ఆన్‌లైన్‌ దర్బార్‌ భక్తి! | New startups are emerging in spiritual services | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ దర్బార్‌ భక్తి!

Oct 24 2025 6:07 AM | Updated on Oct 24 2025 6:07 AM

New startups are emerging in spiritual services

ఆధ్యాత్మిక సేవల్లో తరిస్తున్న నయా స్టార్టప్‌లు

ఇంటి నుంచే వర్చువల్‌ పూజలు, దైవ దర్శనాలు 

ఏడాదిలో 300 శాతం పెరిగిన ‘భక్త యూజర్లు’

ఆధ్యాత్మిక సందేహాలు, సంప్రదింపులు; వేద పండితుల మార్గదర్శకత్వం, పూజా సామగ్రి కొనుగోలు వంటి అవసరాల కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్న భక్త వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆధ్యాత్మిక స్టార్టప్‌లకు ఆదరణ పెరిగింది. మతపరమైన ఆచార వ్యవహారాలు, వాటి పాటింపు విధానాలను ప్రామాణికంగా తెలియజెప్పేందుకు ఈ ఆధ్యాత్మిక ఆన్‌లైన్‌ వేదికలు వేద పారంగతులను నియమించుకుంటున్నాయి.    
 – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

గత ఏడాదితో పోలిస్తే తమ వినియోగదారుల్లో 2.5 రెట్లు, డిజిటల్‌ సంప్రదింపుల్లో 3 రెట్ల పెరుగుదల కనిపించిందని ఆధ్యాత్మిక ఆన్‌లైన్‌ సంస్థ ‘ఆస్ట్రోయోగి’వెల్లడించింది. సుదీర్ఘ ప్రయాణాలు, పొడవాటి క్యూలు లేని ‘డిజిటల్‌ యాక్సెస్‌’ సౌలభ్యతే ఈ పెరుగుదలకు కారణం. ప్రధానంగా యువత, ఎన్నారైలు ఈ సంస్థలను సంప్రదిస్తుండటం, పండుగ సీజన్‌లో అవి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించటం కూడా వాటి అభివృద్ధికి తోడ్పడుతోంది.  

వేలాదిమంది పండితులు 
‘ఆస్ట్రోయోగి’తన నెట్‌వర్క్‌లో.. జ్యోతిషు్కలు, టారో కార్డ్‌ రీడర్‌లు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మిక కోచ్‌లు సహా కనీసం 10,000 మంది నిపుణులతో అనుసంధానమై ఉంది. వినియోగదారులకు ఆన్‌లైన్‌లో ఆధ్యాత్మిక సేవలను ఒక్క ‘క్లిక్కు’తో అందించటానికి ఈ పండితుల అనుభవం తమకెంతగానో ఉపయోగపడుతోందని ఆస్ట్రోయోగి నిర్వాహకులు అంటున్నారు.  

ఆధ్యాత్మిక కౌన్సెలింగ్‌ 
మరొక సంస్థ ‘ఆస్ట్రోసేజ్‌ ఏఐ’కూడా భక్తి విశ్వాసాల ఆధారిత సేవల్ని నెట్‌ యూజర్‌లకు అందిస్తోంది. పండుగలు, ఇతర సమయాలలో నెటిజన్‌ల సందేహాలకు ఈ సంస్థ తన కౌన్సెలర్‌ల ద్వారా సమాధానాలు ఇప్పిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే తమను సంపద్రించేవారి సంఖ్య 300 శాతం పెరిగిందని ఆస్ట్రోసేజ్‌ నిర్వాహకులు చెబుతున్నారు.  

లక్షల్లో భక్త యూజర్లు 
2025లో ప్రారంభమైన ‘ఆస్ట్రోష్యూర్‌ ఏఐ’కు నెలవారీ వినియోగదారులు 3 లక్షలకు పైగా ఉన్నారు. రోజువారీగా కనీసం 15 వేల మంది సంప్రదింపులు జరుపుతున్నారు. ఆస్ట్రోష్యూర్‌ ఏఐ యాప్‌ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓస్‌లు కలిపి 10 లక్షల డౌన్‌లోడ్‌లకు చేరుకుంది. ఒకప్పుడు లక్షా 50 వేలుగా ఉన్న యూజర్ల సంఖ్య దాదాపు 8 లక్షలకు పెరిగిందట.  

పూజా సామగ్రి కిట్‌లు 
వినియోగదారులు ప్రధానంగా తమ భవిష్యత్తు, అదృష్ట సంఖ్యలు, పంచాంగం, తిథులు, నక్షత్రాలు, శుభ సమయాలు, రాహు కాలాలు వంటి వాటి కోసం ‘ఆస్ట్రో’సైట్‌లను బ్రౌజ్‌ చేస్తున్నారు. ఇందుకోసం కొందరు డబ్బు చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ కూడా తీసుకుంటున్నారు. కేవలం సంప్రదింపుల కోసమే కాకుండా, ముందుగా ప్యాక్‌ చేసి ఉంచిన రెడీ మేడ్‌ పూజా సామగ్రి కిట్‌ కోసం యూజర్‌లు వీటి వైపు వస్తున్నారు. సేవలను, వస్తువులను పొందుతున్నారు. గత ఏడాది ఈ వేదికల్లో పూజా సామగ్రి కిట్‌లు, రత్నాల కోనుగోళ్లు 25 నుంచి 30 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.  

సదా ‘ఆధ్యాత్మిక’సేవలో..  
ఆస్ట్రోయోగి : ఆన్‌లైన్‌ సంప్రదింపులు, జాతకాలు, డిజిటల్‌ ఆధ్యాత్మిక సేవలను అందించే భారతీయ ఆన్‌లైన్‌ జ్యోతిష్య శాస్త్ర వేదిక. 

ఆస్ట్రోసేజ్‌ ఏఐ : వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక సలహాలు, జాతక చక్రాలు, జ్యోతిష్యం, ఆన్‌లైన్‌ సంప్రదింపులు; పూజా విధానం, వివాహ ఆచారాలు, వివరణల వెబ్‌సైట్‌. 

ఆస్ట్రోటాక్‌ : జ్యోతిష్కులు, పండితులు, పురోహితులతో లైవ్‌ చాట్‌లు; ఫోన్‌ సంప్రదింపులు, జ్యోతిష్య శాస్త్ర సేవలతో అనుసంధానం. 

దేవ్‌ధామ్‌: వర్చువల్‌ ఆలయ దర్శనాలు. ఆన్‌లైన్‌ పూజలు, డిజిటల్‌ విరాళాల భారతీయ ఆధ్యాత్మిక సాంకేతిక వేదిక. 

వామా: ఇంటి నుంచే పూజలు, దర్శనాలు, మతాచారాల విషయమై సంప్రదింపులకు ఆన్‌లైన్‌ యాక్సెస్‌ను అందించే ఆధ్యాత్మిక సేవల కేంద్రం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement