ట్రంప్ లూప్ ఆగట్లే.. నెక్స్ట్ ఆపేది ఆ యుద్ధమేనంట!
ప్రపంచ శాంతికాముకుడిగా తనను తాను అభివర్ణించుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. నోబెల్ శాంతి బహుమతిని మాత్రం దక్కించుకోలేకపోయారు. అయితే ఈ ఫలితం తనను కుంగదీయబోదని, శాంతిని నెలకొల్పాలన్న తన ప్రయత్నాలను ఏమాత్రం ఆపబోదని అంటున్నారాయన. తాజాగా ఆయన మరో యుద్ధంపై కన్నేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం, ఈజిప్ట్‌లో జరగబోయే గాజా శాంతి సదస్సు నేపథ్యంతో పర్యటన బయల్దేరిన టైంలో ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో.. , యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరినని, తన పాలనలో ఎన్నో ప్రపంచ సంక్షోభాలు పరిష్కారం అయ్యాయని వ్యాఖ్యానించారాయన. అలాగే.. ప్రస్తుతం తన దృష్టి పాక్-అఫ్గన్ ఘర్షణలపై(Pak Afghan Clashes) ఉందని అన్నారు.ఇది నేను ఆపిన 8వ యుద్ధం(గాజా సంక్షోభాన్ని ఉద్దేశించి..). అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోందని విన్నాను. తిరిగి వచ్చాక దాని సంగతి చూస్తా. ఎందుకంటే.. యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని కదా అని వ్యాఖ్యానించారు. అయితే తన శాంతి ప్రయత్నాలు అవార్డులను తేలేకపోయినా(నోబెల్‌ను ఉద్దేశించి..) ప్రాణాలను నిలబెడుతోందని, అది తనకెంతో గౌరవాన్ని అందిస్తోందని వ్యాఖ్యానించారాయన.ఇదిలా ఉంటే.. పశ్చిమాసియా పర్యటనకు బయల్దేరే ముందు కూడా ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు(Trump On India Pak Tensions). భారత్-పాక్ మధ్య యుద్ధం టారిఫ్‌ల బెదిరింపులతోనే ఆగిందని పునరుద్ఘాటించారు. ‘‘భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి ఓసారి ఆలోచించండి. కొన్ని యుద్ధాలు మూడు, నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. లక్షల మంది మరణించారు. నేను వాటిని ఒక్క రోజులోనే ముగించాను. అది గొప్ప విషయం’’ అని అన్నారు. అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాలు యుద్ధానికి దిగాయి. దౌత్యంతో ప్రయత్నిద్దామనుకుంటే మాట వింటారా?. అందుకే సుంకాలు విధిస్తా అని బెదిరించా. 24 గంటలు గడవకముందే దెబ్బకు దిగొచ్చారు. లేకుంటే యుద్ధం ఆగి ఉండేదా? అని మే నెలలో జరిగిన భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. అఫ్కోర్స్.. ఈ కాల్పుల విమరణలో మూడో దేశం, వ్యక్తి.. ప్రేమయం లేదని, పాక్ కోరితేనే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ చెబుతూ వస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. పాక్-అఫ్గన్ సరిహద్దుల మధ్య గత రాత్రి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భీకర దాడులతో 58 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు అఫ్గన్ అధికారులు ప్రకటించారు. అయితే చనిపోయింది 23 మందేనని పాక్ సైన్యం అంటోంది. ఇదీ చదవండి: తాలిబన్ల దెబ్బ.. పాక్‌కు భారీ నష్టం