- అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ
- గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి అనేక రంగాల్లో విశేషగుర్తింపు పొందిన దిగ్గజాలను ఆహ్వానించడం జరిగిందన్నారు.
‘లక్ష్యాలు, ఆలోచనలను ఈ సమ్మిట్‌లో వివరించబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారి సూచనల మేరకు ఈ రోజు సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, గడువులోగా పూర్తిస్ధాయి ఏర్పాట్లకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ ప్రగతి దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తోంది .తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ది సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. సమ్మిట్‌పై ఇండిగో విమానాల రద్దు ప్రభావం ఏమాత్రం చూపదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారు దీనిపై ఎప్పటికప్పుడు వచ్చే అతిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిశీస్తున్నాం’ అని పేర్కొన్నారు.




