సాక్షి హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో రద్దీ భారీగా పెరిగింది. ఆదాయం, కుల ధృవీకరణ సర్టిఫికేట్‌ల కోసం అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది మెుత్తం మీద గత రెండు వారాల్లో మీసేవ అత్యధిక దరఖాస్తులను స్వీకరించినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు మీసేవ మొత్తం 4,19,219 దరఖాస్తులు స్వీకరించింది. వీటిలో 1,67,779 ఆదాయ సర్టిఫికేట్‌లు కాగా 1,61,601 కుల సర్టిఫికేట్‌లు వీటితో పాటు 2,185 ఆదాయ రీయిష్యూ, 87,654 కుల రీయిష్యూ దరఖాస్తులు ఉన్నాయి. భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ సేవల్లో పెద్దగా అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. అయితే కొన్ని కేంద్రాల్లో స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తగా టెక్నికల్ టీములు వెంటనే వాటిని పరిష్కరించాయని పేర్కొన్నారు.
రోజువారీ గణాంకాలు ఎన్నికల రద్దీని స్పష్టంగా ప్రతిబింబించాయి. ఆదాయ సర్టిఫికేట్ దరఖాస్తులు పీక్ రోజుల్లో 19 వేలకు చేరుకోగా, కుల సర్టిఫికేట్ దరఖాస్తులు 28 వేల మార్క్‌ను దాటాయి. రీయిష్యూ దరఖాస్తులు కూడా అధికంగా నమోదైనట్టు డేటా సూచిస్తోంది.
మీ సేవ సేవలను నిలకడగా కొనసాగించేందుకు నిరంతర పర్యవేక్షణ, వేగవంతమైన సాంకేతిక స్పందనను వ్యవస్థలు కొనసాగించాయని అధికారులు తెలిపారు. ఫీల్డ్ నుంచి వచ్చిన సమస్యలకు వెంటనే స్పందించి సేవలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని వారు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రభావం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ప్రజలకు పారదర్శకంగా, సమయపాలనతో, సౌహార్దంగా సేవలు అందించే సామర్థ్యం మీసేవకు ఉందని సంబంధిత విభాగం ప్రజలకు భరోసా ఇచ్చింది.


