
దేశంలో రూ. 70 వేల కోట్లకు చేరిన కోచింగ్ సెంటర్ల వ్యాపారం
2028 నాటికి రూ. 1.38 లక్షల కోట్లకు పెరిగే అవకాశం
ఇన్పినియం మార్కెట్ రీసెర్చ్ తాజా నివేదిక అంచనా
78% సెంటర్లలో కనీస ప్రమాణాల్లేవని గుర్తించిన కేంద్ర విద్యాశాఖ
అయినా ఏటా రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న శిక్షణా కేంద్రాలు
పోటీ పరీక్షల్లో వైఫల్యంతో మనోవేదనకు గురవుతున్న సగటు విద్యార్థులు
ఏటా వేలల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాల వెల్లడి
నష్ట నివారణకు కేంద్రం ప్రత్యేక కమిటీ వేసినా ఇంకా వెలువడని మార్గదర్శకాలు
కోచింగ్ సెంటర్లను నియంత్రించాలని రాష్ట్రానికి ఉన్నత విద్యామండలి సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్, సివిల్స్, గ్రూప్స్, టోఫెల్.. ఇలా రంగం ఏదైనా, ఎలాంటి పోటీ పరీక్షకైనా శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా వెలిసిన కోచింగ్ సెంటర్లు ఏటా రూ. వేల కోట్ల వ్యాపారం సాగిస్తున్నట్లు ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇన్ఫీనియం తాజా నివేదికలో పేర్కొంది. 2022 నాటికి దేశవ్యాప్తంగా రూ. 58 వేల కోట్లుగా ఉన్న కోచింగ్ సెంటర్ల వ్యాపారం.. ఈ ఏడాది నాటికి ఏకంగా రూ. 70 వేల కోట్లకు చేరిందని వెల్లడించింది. అలాగే 2028 నాటికి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
కోవిడ్ తర్వాత ఆన్‌లైన్, డిజిటల్ కోచింగ్ విధానం బాగా పెరగడం వల్ల కోచింగ్ కేంద్రాల వ్యాపారం పెరుగుదలకు దోహదపడుతోందని తెలిపింది. వ్యాపార మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి వీలుగా ప్రచారంపై ఏటా రూ. 150 కోట్లకుపైనే కోచింగ్ సెంటర్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే దేశంలోని 78 శాతం కోచింగ్ కేంద్రాల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు లేవని కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఆయా కేంద్రాల్లో నిపుణులైన అధ్యాపకులు ఉండట్లేదని.. సూక్ష్మ బోధన విధానం తప్ప సబ్జెక్టుపై దృష్టి పెట్టడం లేదని కనుగొంది. ఫలితంగా జేఈఈ, నీట్‌లో వివిధ రూపాల్లో ప్రశ్నలు వస్తే విద్యార్థులు సమాధానం ఇవ్వలేకపోతున్నారని అభిప్రాయపడింది.
విద్యార్థులపై ఒత్తిడి..
దేశవ్యాప్తంగా ఏటా జేఈఈ మెయిన్‌కు సుమారు 13 లక్షల మంది, నీట్‌కు 22 లక్షల మంది పోటీ పడుతుండటంతో కోచింగ్ సెంటర్లు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు మొత్తం విద్యార్థుల్లో మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ మిగతా వారికి పెద్దగా నాణ్యత లేని ఫ్యాకలీ్టతో కోచింగ్ ఇస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల్లో ర్యాంకులు రాని విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం 2013లో 8,423 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా 2022 నాటికి ఈ సంఖ్య 13,044కు పెరిగింది. 2025 చివరి నాటికి ఈ సంఖ్య 13 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. ర్యాంకుల కోసం కోచింగ్ కేంద్రాలు, తల్లిదండ్రుల ఒత్తిడి, విద్యార్థుల్లో పెరిగిన ఆందోళన, ఒంటరితనం ఆత్మహత్యలకు కారణమని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.
కట్టడికి కార్యాచరణ మొదలైనా..
