సాక్షి, తిరుపతి: కూటమి వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్‌పై కూటమి దాడి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు వైఖరితోనే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని.. కూటమి నేతలు తప్పు చేసి వైఎస్సార్‌సీపీపై బురదజల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్నికల ముందు, తరువాత తిరుమల చూట్టు రాజకీయాలు చేస్తున్నారు. లడ్డూ, పరకామణి, పట్టు వస్త్రాలు అవినీతి అంటూ జగన్‌ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయంగా దెబ్బ తీయడానికి స్వామివారి కూటమి నేతలు వాడుకుంటున్నారు.
..పదిరోజుల వైకుంఠ ఏకాదశి వద్దని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అదే కొనసాగిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు దీనికి కారణం వైఎస్సార్‌సీపీనే.. పదిరోజుల దర్శనం తప్పు అంటూ ప్రచారం చేశారు. లడ్డూ కేసులో ఇప్పటి వరకు రాజకీయపరమైన అరెస్టు ఒక్కటి జరగలేదు. కాని సుబ్బారెడ్డి చేశాడని అసత్య ప్రచారం చేశారు.
..సింహాచలం ఆలయంలో దొంగతనం చేస్తే స్టేషను బెయిల్ ఇచ్చి వదిలేశారు. 2015 నుంచి 2025 వరకు పట్టు వస్త్రాల స్కాం జరిగితే.. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాడు. రోజుకో మాట మాట్లాడటంలో పవన్ దిట్టా. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడూ జరగని అపచారాలు తిరుమలలో జరిగాయి’’ అని భూమన ధ్వజమెత్తారు.


