనే తపన అక్రమ్‌లో మరింతగా పెరిగింది.
‘గతంలో వివిధ భాషలను నేర్చుకోవడానికి కొన్ని పాఠ్యపుస్తకాలు, ఓమ్నిగ్లాట్‌పై ఆధారపడాల్సి వచ్చేది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు అక్రమ్. ఓమ్మిగ్లాట్ అనేది వివిధ భాషలను రాయడం, చదవడానికి సంబంధించిన ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా. తండ్రి మార్గదర్శకత్వంలో వట్టెలుట్టు, గ్రంథ వంటి పురాతన తమిళ లిపులను నేర్చుకున్నాడు.
‘నాకు ఆరేళ్ల వయసు వచ్చేసరికి, నాన్నకు తెలిసిన భాషల కంటే నాకు తెలిసిన భాషలే ఎక్కువ!’ అని ఒకింత గర్వంగా అంటాడు అక్రమ్. ఎనిమిది సంవత్సరాల వయసులో బహుభాషలు తెలిసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. వివిధ భాషలను టైప్ చేస్తూ, చదువుతూ ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవాడు.
ఒక గంటలోపు 20 భాషలలో భారత జాతీయ గీతాన్ని రాయడం ద్వారా పది సంవత్సరాల వయసులో రెండో ప్రపంచ రికార్డ్ సాధించాడు. పన్నెండేళ్ల వయసు నాటికి ఎన్నో భాషలలో చదవడం, రాయడం నేర్చుకున్నాడు. 70 మంది భాషా నిపుణులతో పోటీ పడుతూ జర్మనీలో మూడవ ప్రపంచ రికార్డ్ సాధించాడు.
‘మూడు నిమిషాల్లోనే ఒక వాక్యాన్ని వీలైనన్ని భాషలలోకి అనువదించాల్సి వచ్చింది. నిపుణులు కూడా నా వేగాన్ని అందుకోలేక పోయారు. ఈ పోటీలో జర్మనీ యంగ్ టాలెంట్ అవార్డ్ గెలుచుకున్నాను’ అంటున్నాడు అక్రమ్. భాషలపై అక్రమ్ ఆసక్తి ఎక్కడి వరకు వెళ్లిందంటే రెగ్యులర్‌గా చదివే స్కూల్ మానేసి కొత్త భాషలు నేర్చుకునే స్కూలులో చేరాలనుకున్నాడు. అయితే అలాంటి స్కూల్ అంటూ ప్రత్యేకంగా లేదని తెలుసుకున్నాడు.
ఇక ఆన్‌లైన్ మీదే ఆధారపడాల్సి వచ్చింది. ఒక టాలెంట్ షోలో పాల్గొన్న అక్రమ్ ఏదైనా ఒక యూరోపియన్ దేశంలో పాఠశాల విద్యను పూర్తి చేసే అవకాశాన్ని పొందాడు. అలా వియాన్నాలోని ‘డాంటే ఇంటర్నేషనల్ స్కూల్’లో చేరాడు. ఈ స్కూలులో చేరడం ద్వారా అక్రమ్‌కు స్థానిక భాషలు నేర్చుకోవడానికి, ఆ భాషలలోనే అక్కడి వారితో సంభాషించడానికి అవకాశం వచ్చింది. తరగతి గదిలో వివిధ భాషలు మాట్లాడే 39 మంది క్లాస్‌మేట్స్ ద్వారా అదనంగా ఎన్నో భాషలు నేర్చుకున్నాడు అక్రమ్. అలా మొత్తం 400 భాషల్లో మాట్లాడగలడు, రాయగలడు.
ఎంతో సాధన కావాలి
మొదట్లో నేను చాలా భాషలకి సంబంధించి ‘హలో’ ‘గుడ్ మార్నింగ్’లాంటి కొన్ని మాటలకే పరిమితమయ్యాను. ఆ తరువాత మాత్రం ఆ భాషలను లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఒక భాష రాయడం, చదవడం సులభమే కానీ మాండలికం, ఉచ్చారణ అనేవి కష్టం. దీనికి ఎంతో సాధన కావాలి. నేర్చుకున్న భాషలు మరచిపోకుండా ఉండడానికి సోషల్ మీడియా నాకు ఉపయోగపడుతోంది. నేను కొన్నిసార్లు నా సోషల్ మీడియా భాషను రష్యన్‌లోకి మార్చుకుంటాను. డానిష్‌లో యూట్యూబ్ షార్ట్స్‌ను, అరబిక్‌లో ఫేస్‌బుక్ వీడియోలు చూస్తాను.
తమిళం నాకు ఇష్టమైన భాష. అది నా మాతృభాష. జపనీస్‌ను సులభంగా నేర్చుకున్నాను. ఎందుకంటే దాని వ్యాకరణం, ఉచ్ఛారణ తమిళాన్ని పోలి ఉంటుంది. చెక్, ఫిన్నిష్, వియత్నామీస్ వంటి భాషలలో ప్రావీణ్యం సంపాదించడం కష్టం. కొత్త భాషలు నేర్చుకోవడం అనేది నా ఆసక్తి. భాష నా ప్రతిభ. యానిమేషన్ అంటే కూడా ఇష్టం అని చెబుతున్నాడు అక్రమ్.
(చదవండి: Gollabhama Sarees: గ్లోబల్ స్టార్ గొల్లభామ..! తెలంగాణ సంప్రదాయ ఫ్యాషన్‌కు చిరునామా)