కోచింగ్ సెంటర్ల ఒత్తిడి వల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని నిర్ణయించిన కేంద్ర విద్యాశాఖ.. ఇందుకోసం ఈ ఏడాది మొదట్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర ఉన్నత విద్యా కార్యదర్శి వినీత్ జోషి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సీబీఎస్‌ఈ చైర్మన్, పాఠశాల ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ మద్రాస్, తిరుచ్చి, కాన్పూర్ ఎన్‌ఐటీ, ఐఐటీ, ఎన్‌సీఈఆర్‌టీ ప్రతినిధులు సహా మరికొందరిని ఇందులో సభ్యులుగా చేర్చింది.
కోచింగ్‌తో పనిలేకుండా విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే కోణంలో పరిశీలించి నివేదిక ఇవ్వడంతోపాటు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ప్రచార, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని ఈ కమిటీని కేంద్రం ఆదేశించింది. పాఠశాల విద్యలో లోపాలు, క్రిటికల్ థింకింగ్ విధానాలు, పాఠశాల విద్య నుంచే పోటీ పరీక్షల సన్నద్ధత, కాలేజీల్లో కెరీర్ గైడెన్స్, ఒత్తిడి లేని సిలబస్ తీసుకురావడంపై కమిటీ అధ్యయనం చేయాలని సూచించింది. అయితే ఈ కమిటీ ఇప్పటివరకు సరైన మార్గదర్శకాలను సూచించలేదు.
ఉన్నత విద్యామండలి సిఫార్సులివి..
కోచింగ్ కేంద్రాల వల్ల జరిగే నష్టాన్ని కట్టడి చేయడానికి చట్టబద్ధ నియంత్రణ అవసరమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి ప్రభుత్వానికి ఇటీవల నివేదించారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా అందిన ఈ నివేదికలోని పలు సిఫార్సులు ఇవి..
⇒ కోచింగ్ సెంటర్లపై బలమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలి.
⇒ శిక్షణా కేంద్రాలకు గుర్తింపును తప్పనిసరి చేయాలి.
⇒ డేటా ప్రైవసీ చట్టాల పరిధిలోకి వాటిని తేవాలి.
⇒ ఆయా సెంటర్లపై ఫీజుల నియంత్రణ ఉండాలి. విదేశీ విద్యా కన్సల్టెంట్లు, ఆన్‌లైన్ విద్యా వేదికలు, సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ ప్రొవైడర్లు నియంత్రణ పరిధిలో ఉండాలి.
⇒ ఉన్నత విద్యా మండలి వద్ద కోచింగ్ కేంద్రాలు అనుమతి పొందేలా ఉండాలి. ఆయా కేంద్రాలను పర్యవేక్షించి ఏటా నాణ్యతను అధికారికంగా నిర్ణయించాలి.
⇒ ఉన్నత విద్యలో తృతీయ పక్షం జోక్యం వల్ల నాణ్యత దెబ్బతింటోంది.
⇒ ఆన్‌లైన్ వేదికలు, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అందిస్తున్న కోచింగ్ పారదర్శకంగా ఉండట్లేదు. గుర్తింపు లేని కోర్సులు, అర్హతలేని బోధకులు, పాత సిలబస్ వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. కోచింగ్ కేంద్రాలు లాభాలే తప్ప నాణ్యత పట్టించుకోవడం లేదు. అకడమిక్ పాఠాలతో ఒత్తిడి లేకుండానే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
తల్లిదండ్రులూ కారణమే
ర్యాంకులే తప్ప విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రులు అంచనా వేయడం లేదు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాల ప్రకారమే బోధించాలని పట్టుబడుతున్నారు. దీనివల్ల సగటు విద్యార్థులు మానసిక ఒత్తిడి గురవుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను తీర్చిదిద్దితే కోచింగ్‌తో పనే లేదు. – ఎంఎన్ రావు (జేఈఈ కోచింగ్ నిపుణుడు)
చట్టం తేవాల్సిందే
కోచింగ్ కేంద్రాల నియంత్రణకు పకడ్బందీ చట్టం తేవాలి. నాణ్యత లేని, నిపుణులు లేని కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై ఒత్తిడి పెంచి ర్యాంకులతో ప్రచారం చేసుకొనే కోచింగ్ కేంద్రాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. ఈ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తుతా. చట్టం తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా.
– పింగిలి శ్రీపాల్‌రెడ్డి (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ)