సాక్షి, కర్నూలు/హైదరాబాద్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో మృతుల సంఖ్యపై ఇప్పటిదాకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకైతే 22 మంది మరణించారని అధికారులు అంటున్నారు. ఇప్పటిదాకా 11 మంది మృతదేహాలను వెలికి తీశామని, మరికొంతమందిని గుర్తించాల్సి ఉందని కలెక్టర్ సిరి చెబుతున్నారు. దీంతో తమ వారి ఆచూకీ తెలియక ప్రయాణికుల బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిందైంది. ప్రమాద తీవ్రతను బట్టి ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.

హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే..
కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059 అలాగే.. ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075, ఇక.. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు 9494609814, 9052951010గా కర్నూలు కలెక్టర్ డా. సిరి తెలిపారు. బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చని సూచించారు.

మృత్యు ప్రయాణం ఇలా..
వి కావేరి ట్రావెల్స్ మెయిన్ ఆఫీస్ పటాన్ చెరులో ఉంది. కూకట్ పల్లిలో మరో కార్యాలయం ఉంది. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు(డీడీ01ఎన్9490).. రాత్రి 9.30గం. పటాన్‌చెరు నుంచి ప్రారంభమైంది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరు వైపు బయల్దేరింది.
.. అర్ధరాత్రి 3గం.30ని. ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టింది. బైక్‌ను ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ వద్ద పైప్ పగిలి మంటలు చెలరేగి ఈ ఘోరం సంభవించింది. మంటలు చెలరేగాక.. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోలేదు. బస్సు ఆగడంతో కొందరికి మెలుకువ వచ్చి లేచి చూశారు.
మంటలు చెలరేగడంతో.. బస్సు డ్రైవర్, సహాయకుడు, కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్లు బద్దలు కొట్టుకుని బయటపడ్డారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నవీన్ తన కారులో గాయపడ్డ ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. హైమారెడ్డి అనే మరో మహిళ మంటలు చెలరేగడాన్ని చూసి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో అందరూ వీడియోలు తీస్తున్నారని వాపోతూ ఆమె తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. (Kurnool Travels Bus Fire Accident)

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని.. బైక్‌ను ఢీ కొట్టినప్పుడే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘మంటలు అంటుకోగానే అద్దాలు బద్దలు కొట్టి బయటకు దూకేశాం. అప్పటికే మా సోదరుడి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ వాళ్ల రక్షణ వాళ్లు చూసుకున్నారు. ప్రమాణికులను పట్టించుకోలేదు’’ అని గాయపడ్డ ఓ ప్యాసింజర్ వాపోయారు. అలాగే.. ఘటన జరిగిన తర్వాత వాళ్ల రక్షణ చూసుకున్నారే తప్ప.. తమను అప్రమత్తం చేయలేదని, అది జరిగి ఉంటే అంతా క్షేమంగా బయటపడేవాళ్లని చికిత్స పొందుతున్న మరో ప్రయాణికుడు తెలిపాడు.
మృతుల సంఖ్య పెరగొచ్చు: డీఐజీ
ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ఘటన నుంచి 23 మంది బయటపడ్డారు. ప్రమాద తీవ్రతను డ్రైవర్ అంచనా వేయలేదు. ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికి తీశాం. చికిత్స పొందుతున్నవాళ్ల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరగొచ్చు అని డీఐజీ కోయప్రవీణ్ అన్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన బైక్ సైతం బస్సు కిందే కాలిన స్థితిలో ఉండిపోగా.. బైకర్ మృతదేహం రోడ్డు పక్కనే పడి ఉంది. అతని పేరు శివ శంకర్‌గా తెలుస్తోంది. కొడుకు మృతితో యశోదమ్మ బోరున విలపిస్తూ కనిపించింది.

ట్రావెల్స్ నిర్లక్ష్యం
ఘటన నేపథ్యంలో.. కూకట్‌పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది.
బస్సు నిర్మాణంలో ప్రికాషన్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేలా బస్సులో ఎలాంటి ఏర్పాట్లు లేవని డీఐజీ చెబుతున్నారు. అదే సమయంలో.. ట్రావెల్స్ ఓనర్ పేరు వేమూరి వినోద్ అని, బస్సు ఫిట్‌నెస్ వాలిడిటీ ఈ ఏడాది మార్చితోనే(31-03-2025) ముగిసింది. అలాగే.. ఇన్సూరెన్స్ వాలిడిటీ, పొల్యూషన్ కాల పరిమితి కిందటి ఏడాది ఏప్రిల్‌తోనే ముగిశాయి.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ప్రయాణికుల జాబితాలో.. 39 మంది, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలామంది హైదరాబాద్‌కు చెందిన వాళ్లే ఉన్నారు. బస్సులో ఎక్కువగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఉన్నట్లు లిస్ట్‌ను బట్టి అర్థమవుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డవాళ్లు.. రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం.. మరికొందరు.





