ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పాక్‌కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయ్. ఇరు దేశాల మధ్య దాడుల కారణంగా అక్టోబర్ 11 నుంచి సరిహద్దులను మూసివేశారు. దీంతో పాకిస్తాన్ ప్రజలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఘర్షణల కారణంగా నిత్యవసరాలపై దీని ప్రభావం పడింది. పాక్‌లో టమాటా ధరలు ఐదు రెట్లు పెరిగి ఏకంగా కిలో టమాటాల ధర (Tomato Prices) 600లకు చేరింది.
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ బోర్డర్ మూసివేత వల్ల ఇరుదేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాక్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాక్‌లో ప్రస్తుతం కిలో టమాటాల ధర (Tomato Prices) 600 పాకిస్థానీ రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. ఇక, గురువారం టమాట ధర ఎనిమిది వందలకు సైతం చేరినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
breaking news
1KG tomato price 800 RS in Pakistan pic.twitter.com/ZQfgKSNdwl— M.Shaheedyar (rh) ⏺ (@Shaheedyar0313) October 22, 2025
ఇదిలా ఉండగా.. సాధారణంగా పాక్-ఆప్ఘన్ సరిహద్దు నుంచి ఏటా ఇరుదేశాల మధ్య 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ వెల్లడించారు. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం వాటిల్లుతుందన్నారు. ఆప్ఘన్ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైనట్లు తెలిపారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయాయని పాకిస్థాన్‌లోని ప్రధాన టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉన్న ఓ అధికారి పేర్కొన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఒక్కసారిగా నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు.


