
ఈ విటమిన్ లోపంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
మతిమరుపు, ఒత్తిడి, విసుగు, తిమ్మిర్ల వంటివి ఉంటే జాగ్రత్త పడాల్సిందే
పని ఒత్తిడితో వచ్చిన సమస్యగా భావించి తేలికగా తీసుకోవద్దంటున్న వైద్యులు
నిర్లక్ష్యం చేస్తే మెదడు, నాడీ వ్యవస్థకు శాశ్వత నష్టం జరుగుతుందని హెచ్చరిక
శాకాహారుల్లోనే ఈ సమస్య అధికమని గుర్తింపు.. తగిన చికిత్స పొందాలని సూచన
హైదరాబాద్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేసే 33 ఏళ్ల యువకుడు దాదాపు నాలుగేళ్లుగా మతిమరుపు, చిరాకు, కాళ్లు, చేతుల తిమ్మిర్లతో బాధపడుతున్నాడు. ఇటీవల సమస్య తీవ్రత పెరగడంతో ఓ న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాడు. అతని ఆహార అలవాట్ల గురించి డాక్టర్ అడగ్గా పూర్తి శాకాహారినని చెప్పాడు. దీంతో డాక్టర్ వెంటనే రోగి రక్తంలో విటమిన్ బీ12 స్థాయి ఎంత ఉందో పరీక్షించగా సాధారణంతో పోలిస్తే అతితక్కువగా ఉన్నట్లు తేలింది.
వెంటనే విటమిన్ బీ12 ఇంజెక్షన్లతో చికిత్స ప్రారంభించడంతో పాటు పాల ఉత్పత్తులతో కూడిన ఆహారాలను అధికంగా తీసుకోవాలని సూచించడంతో కొన్ని వారాల్లోనే ఆ యువకుడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడింది. తిమ్మిర్ల సమస్య సైతం దూరమైంది.
సాక్షి, హైదరాబాద్: చాలాసార్లు సాధారణ ఆరోగ్య సమస్యలుగా కనిపించేవే తీవ్ర అనారోగ్య లక్షణాలకు సూచికలుగా మారొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ మతిమరుపు, విసుగు, తిమ్మిర్ల వంటివి ఇబ్బంది పెడుతుంటే వాటిని పని ఒత్తిళ్ల వల్ల ఎదురవుతున్న సమస్యలుగా భావించొద్దని.. అవి శరీరంలో విటమిన్ బీ12 లోపానికి సంకేతం కావొచ్చని అంటున్నారు.
ఈ తరహా లక్షణాలపట్ల అవగాహన పెంచుకొని అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలని సూచిస్తున్నట్లు ముఖ్యంగా శాకాహారులు ఇలాంటి లక్షణాలతో సతమతమవుతుంటే తప్పనిసరిగా రక్తంలో విటమిన్ బీ12 స్థాయిలు తెలుసుకోవాలని చెబుతున్నారు. లక్షణాలను బట్టి వెంటనే మందులు వాడటం ద్వారా మెదడు, నరాలకు శాశ్వత నష్టం జరగకుండా నివారించవచ్చని పేర్కొంటున్నారు.
ఇలాంటి స్థితిని అధిగమించేందుకు విటమిన్ బీ12 సమృద్ధిగా ఉండే లేదా బీ12ను జోడించిన ఆహారాలను తరచూ తీసుకోవడం లేదా వైద్యులు సూచించే సప్లిమెంట్లు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
ఏమిటీ బీ12?
విటమిన్ బీ12 అనేది శరీరం తయారు చేసుకోలేని ఓ పోషకం. ఇది ప్రధానంగా మాంసాహారం, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటి నుంచి లేదా వైద్యపరంగా సప్లిమెంట్ల రూపంలో లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేసేలా చేయడంతోపాటు రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో బీ12 కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని కాలేయం ఐదేళ్ల వరకు నిల్వ చేసుకోగలదు.
కానీ శరీరంలో తగినంత బీ12 నిల్వలు లేకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ విటమిన్‌లో కోబాల్ట్ అనే ఖనిజం ఉంటుంది కాబట్టి దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. రక్త పరీక్ష ద్వారా బీ12 స్థాయిలు సాధారణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. రక్తంలో విటమిన్ బీ12 స్థాయి 70 పీఎంవోఎల్/ఎల్ (పికోమోల్స్ పర్ లీటర్)గా ఉంటే సాధారణం కింద లెక్క.
బీ12 లోపం వల్ల తలెత్తే లక్షణాలు...
» జ్ఞాపకశక్తి తగ్గుదల, అయోమయ భావన
» ఏకాగ్రత లోపం, స్పష్టమైన ఆలోచన కొరవడటం
» కుంగుబాటు భావన, చికాకు, అలసట, బడలిక, బలహీనంగా ఉన్న అనుభూతి కలగడం
» చేతులు, కాళ్లు మొద్దుబారినట్లు, తిమ్మిరిగా, దురదగా ఉండటం
» కంటి నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని ప్రసారం చేసే ఆప్టిక్ నాడి దెబ్బతినడం.
బీ 12 ప్రయోజనాలు...
» డీఎన్‌ఏ, ఎర్ర రక్త కణాల తయారీలో దోహదం.
» జుట్టు, గోర్లు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
» కేంద్ర నాడీ వ్యవస్థ (మెదడు, వెన్నెముక) అభివృద్ధికి కీలకం.
» ఆరోగ్యకరమైన ఎర్ర, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్ల తయారీకి బీ 12 అవసరం
» కొత్త ఎర్రరక్త కణాల పెరుగుదల, అభివృద్ధికి అవసరం.