తాలిబాన్లతో మోదీ దోస్తీ.. ఇప్పుడే ఎందుకు? | why india and taliban alliance? | Sakshi
Sakshi News home page

తాలిబాన్లతో భారత్ దోస్తీ.. ఇప్పుడే ఎందుకు?

Nov 9 2025 7:53 PM | Updated on Nov 9 2025 8:14 PM

why india and taliban alliance?

1996లో తాలిబాన్ సర్కారును గుర్తించని భారత్

1999 ఎయిరిండియా విమానం హైజాక్ తర్వాత మరింత దూరం

2001లో ప్రజాస్వామ్య సర్కారుకు భారత్ అండదండలు

300 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయం అందించిన ఇండియా

2021లో తిరిగి తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్థాన్

తాజాగా భారత్‌కు ఆఫ్ఘన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ

తాలిబాన్.. పాకిస్థాన్‌లోని హక్కానీ యూనివర్సిటీలో పురుడుపోసుకుని.. ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారాన్ని చేపట్టిన దళం పేరది. ఎయిరిండియా విమానాన్ని పాక్ ముష్కరమూకలు హైజాక్ చేసి.. కాందహార్‌కు మళ్లించిన ఘటనకు ముందు నుంచే.. తాలిబాన్లను భారత్ ముప్పుగా భావించేది. ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం గుడ్ తాలిబాన్.. బ్యాడ్ తాలిబాన్ ఉండరంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించి.. తాలిబాన్ అంటేనే ఉగ్రవాదానికి మారుపేరు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.

అలాంటి తాలిబాన్లు ఇప్పుడు భారత్‌కు ఎందుకు మిత్రులవుతున్నారు? భారత్ ఇప్పుడు తాలిబాన్లను ఎందుకు ప్రోత్సహిస్తోంది? చరిత్రలోనే తొలిసారి తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీకి భారత్ ఎందుకు ఆతిథ్యమిచ్చింది. ఓ కరడుగట్టిన ఉగ్రవాదిగా ముత్తాకీపై అమెరికా ముద్రవేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సైతం ముత్తాకీపై ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇప్పుడు భారత్‌కు తాలిబాన్ల అవసరం ఎందుకొచ్చింది?? ఈ ప్రశ్నలపై ‘సాక్షి డిజిటల్’ విశ్లేషణాత్మక కథనం..

గుడ్ తాలిబాన్.. బ్యాడ్ తాలిబాన్?
ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల క్రితం, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాలుగేళ్ల క్రితం తాలిబాన్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్‌ను తిరిగి కైవసం చేసుకుని, అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. తాలిబాన్లు మొదటి సార్ భారత్‌వైపు స్నేహహస్తాన్ని చాచారు. తాలిబాన్ల విదేశాంగ మంత్రి ముత్తాకీ ఇటీవల అధికారికంగా న్యూఢిల్లీకి వచ్చారు. ఆయన రాక ఏమాత్రం పరోక్షం కాదు.. రహస్యం అంతకంటే కాదు. అంతా అధికారికమే. ముత్తాకీని ప్రపంచ దేశాలు సాధారణ రాయబారిగా కూడా గుర్తించలేదు. ఐక్యరాజ్య సమితి ఏకంగా ఆయన ప్రయాణాలపై నిషేధం విధించింది. ఈ ఒక్క కారణంతో.. భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని, ముత్తాకీని దేశంలోకి ఆహ్వానించింది.

