అక్కడ రోలెక్స్ వాచీ కాజేసిన కానిస్టేబుల్
ఇంకో వస్తువు సొంతం చేసుకున్న మరొకరు
విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా చలామణి అయిన బత్తిని శశికాంత్ బిల్డర్లు, బడాబాబులకు టోకరా వేశాడు. ఈ ‘దొంగ పోలీసు’ ఇంట్లో మాత్రం పోలీసులు ‘దొంగలు’గా మారారు. ఈ వ్యవహారం పంపకాల్లో తేడా రావడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఒక రోలెక్స్ వాచీ స్వాధీనం చేసుకున్న అధికారులు మిగిలిన వాటిపై లోతుగా ఆరా తీస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా..
ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్ నగరంలోని షేక్‌పేటలోని అపర్ణా ఔరా అపార్ట్‌మెంట్స్‌లోని ఖరీదైన ఫ్లాట్‌లో ఉండేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఈ బీకాం గ్రాడ్యుయేట్ నకిలీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అవతారం ఎత్తాడు. తెలంగాణ స్టేట్ ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌లో పని చేస్తున్నానని, జాతీయ దర్యాప్తు సంస్థలో ఉన్నతాధికారినంటూ నమ్మబలికాడు. పలువురు బిల్డర్లు, వ్యాపారవేత్తలతో పాటు బడాబాబుల నుంచి భారీ మొత్తం స్వాహా చేశాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఫిల్మ్‌నగర్ పోలీసులు తక్షణం కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం బుధవారం తెల్లవారుజామున శశికాంత్‌ను అరెస్టు చేశారు.
సోదాలు చేస్తూ..
ఇంత వరకు కథ సజావుగానే నడిచింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అరెస్టుతో పాటు రికవరీలకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడే బాధితులకు అవసరమైన స్థాయిలో ఊరట లభిస్తుంది. దీనికోసం నిందితులు, వారి సంబంధీకులతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు చేస్తారు. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున పోలీసులు షేక్‌పేటలోని అపర్ణ ఔరా అపార్ట్‌మెంట్‌లో ఉన్న శశికాంత్ ఫ్లాట్‌కు వెళ్లారు. సాక్షుల సమక్షంలో తాళం తీసి, వీడియోగ్రఫీ మధ్య సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఈ పోలీసు బృందంలో ఉన్న ఓ కానిస్టేబుల్ కళ్లు నిందితుడి వార్డ్‌రోబ్‌లో ఉన్న ఖరీదైన రోలెక్స్ వాచీపై పడింది. వీడియో కెమెరాకు చిక్కకుండా ఆ వాచీని చేజిక్కించుకోగలిగినా.. అదే బృందంలో ఉన్న మరో కానిస్టేబుల్ కంట్లో పడ్డాడు. దీంతో అతడు మరికొన్ని వస్తువుల్ని కాజేశాడు.
పంపకాల్లో తేడాలు రావడంతో..
ఆనక వాటి పంపకాల విషయంలో వీరి మధ్య విభేదాలు తతెత్తాయి. దీంతో పరిస్థితి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. అలా ఈ పోలీసు ‘దొంగతనం’ వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దాదాపు విచారణ పూర్తి చేసిన అధికారి రోలెక్స్ వాచీతో పాటు మరికొన్ని వస్తువులు స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కానిస్టేబుళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందించారని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో వారిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది.


