
దేశీయ భాషల్లో మొబైల్ గేమ్స్
దేశంలో 55 కోట్ల గేమర్స్
తెలుగు సహా స్థానిక భాషల్లో ఆడేస్తున్నారు
2024లో వీడియో గేమ్స్‌కి పెరిగిన క్రేజ్
భారత్‌లో 5,729 కోట్ల గంటల కాలక్షేపం
ప్రపంచ వ్యాప్తంగా డెవలపర్లకు లాభాలు
మొత్తం రూ.6,95,360 కోట్ల ఆదాయం
భారీగా ఖర్చు చేస్తున్న యాపిల్ యూజర్స్
వీడియో గేమ్స్... పిల్లల దగ్గరి నుంచీ యువత వరకూ వీటి క్రేజ్ చెప్పనక్కర్లేదు. ఆట మొదలుపెట్టారంటే సమయమే తెలీదు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది గేమర్స్ ఏకంగా 39,000 కోట్ల గంటలు మొబైల్‌లో గడిపారంటే అతిశయోక్తి కాదు. మొబైల్ గేమ్స్ క్రేజ్ అంతలా విస్తరించింది. 2024లో ప్రపంచ వ్యాప్తంగా సగటున నిమిషానికి 94,000 డౌన్ లోడ్స్ జరిగాయి. మనదేశం కూడా ఇందుకు ఏమీ తీసిపోలేదు. గత ఏడాది కొత్తగా 821 కోట్ల డౌన్ లోడ్స్ అయ్యాయి. 5,729 కోట్ల గంటలపాటు మొబైల్ గేమ్స్ ఆడారు. యూజర్ల సంఖ్యను పెంచుకోవడానికి డెవలపర్లు హిందీ సహా తెలుగు, తమిళం వంటి స్థానిక భాషల్లో గేమ్స్‌ను పరిచయం చేస్తుండడం జోష్‌ను పెంచుతోంది.
భారీగా యాడ్స్
మొబైల్ గేమ్స్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 2024లో 5,04,576 కోట్ల యాడ్స్ యూజర్ల స్క్రీన్ పై దర్శనమిచ్చాయి. దీనిని బట్టి.. ఈ గేమ్స్‌కి ఎంత ఆదరణ ఉందో, వివిధ బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా 2023తో పోలిస్తే 2024లో గేమర్స్ 12% అధికంగా 3.5 లక్షల కోట్ల సెషన్స్ పూర్తి చేశారు. గేమ్స్‌లో మరిన్ని ఫీచర్లు, దశలు, ప్రీమియం కంటెంట్ కోసం యూజర్లు వెచ్చించిన (ఇన్ యాప్ పర్చేజ్) మొత్తం రూ.6,95,360 కోట్లు. ఇలా డెవలపర్లు అందుకున్న ఆదాయం 2024లో 3.8% పెరిగింది.

స్థానిక భాషల్లో 70%
భారత్‌లో సుమారు 55 కోట్ల మంది గేమింగ్ యూజర్లు ఉన్నారు. వీరిలో 70% మంది స్థానిక భాషల్లో గేమ్స్‌ను ఇష్టపడుతున్నారు. కంపెనీలు ఇందుకు తగ్గట్టుగా ప్రాంతీయ భాషల్లో గేమ్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. 2024లో భారత్‌లో టాప్–10లో స్థానం సంపాదించిన మొబైల్ గేమ్స్‌లో చాలావరకు హిందీ సహా దేశీయ భాషల్లో ఆడుకునే సౌలభ్యం ఉంది.
⇒ ‘లుడో కింగ్’ గేమ్‌ని ప్రస్తుతం తెలుగు, హిందీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, తమిళం, మలయాళంలో ఆడుకునే అవకాశం ఉంది. ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ బెంగాలీ, హిందీ, ఉర్దూలో ఆడేయొచ్చు. క్యాండీ క్రష్ సాగా బెంగాలీ, హిందీ, ఉర్దూలోనూ అందుబాటులో ఉంది.
⇒ తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, ఒడియా, బెంగాలీ వంటి స్థానిక భాషల్లో గేమ్స్‌ను తేవడం వల్ల యూజర్లు కొనసాగడంతోపాటు, సంతృప్తి చెందుతారన్నది కంపెనీల మాట. దేశీయంగా విజయవంతం కావాలంటే ఈ విధానం తప్పదని చెబుతున్నాయి.
సింహభాగం యాపిల్ యూజర్స్
మొత్తం డౌన్ లోడ్స్‌లో ఆండ్రాయిడ్ ఫోన్స్ ద్వారా 4,120 కోట్లు, మిగిలినవి యాపిల్ ఫోన్స్ ద్వారా జరిగాయి. అయితే ఇన్ యాప్ పర్చేజ్ ద్వారా యాపిల్ యూజర్లు అత్యధికంగా రూ.4,51,136 కోట్లు ఖర్చు చేయడం విశేషం. డౌన్ లోడ్స్, డెవలపర్లకు ఆదాయం పరంగా యూఎస్‌ఏ టాప్‌లో ఉంది. రూ.8,480 కోట్లకుపైగా ఆదాయం ఆర్జించిన యాప్స్ పదేళ్ల క్రితం 2 ఉంటే.. గత ఏడాది వీటి సంఖ్య 11కు దూసుకెళ్లింది. ఇక భారత్‌లో డౌన్ లోడ్స్‌లో సిమ్యులేషన్ , ఆర్కేడ్, పజిల్, టేబుల్ టాప్, యాక్షన్ విభాగాలు టాప్–5లో నిలిచాయి. డౌన్ లోడ్స్‌లో ఇండియన్ వెహికల్స్ సిమ్యులేటర్ 3డీ, ఇన్ యాప్ పర్చేజ్‌లో ఫ్రీ ఫైర్ గేమ్ తొలి స్థానంలో ఉన్నాయి.
గేమింగ్ హైలైట్స్
⇒ భారత్‌లో సులభంగా ఆడగలిగే వీడియో గేమ్స్ (హైపర్ క్యాజువల్) 2,000 కోట్ల డౌన్ లోడ్స్ నమోదయ్యాయి.
⇒ ప్రతి సెకనుకు 1,60,000 యాడ్స్ ప్రత్యక్షమయ్యాయి. గేమ్స్‌కు వెచ్చించిన సమయం గత ఏడాది 7.9% పెరిగింది.
⇒ 2020లో కరోనా మహమ్మారి కాలంలో ఏకంగా 5,760 కోట్ల డౌన్ లోడ్స్ జరిగాయి.
⇒ డెవలపర్లు అత్యధికంగా 2021లో రూ.7,41,152 కోట్లు ఆర్జించారు.