అంతర్జాతీయంగా చర్చ
భారత్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు తెరతీసింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని పదేపదే ఐక్యరాజ్య సమితి వేదికగా చెప్పే భారత్‌కు ఉగ్రవాదులతో చర్చలు జరిపే అవసరమేమొచ్చిందనే ప్రశ్నలు తలెత్తాయి. తాలిబాన్లు మారారా? లేక భారత వైఖరిలో మార్పువచ్చిందా? ఈ ఆకస్మిక మార్పు ఎందుకు? అనే ప్రశ్నలతో అగ్రరాజ్యాలు నివ్వెరపోయాయి. భారత్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో పరోక్షంగా అమెరికాకు భారత్ ఓ గట్టి సందేశాన్ని ఇచ్చినట్లైంది. అంతేకాదు.. పాకిస్థాన్‌కు కూడా తాలిబాన్ల రూపంలో భారత్ చెక్ పెట్టినట్లైంది. ఇప్పటికే.. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులు కాల్పులతో హోరెత్తుతున్నాయి. సరిహద్దుల్లో పాకిస్థాన్‌కు చెందిన మూడు సైనిక పోస్టులను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా తాలిబాన్లతో మైత్రి!
తాలిబాన్లతో ఇప్పుడు భారత్ మైత్రి.. చరిత్రాత్మకమే అయినా.. ప్రత్యర్థులకు చెక్ పెట్టే బ్రహ్మాస్త్రమని విశ్లేషకులు చెబుతున్నారు. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. తొలుత చైనా రంగంలోకి దిగింది. ఆఫ్ఘన్‌లో ఉన్న సహజ, ఖనిజ వనరులపై దృష్టి సారించింది. ఆ తర్వాత తాలిబాన్లతో సంబంధాలను వేగంగా విస్తరించుకుంది. పొరుగునే ఉన్న పాకిస్థాన్ మాత్రం తాలిబాన్లకు దూరం అవుతూ వచ్చింది. అందుక్కారణం.. ఖైబర్ పంఖ్తుఖ్వాలో.. బలూచిస్థాన్‌లో తాలిబాన్లు పాక్ సైన్యానికి పంటికింద రాయిలా మారారు.

తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ పేరుతో ఏర్పడ్డ మిలిటెంట్ సంస్థ.. పాక్ సైన్యాన్ని టార్గెట్‌గా చేసుకుంటోంది. దీంతో.. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా సర్కారుకు పాక్ చాలా దగ్గరైంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తాలిబాన్ల మైత్రికి ఓకే చెప్పినట్లు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారత్ దీర్ఘకాలిక వ్యూహం
విశ్లేషణలు చెబుతున్న కారణాలేమైనా.. తాలిబాన్లను దరిచేర్చుకోవడం వెనక భారత్ దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. గత మూడు దశాబ్దాలుగా తాలిబాన్లతో భారత్ అంటీముట్టనట్లు వ్యవహరించింది. 90లలో తాలిబాన్లపై భారత్‌కు స్పష్టమైన దృక్పథం ఉండేది. 1996లో తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నాక.. భారత్ తాలిబాన్ల సర్కారును గుర్తించలేదు. హక్కానీ యూనివర్సిటీలో ఎదిగిన చెట్టే తాలిబాన్ కావడంతో.. ఆ సంస్థను భారత్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఓ ప్రాక్సీగానే పరిగణించింది. ఇస్లామాబాద్ తన ప్రభావాన్ని మధ్య ఆసియాలో విస్తరించడానికి ఓ సాధనంగా తాలిబాన్లను పెంచి పోషించిందనే భావన బలంగా ఉండేది.

అప్పట్లో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడిన నార్తర్న్ అలయెన్స్‌కి భారత్ పూర్తిస్థాయిలో మద్దతిచ్చింది. ఆఫ్ఘాన్ నాయకుడు అహ్మద్‌షా మసూద్ నేతృత్వంలోని బలగాలకు ఆర్థిక, రవాణా, లాజిస్టిక్స్ సాయాన్ని అందజేసింది. అప్పట్లో భారత్ దృష్టిలో తాలిబాన్ అనేది ఒక ప్రాంతీయ సమస్య కాదు.. ప్రపంచానికే పెద్ద ముప్పు..! 1999 డిసెంబరులో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ ఘటన తర్వాత.. ఆ విమానాన్ని కాందహార్‌కు మరల్చారు. తాలిబాన్లు హైజాకర్లకు ఆశ్రయం కల్పించారు.

176 మంది బందీల విడుదలకు భారత్ అజార్ మసూద్ సహా.. ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను విడుదల చేయాల్సి వచ్చింది. 2001లో అమెరికా, నాటో బలగాలు తాలిబాన్ సర్కారును కూల్చివేశాయి. దాంతో.. అమెరికా అండతో ఏర్పాటైన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి భారత్ మద్దతు పలికింది. ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంది. రోడ్లు, ఆనకట్టలు, పాఠశాలలను నిర్మించింది. ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని సైతం భారత్ నిర్మించిందే..! ఇలా అప్పట్లో ఆఫ్ఘన్ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మూడు బిలియన్ డాలర్లకు పైగా భారత్ సాయం అందించింది. ఆఫ్ఘన్‌ను ఆదుకున్న అతిపెద్ద దాతల్లో ఒకటిగా భారత్ నిలిచింది. తాలిబాన్ల అణచివేతకు సహకరించింది.

