
మానసిక అనారోగ్యాన్ని బయట పెట్టేందుకు జంకుతున్న భారతీయులు
వర్క్–లైఫ్ బ్యాలెన్స్ సమస్యలు భారతీయుల్లోనే అధికం!
అయినా సెలవుకు మానసిక ఆరోగ్య కారణాలను వెల్లడించడానికి ఇష్టపడని ఉద్యోగులు..
ఇటీవల 80 పరిశ్రమలలోని 19,650 మంది వృత్తి నిపుణులపై నౌక్రీ పల్స్ సర్వే
సాక్షి, హైదరాబాద్: భారతీయుల్లో వర్క్–లైఫ్ బ్యాలెన్స్ సమస్యలు అధికంగా బయటపడుతున్నాయి. దాదాపు 75 శాతం మంది వృత్తి నిపుణులు మానసిక ఆరోగ్యం సరిచేసుకునే విషయంలో వెనుకబడుతున్నారు. ఇటీవల నిర్వహించిన నౌక్రీ పల్స్ 2025 సర్వేలో పాల్గొన్నవారిలో నలుగురు ఇండియన్లలో ముగ్గురు సెలవుకు మానసిక ఆరోగ్య కారణాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదని తేలింది. పనిలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో... పేలవమైన పని–జీవిత సమతుల్యతలో 39%తో భారత్ వృత్తి నిపుణులు ముందువరసల్లో నిలుస్తున్నారు.
దాదాపు 80 పరిశ్రమలలో 19,650 మంది వృత్తి నిపుణులపై ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో... 30 శాతం కంటే ఎక్కువ మంది నిపుణులు మానసిక ఆరోగ్య కారణాల వల్ల సెలవు తీసుకోవడానికి సంసిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే డిజైన్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఇది అధికంగానే ఉన్నట్టుగా తెలిసింది. ఈ విషయంలో ఫ్రెషర్లు, కెరీర్ ప్రారంభంలో ఉన్న నిపుణులు (0–5 సంవత్సరాల పని అనుభవం) ఎక్కువగా సంకోచిస్తారు.
ఉద్యోగులు వెనుకాడడానికి కారణాలు...
» మానసిక ఆరోగ్యం సరిగాలేని కారణంగా సెలవు తీసుకుంటే తమను అసమర్థులుగా చూస్తారని 31 శాతం మంది ఉద్యోగులు భయపడుతున్నారు
» తమ విషయంలో సహోద్యోగులు ఏమని ఆలోచిస్తారోననే ఆందోళనతో 27% మంది ఉన్నారు
» సెలవు తీసుకునేందుకు తాము సాకులు వెతుకుతున్నామని 21% మంది ఆందోళన చెందుతున్నారు
» ఇది కెరీర్ వృద్ధిని ప్రభావితం చేస్తుందని 21% మంది నమ్ముతున్నారు

వాస్తవాలకు బదులు సెలవుకు చెబుతున్న కారణాలు...
» తమ మానసిక ఆందోళనలతో తలెత్తిన పరిస్థితిని 45% జనరల్ సిక్ లీవ్‌గా పరిగణన
» 28% ఇతర కారణాలు
» 19% సెలవులకు దూరం
» 9% ఇతర కారణాలు చూపుతున్నారు...