
డిజిటల్ చెల్లింపుల్లో సింహభాగం యూపీఐదే
50 కోట్లకుపైగా యూపీఐ వినియోగదారులు
తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో లావాదేవీలు
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ రూపురేఖలను యూపీఐ అని పిలిచే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ మార్చేసింది. జాతి, మతం, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా యూపీఐ విస్తరించింది. 2022 జనవరి నాటికి యునిక్ యూపీఐ వినియోగదారుల సంఖ్య కేవలం 26.9 కోట్లు. ఈ ఆగస్టు నాటికి ఈ సంఖ్య 50.4 కోట్లకి చేరింది. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం.. 2022–23లో రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 74 శాతం కాగా.. 2024–25 నాటికి ఏకంగా 84 శాతానికి పెరిగింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
దేశంలో సెప్టెంబరులో 1963 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.24.90 లక్షల కోట్లు. 2024 సెప్టెంబరులో లావాదేవీల సంఖ్య 1504 కోట్లు కాగా, వాటి విలువ రూ.20.63 లక్షల కోట్లు. యూపీఐ లావాదేవీలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐదే అగ్రస్థానం. రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ప్రతి ఐదింటిలో నాలుగు యూపీఐవేనంటే అది ప్రజలకు ఎంత సౌకర్యవంతంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
‘కానీ’–అమెజాన్‌పే సర్వే
మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ ‘కానీ’, అమెజాన్ పే కలిసి సంయుక్తంగా దేశంలోని 120 పట్టణాల్లో.. డిజిటల్ చెల్లింపులపై అధ్యయనం చేశాయి. మొత్తం 6,000 మందిని సర్వే చేశారు. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు సహా చిన్నచిన్న పట్టణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆన్‌లైన్ కొనుగోళ్లలో యూపీఐది సింహభాగం కాగా.. ఆఫ్‌లైన్‌లో మాత్రం ఇప్పటికీ నగదుదే అగ్రస్థానం.
రికార్డు స్థాయిలో..
2022–23 నుంచి 2024–25 మధ్య రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు జరిగాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో.. రాష్ట్ర జీడీపీలో సుమారు 8 శాతం విలువైన యూపీఐ లావాదేవీలు జరగడం విశేషం. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. టాప్ రాష్ట్రాలు..
‘ఆన్‌లైన్’ బాటలో...
మొత్తం సర్వే చేసిన వారిలో 90% మంది.. ఆన్‌లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులనే ఎంచుకుంటున్నట్టు తెలిపారు. ఆఫ్‌లైన్ కొనుగోళ్లలోనూ (దుకాణాల వంటి చోట్లకు వెళ్లి చేసేవాటిలోనూ).. 56% మంది డిజిటల్ చెల్లింపులే చేశారట. కరెంటు, గ్యాస్ బిల్లు వంటి (యుటిలిటీ) ముఖ్యమైన చెల్లింపులు కూడా 87% మంది డిజిటల్‌లోనే చేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్ వాలెట్ల వాడకమూ పెరిగింది. యుటిలిటీ, సబ్‌స్క్రిప్షన్ల కోసం డిజిటల్ వాలెట్లు వాడుతున్నట్టు 13% మంది చెప్పారు.
మహిళలూ ముందంజలో..
పురుషులతో పోలిస్తే స్త్రీలే ఎక్కువగా డిజిటల్ చెల్లింపులకు ఇష్టపడుతుండటం గమనార్హం. ఆన్‌లైన్ కొనుగోళ్ల విషయంలో 88 శాతం మగవాళ్లు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నామంటే.. ఇలా చేస్తామన్న మహిళలు 89 శాతం కావడం విశేషం. మెట్రో నగరాల్లో ఇలాంటి మహిళల శాతం 63 శాతం కాగా, చిన్న పట్టణాల్లో ఇది 47 శాతం.
ఎందుకు ‘డిజిటల్’ వైపు?
ప్రజలు డిజిటల్ చెల్లింపులు ఇష్టపడటానికి రెండు ప్రధాన కారణాలు చెప్పారు. అన్ని చోట్లా వాటిని అంగీకరిస్తున్నందున చేస్తున్నామని 57 శాతం, సౌకర్యవంతంగా ఉండటం వల్ల వాటిని వదల్లేకపోతున్నామని 61% మంది చెప్పారు.
టాప్ –4 విభాగాలు
ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం.. 2022–23 నుంచి 2024–25 మధ్య యూపీఐ లావాదేవీలు అత్యధికంగా జరిగిన టాప్ విభాగాలు..
⇒ కిరాణా, సూపర్ మార్కెట్లు
⇒ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లు
⇒ ఈటింగ్ ప్లేసెస్, రెస్టారెంట్లు
⇒ టెలికమ్యూనికేషన్ సేవలు