తాలిబాన్లకు పాక్ దూరందూరం
2021లో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ వెంటనే తాలిబాన్లు విజృంభించారు. అదే సంవత్సరం ఆగస్టులో తిరిగి అధికారంలోకి వచ్చారు. అప్పట్లో ఆఫ్ఘనిస్థాన్‌కు చైనా అండగా నిలిచింది. పాకిస్థాన్ కూడా మిత్రపక్షంగా ఉంటుందని అంతా భావించినా.. తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ రూపంలో ఆ మైత్రి దెబ్బతిన్నది. దాంతో.. పాక్ జెట్ విమానాలు ఆఫ్ఘన్‌పై దాడులు చేశాయి. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి.

అమెరికాకు షాక్?
పంటికింద రాయిలా పాకిస్థాన్ మారిపోవడం.. దాయాది దేశానికి అమెరికా వత్తాసు పలుకుతుండడంతో భారత్ చైనాకు దగ్గరైంది. అదే సమయంలో.. పాకిస్థాన్‌కు పంటికింద రాయిలా మారిన తాలిబాన్ల రూపంలో భారత్‌కు ఓ కొత్త మైత్రి కనిపించింది. 30 ఏళ్లపాటు తాలిబాన్లను శత్రువులుగా భావించిన భారత్.. తన వైఖరిని మార్చుకుంది. ముఖ్యంగా పాకిస్థాన్‌ను ఇరకాటంలో పెట్టడం అనే వ్యూహంతో తాలిబాన్ల సర్కారును గుర్తించి, ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకిని భారత్‌కు ఆహ్వానించింది.

ముత్తాకీ పర్యటన ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నా.. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం అసాధారణమైనదే..! కానీ, భారత ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతోనే ఈ అడుగు వేసినట్లు స్పష్టమవుతోంది. ఆఫ్ఘన్ భూభాగాన్ని భారత వ్యతిరేక, శత్రు దేశాలు ఉపయోగించకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఆఫ్ఘన్‌లో మళ్లీ వనరుల కల్పనకు భారత్ సిద్ధమైంది. ఈ పరిణామాలను పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోయింది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసి.. విఫలమైంది. ఈ పరిణామాలు భారత్‌కు దౌత్య విజయాన్ని అందించినట్లైంది. ఈ విషయంలో పాకిస్థాన్‌పై భారత్ పైచేయి సాధించింది. తాలిబాన్లు కూడా చరిత్రలో తొలిసారి పాకిస్థాన్‌ను కాదని భారత్ పంచన చేరారు. బహిరంగంగా భారత్‌కు మద్దతు పలికారు.

ఇక ఆఫ్ఘన్‌లో పెట్టుబడులు!
నిజానికి భారత్ ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లో బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. చౌబహార్ పోర్టును అభివృద్ధి చేసింది. తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే.. భారత్‌తో దూరం పెరిగింది. ఇప్పుడు తాలిబాన్లు స్నేహహస్తం చాచడంతో.. ఆఫ్ఘన్ పోర్టులను భారత్ వినియోగించుకునే అవకాశాలుంటాయి. సైనిక సాయం అందించే సూచనలున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్ నౌకాదళాన్ని కరాచీ పోర్టుకే కట్టడి చేయగలిగిన భారత్.. అటువైపు ఆఫ్ఘన్ పోర్టులు కూడా ఊతంగా ఉంటే.. పాకిస్థాన్‌కు దబిడి దిబిడేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాలిబాన్లతో సత్సంబంధాలు కొనసాగితే.. సముద్ర వాణిజ్యం పెరుగుతుంది. ఆఫ్ఘన్‌లో లిథియం, రాగి, రియర్ ఎర్త్ మెటల్స్ సంపద అధికంగా ఉంది. వాటిని వెలికితీసే టెక్నాలజీ, స్తోమత తాలిబాన్లకు లేదు. ఈ విషయంలో భారత్ గనక తాలిబాన్లకు సాయమందిస్తే.. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి భారీ ఉపశమనం కలుగుతుంది. టెక్నాలజీ పరిశ్రమలకు, హార్డ్‌వేర్ రంగానికి ఊతం లభిస్తుంది. చైనా ఇప్పటికే తాలిబాన్లతో మైనింగ్ ఒప్పందాలను కుదుర్చుకోగా.. భారత్ కూడా అలాంటి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలున్నాయి.

