తుపాకీ విజయవాడలో మర్చిపోయా!!
ఎట్టకేలకు దారికొచి్చన భాను ప్రకాష్
వెతుకుతూ అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందాలు
సాక్షి,హైదరాబాద్: అంబర్‌పేట పోలీసుస్టేషన్‌లో క్రైం సబ్–ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన భాను ప్రకాష్ రెడ్డి నోరు విప్పాడు. తన సరీ్వస్ తుపాకీని విజయవాడ తీసుకువెళ్లానని, అక్కడి ఓ లాడ్జిలో మర్చిపోయానని వెల్లడించాడు. దీంతో ఆ పిస్టల్‌ను వెతుకుతూ నగరం నుంచి రెండు ప్రత్యేక బృందాలు గురువారం అక్కడకు వెళ్లాయి. మరోపక్క ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిన భాను ప్రకాష్ రెడ్డి గడిచిన మూడేళ్లల్లో ఏకంగా రూ.1.23 కోట్లు నష్టపోయినట్లు వెలుగులోకి వచ్చింది.
పుస్తకాల బ్యాగ్‌లో పిస్టల్ ఉంచి..
అంబర్‌పేట ఠాణాలో పని చేస్తూ భాను ప్రకాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పలు పోటీ పరీక్షలు రాశాడు. వాటికి సిద్ధం కావడానికే ఈ ఏడాది మే నుంచి రెండు నెలల పాటు సెలవులో ఉన్నాడు. నిత్యం తన టేబుల్ అరలో ఉండే తుపాకీని సెలవులో వెళ్తున్న సమయంలో తనతో పాటే తీసుకువెళ్లాడు. ఈ దృశ్యాలు పోలీసుస్టేషన్ సీసీ కెమెరాల్లో అస్పష్టంగా రికార్డు అయ్యాయి. పోటీ పరీక్షలు రాయడానికి విజయవాడ వెళ్లిన భాను ప్రకాష్‌రెడ్డి అక్కడి ఓ లాడ్జిలో దాదాపు వారం రోజులు బస చేశాడు. పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడల్లా ఆ పిస్టల్‌ను పుస్తకాల కోసం కేటాయించిన బ్యాగ్‌లో ఉంచాడు. లాడ్జి ఖాళీ చేసి తిరిగి ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో తుపాకీ ఉంచిన బ్యాగ్‌ను తనతో తెచ్చుకోవడం మర్చిపోయాడు.
ఏమీ ఎరగనట్లు..
నగరానికి చేరుకుని, డ్యూటీలో చేరిన నాలుగైదు రోజుల తర్వాత భాను ప్రకాష్‌కు తన పిస్టల్ పోయిన విషయం తెలిసింది. ఆలోచించిన అతగాడు పుస్తకాలతో పాటు తుపాకీ ఉన్న బ్యాగ్‌ను విజయవాడ లాడ్జిలో మర్చిపోయిన విషయం గుర్తించాడు. వెంటనే ఆ లాడ్జికి వెళ్లి ఆరా తీశాడు. అక్కడి నిర్వాహకుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో దాని ఆచూకీ లభించలేదు. దీనిపై అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇక్కడ అధికారులకు చెప్పినా తన ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని, భవిష్యత్తులో మరో ఉన్నత ఉద్యోగంలో చేరడానికి అడ్డు వస్తుందని భావించాడు. దీంతో ఏమీ ఎరగనట్లు మిన్నకుండిపోయాడు.
తమదైన శైలిలో ప్రశ్నించడంతో..
ఈ నెల 12న ఆయుధాల ఆడిటింగ్ జరగడంతో ఇతడి పిస్టల్ మిస్సైన విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి రకరకాలుగా చెబుతూ ఉన్నతాధికారులతో పాటు సహోద్యోగులను ఇతగాడు ముప్పతిప్పలు పెట్టాడు. ఆ తుపాకీని తాను పోలీసుస్టేషన్‌లోనే ఉంచానని, ఎవరో ఎత్తుకుపోయారని నమ్మించే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఇతగాడికి రికవరీ చేసిన బంగారం కుదువపెట్టిన చరిత్ర ఉండటంతో ఈ తుపాకీ కూడా తాకట్టు పెట్టి ఉంటాడని అధికారులు అనుమానించారు. అతగాడిని బుధవారం రాత్రి సికింద్రాబాద్‌లోని టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి తరలించి తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయం మొత్తం అతగాడు బయటపెట్టాడు. ఇప్పుడు గుర్తుకు వచి్చందని.. ఆ తుపాకీని విజయవాడలో మర్చిపోయానని వెల్లడించాడు.
టేబుల్ సొరుగులో తూటాలు
నగరం దాటి బయటకు వెళ్లేప్పుడు తన వెంట తుపాకీ తీసుకువెళ్లడం భాను ప్రకాష్‌కు అలవాటు. అలాంటి సందర్భాల్లో అందులో మ్యాగ్జైన్ ఉన్నప్పటికీ... తూటాలు మాత్రం తీసుకువెళ్లడు. ఈసారి తూటాలు అతడి టేబుల్ సొరుగులో ఉన్నతాధికారులకు లభించాయి. దీంతో కొంత వరకు ఊపిరి పీల్చుకున్న అధికారులు తుపాకీ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు అలవాటుపడిన భాను ప్రకాష్ తన జీతంతో పాటు కట్నకానుకలూ ఖర్చు చేసేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో అతడి తల్లి పొలం అమ్మి రూ.50 లక్షలు ఇచి్చనట్లు సమాచారం.