ఈ విధానాన్ని ఎంగేజ్‌మెంట్ వితౌట్ రికగ్నిషన్ అంటారు. పాశ్చాత్య దేశాలు, అమెరికా కూడా ఖనిజ సంపద ఎక్కువగా ఉండే దేశాలతో దోస్తీ చేసి.. అక్కడి ఖనిజ సంపదను వెలికి తీస్తాయి. 2022 నుంచే భారత్ ఆఫ్ఘన్‌లో టెక్నికల్ మిషన్‌ను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు ఇరుదేశాల మధ్య మైత్రికి ఆ మిషన్ దోహదపడింది. తాజా పరిణామాలతో ఆఫ్ఘన్ పౌరుల కోసం భారత్ వీసా సేవలను పునరుద్ధరించింది. అంటే.. మెడికల్ వీసా, స్టూడెంట్ వీసా, బిజినెస్ వీసాలు తిరిగి కొనసాగుతున్నాయి. ఈ అంశం చిన్నదిగా కనిపించినా.. భారత్ నిర్ణయం వెనక భారీ వ్యూహమే ఉంది.

భిన్న సిద్ధాంతాల దోస్తీ నిలిచేనా?
అయితే.. ఇప్పటికీ ప్రపంచదేశాలు ఈ మైత్రిపై పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఒక దేశం ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు..! మరొకటి పూర్తిగా ఇస్లామిక్ షరియత్‌ను అమలు చేస్తుంది. ఒకదేశంలో స్త్రీపురుషులు సమానమే అన్న భావన ఉంటే.. మరో దేశంలో బాలికలు విద్యను అభ్యసించడానికి అనర్హులు..! ఒక దేశం బేటీ బచావో.. బేటీ పడావో అంటే.. మరోదేశం మలాలా లాంటి విద్యార్థినులపై తూటాల వర్షం కురిపిస్తుంది..! విలువలకు కట్టిబడి ఉండేది ఒకదేశమైతే.. ఇస్లామిక్ సిద్ధాంతాలను మాత్రమే పాటించేది మరొకటి..! యత్ర నార్యంతు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతః అనే సిద్ధాంతంతో స్త్రీలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారనే భావన ఒక దేశానిదైతే.. స్త్రీలు కేవలం తమకు సుఖాన్ని అందించే బానిసలని భావించేది మరో దేశం..!

ఇలాంటి భిన్న భావాలుండే రెండు దేశాల మధ్య మైత్రి దీర్ఘకాలం కొనసాగుతుందా? అని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో.. తాలిబాన్లకు భారత్ అండగా ఉంటే.. ఆఫ్ఘన్‌లో శాంతి ఫరిడవిల్లుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే.. జియోపాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నిర్వివాదాంశం..! ఇరు దేశాలకు కావాల్సింది పరస్పర ప్రయోజనాలే. ఆఫ్ఘనిస్థాన్‌కు ఇప్పుడు భారత్ ఓ భద్రత అయితే.. భారత్‌కు ఆఫ్ఘన్ ఓ భౌగోళిక వ్యూహం.

ఈ వ్యూహంతో భారత్‌కు చిరకాల శత్రువుగా ఉన్న పాకిస్థాన్.. అడపాదడపా సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడే చైనా అప్రమత్తంగా ఉంటాయి. పాక్‌ వెనకాల పెద్దన్నలా నిలబడుతున్న అమెరికా కూడా ఆచితూచి అడుగులు వేసే అవకాశాలుంటాయి. ఇరుదేశాలు కూడా స్వప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ మైత్రి దోహదపడుతుందనడంలో సందేహం లేదు. ఇరు దేశాలకూ ఇదో సర్వైవల్ స్ట్రాటజీ. అంటే.. ఎవరితో స్నేహం చేస్తామన్నది తెలివైన నిర్ణయం కాదు..! ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదన్నదే తెలివైన నిర్ణయం..! భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమంటారు..? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
- హెచ్.కమలాపతిరావు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement